YouVersion Logo
Search Icon

సామెత 3

3
జ్ఞానం వలన కలిగే ఆశీర్వదం
1కుమారా, నేను బోధించే ఉపదేశాన్ని మనసులో ఉంచుకో. నేను బోధించే ఆజ్ఞలు హృదయపూర్వకంగా ఆచరించు.
2అవి నీకు మనశ్శాంతితో కూడిన ఆయుష్షును, సుఖంగా జీవించే కాలాన్ని కలగజేస్తాయి.
3అన్ని వేళలా దయ, సత్య ప్రవర్తన కలిగి ఉండు. వాటిని మెడలో హారాలుగా ధరించుకో. నీ హృదయమనే పలక మీద వాటిని రాసుకో.
4అప్పుడు దేవుని కృప, మనుషుల కృప పొంది నీతిమంతుడవని అనిపించుకుంటావు.
5నీ స్వంత తెలివితేటలపై ఆధారపడకుండా మనస్ఫూర్తిగా యెహోవాను నమ్ముకో.
6ఆయన అధికారానికి నిన్ను నీవు అప్పగించుకో. అప్పుడు ఆయన నీ మార్గాలన్నీ సరళం చేస్తాడు.
7నేను జ్ఞానం గలవాణ్ణి అనుకోవద్దు. యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండి చెడుతనానికి దూరంగా ఉండు.
8అప్పుడు నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగుతాయి.
9యెహోవాకు నీ రాబడి మొత్తంలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో వాటా ఇచ్చి ఆయనను ఘనపరచు.
10అలా చేస్తే నీ వాకిట్లో ధాన్యం సమృద్ధిగా ఉంటుంది. నీ గానుగల్లో కొత్త ద్రాక్షారసం పొంగి పారుతుంది.
11కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.
12ఒక తండ్రి తన ప్రియమైన కొడుకును ఎలా గద్దిస్తాడో అలాగే యెహోవా తాను ప్రేమించే వాళ్ళను గద్దిస్తాడు.
13జ్ఞానం సంపాదించుకుని, వివేకం కలిగి ఉన్న మనిషి ధన్యుడు.
14వెండి వలన పొందే లాభం కన్నా జ్ఞానం సంపాదించుకోవడం మంచిది. మేలిమి బంగారం సంపాదించుకోవడం కన్నా జ్ఞానం వలన లాభం పొందడం ఉత్తమం.
15రత్నాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. అది నీకు ఇష్టమైన అన్ని వస్తువుల కంటే విలువైనది.
16జ్ఞానం కుడి చేతిలో సుదీర్ఘమైన ఆయుష్షు, ఎడమ చేతిలో సంపదలు, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి.
17అది నడిపించే దారులు రమ్యమైనవి. దాని విధానాలు క్షేమం కలిగించేవి.
18దాన్ని అనుసరించే వాళ్ళకు అది జీవఫలాలిచ్చే వృక్షం. దాన్ని అలవరచుకునే వాళ్ళు ధన్యజీవులు.
19తన జ్ఞానంతో యెహోవా భూమిని సృష్టించాడు. వివేకంతో ఆయన ఆకాశ మండలాలను స్థిరపరచాడు.
20ఆయన తెలివివల్ల జలరాసులు అగాథం నుండి ప్రవహిస్తున్నాయి. ఆకాశంలోని మేఘాలు మంచు బిందువులు కురిపిస్తున్నాయి.
21కుమారా, లోతైన జ్ఞానాన్ని, వివేకాన్ని పదిలం చేసుకో. వాటిని నీ మనసులో నుండి తొలగి పోనివ్వకు.
22జ్ఞానం, వివేకాలు నీకు ప్రాణప్రదంగా, నీ మెడలో అలంకారాలుగా ఉంటాయి.
23అప్పుడు నువ్వు నడిచే మార్గాల్లో భద్రంగా ఉంటావు. నీ నడక ఎప్పుడూ తొట్రుపడదు.
24పండుకొనే సమయంలో నీకు భయం వెయ్యదు. నీవు పండుకుని హాయిగా నిద్రపోతావు.
25అకస్మాత్తుగా భయం వేస్తే కలవరపడకు. దుర్మార్గులు నాశనం అవుతున్నప్పుడు అది చూసి నువ్వు భయపడవద్దు.
26యెహోవాయే నీకు అండగా ఉంటాడు. నీ కాలు ఊబిలో చిక్కుకోకుండా ఆయన నిన్ను కాపాడతాడు.
27అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి నీకు అవకాశం ఉన్నప్పుడు దాన్ని చేయడానికి వెనకడుగు వెయ్యవద్దు.
28నీ పొరుగువాడు కోరినది నీ దగ్గర ఉంటే “రేపు ఇస్తాను పోయి రా” అనవద్దు.
29నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు.
30నీకేమీ కీడు తలపెట్టని వాడితో కారణం లేకుండా పోట్లాడవద్దు.
31దౌర్జన్యం చేసేవాణ్ణి చూసి అసూయ పడవద్దు. వాడు చేసే పనులు నువ్వు చెయ్యాలని ఏమాత్రం కోరుకోవద్దు.
32కుటిల బుద్ధి గలవాణ్ణి యెహోవా అసహ్యించుకుంటాడు. నీతిమంతులకు ఆయన తోడుగా ఉంటాడు.
33దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు.
34ఎగతాళి చేసేవాళ్ళను ఆయన ఎగతాళి చేస్తాడు. దీనమనస్సు గలవారిని ఆయన కనికరిస్తాడు.
35జ్ఞానం గలవారు పేరుప్రతిష్టలు సంపాదించుకుంటారు. జ్ఞానం లేనివాళ్ళు అవమానాలకు గురౌతారు.

Currently Selected:

సామెత 3: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in