YouVersion Logo
Search Icon

సామెత 31

31
రాజైన లెమూయేలు మాటలు
1రాజైన లెమూయేలు మాటలు, అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి, 2కుమారా, నేనేమంటాను? నేను కన్న కుమారా, నేనేమంటాను? నా మొక్కులు మొక్కి కనిన కుమారా, నేనే మంటాను? 3నీ బలాన్ని స్త్రీలకియ్యకు. రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసం చేయ వద్దు.
4ద్రాక్షారసం తాగడం రాజులకు తగదు. లెమూయేలు, అది రాజులకు తగదు. అధికారులు “ద్రాక్ష మద్యం ఏది?” అని అడగడం తగదు.
5తాగితే వారు చట్టాలను విస్మరిస్తారు. దీనులందరి హక్కులనూ కాలరాస్తారు.
6ప్రాణం పోతున్నవాడికి మద్యం ఇవ్వండి. మనోవేదన గలవారికి ద్రాక్షారసం ఇవ్వండి.
7వారు తాగి తమ పేదరికాన్ని మర్చిపోతారు. తమ కష్టాన్ని జ్ఞాపకం చేసుకోరు.
8మూగవారి పక్షంగా మాట్లాడు. దిక్కులేని వారికి న్యాయం జరిగేలా నీ నోరు తెరువు.
9నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చు. దీనులకు బాధ పడేవారికి దరిద్రులకు న్యాయం చెయ్యి.
గుణవతియైన భార్య
10సమర్థురాలైన భార్య ఎవరికి దొరుకుతుంది? అలాటిది బంగారు ఆభరణాల కంటే అమూల్యమైనది.
11ఆమె భర్త ఆమెపై నమ్మకం పెట్టుకుంటాడు. అతడు పేదవాడు కావడం అంటూ ఉండదు.
12ఆమె తన జీవిత కాలమంతా అతనికి మేలే చేస్తుంది గాని కీడేమీ చేయదు.
13ఆమె గొర్రె బొచ్చును అవిసెనారను సేకరిస్తుంది. తన చేతులారా వాటితో పని చేస్తుంది.
14వర్తకపు ఓడలు దూర ప్రాంతం నుండి ఆహారం తెచ్చేలా ఆమె దూరం నుండి ఆహారం తెచ్చుకుంటుంది.
15ఆమె చీకటితోనే లేచి, తన యింటి వారికి భోజనం సిద్ధపరుస్తుంది. తన సేవికలకు జీతం నిర్ణయిస్తుంది.
16ఆమె పొలం చూసి దాన్ని కొంటుంది. కూడబెట్టిన డబ్బుతో ద్రాక్షతోట నాటిస్తుంది.
17ఆమె బలం ధరించుకుంటుంది. చేతులతో బలంగా పని చేస్తుంది.
18తనకు లాభం చేకూర్చే వాటిని గుర్తిస్తుంది. రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.
19ఆమె నేత కదురును చేతబట్టుకుంటుంది. తన వ్రేళ్లతో కదురు పట్టుకుని వడుకుతుంది.
20దీనులకు తన చెయ్యి చాపుతుంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటుంది.
21తన ఇంటివారికి చలి తగులుతుందని ఆమెకు భయం లేదు. ఆమె కుటుంబమంతా జేగురు రంగు బట్టలు వేసుకుంటారు.
22ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది. ఆమె బట్టలు సన్నని నారబట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు.
23ఆమె భర్త దేశపు పెద్దలతో కూర్చుంటాడు. ఊరి మొగసాల దగ్గర అతనికి పేరుప్రతిష్టలు ఉంటాయి.
24ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది. నడికట్లను వర్తకులకు అమ్ముతుంది.
25బలం, ఘనత ఆమెకు వస్త్రాలు. ఆమె భవిషత్తు విషయమై నిర్భయంగా ఉంటుంది.
26ఆమె తన నోరు తెరిచి జ్ఞాన వాక్కులు పలుకుతుంది. కృపా భరితమైన ఉపదేశం ఆమె చేస్తుంది.
27ఆమె తన ఇంటివారి ప్రవర్తన బాగా కనిపెట్టి చూస్తుంటుంది. పనిచేయకుండా ఆమె భోజనం చేయదు.
28ఆమె కొడుకులు ఆమెను ధన్య అంటారు. ఆమె పెనిమిటి ఆమెను పొగడుతాడు.
29“చాలామంది ఆడపడుచులు చక్కగా ప్రవర్తించారు గానీ, నువ్వు వారందరినీ మించిపోయావు” అంటాడు.
30చక్కదనం మోసకరం. సౌందర్యం వ్యర్థం. యెహోవా పట్ల భయభక్తులు గల స్త్రీని అందరూ ప్రశంసిస్తారు.
31ఆమె చేసిన పనుల ప్రతిఫలం ఆమెకు ఇవ్వండి. ఊరి ద్వారం దగ్గర ఆమె పనులు ఆమెను కొనియాడతాయి.

Currently Selected:

సామెత 31: IRVTel

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in