YouVersion Logo
Search Icon

కీర్తన 37

37
దావీదు కీర్తన
1చెడ్డ వారిని చూసి నువ్వు క్షోభపడకు. అధర్మంగా ప్రవర్తించే వాళ్ళని చూసి అసూయ పడకు.
2ఎందుకంటే వాళ్ళు గడ్డిలాగా త్వరలోనే ఎండిపోతారు. పచ్చటి మొక్కల్లా వాడి పోతారు.
3యెహోవాలో నమ్మకం ఉంచు. ఏది మంచిదో దాన్నే చెయ్యి. దేశంలో స్థిరపడి విశ్వసనీయతను ఆచరించు.
4తర్వాత యెహోవాలో ఆనందించు. నీ హృదయంలోని ఆశలన్నిటినీ ఆయన తీరుస్తాడు.
5నీ జీవిత గమనాన్ని యెహోవాకు అప్పగించు. ఆయనలో నమ్మకముంచు. ఆయన నీ తరుపున పని చేస్తాడు.
6పగటి వెలుగులా నీ న్యాయవర్తననూ, మధ్యాహ్నపు వెలుగులా నీ నిర్దోషత్వాన్నీ ఆయన చూపిస్తాడు.
7యెహోవా ఎదుట మౌనంగా ఉండు. సహనంతో ఆయన కోసం వేచి ఉండు. దుర్మార్గాలు చేసి ఎవరన్నా విజయం సాధిస్తే చింతించకు. ఎవరన్నా కుట్రలు చేస్తే విచారించకు.
8కోపపడకు. నిరుత్సాహపడకు. చింతపడకు. దానివల్ల సమస్యలు కలుగుతాయి.
9దుర్మార్గకార్యాలు చేసే వాళ్ళు నిర్మూలం అవుతారు. కానీ యెహోవా కోసం వేచి చూసే వాళ్ళు దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు.
10ఇక కొద్ది కాలంలోగా దుర్మార్గుడు లేకుండా పోతాడు. అతడున్న స్థలాన్ని నువ్వు ఎంత వెదికినా అతడు కనిపించడు.
11నమ్రత గలవాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. గొప్ప సమృద్ధి కలిగి సంతోషిస్తారు.
12దుష్టుడు ధర్మాత్ముడికి వ్యతిరేకంగా కుట్రలు చేస్తాడు. వాడు అతనికి విరోధంగా పళ్ళు కొరుకుతాడు.
13వాళ్ళ సమయం అయిపోవచ్చింది కాబట్టి ప్రభువు వాళ్ళను చూసి నవ్వుతాడు.
14అణచివేతకి గురైన వాళ్ళనీ పేదలనీ నిరుత్సాహపరచడానికీ, నిజాయితీగా ఉండేవాళ్ళనీ చంపడానికీ దుష్టులు తమ కత్తులు దూశారు. తమ విల్లును వంచారు.
15వాళ్ళ కత్తులు వాళ్ళ గుండెల్నే చీల్చివేస్తాయి. వాళ్ళ విల్లులు విరిగిపోతాయి.
16దుష్టుల దగ్గర ఉన్న సమృద్ధి కంటే ధర్మాత్ముడి దగ్గర ఉన్న కొంచెమే శ్రేష్ఠమైనది.
17దుష్టుల చేతులు విరిగిపోతాయి. కానీ యెహోవా ధర్మాత్ములను కాపాడతాడు.
18యెహోవా నిందారహితులను ప్రతిరోజూ కనిపెట్టుకుని ఉంటాడు. వాళ్ళ వారసత్వం నిత్యమూ ఉంటుంది.
19రోజులు బాగా లేనప్పుడు వాళ్ళకు అవమానం కలగదు. కరువు కాలంలో వాళ్ళకు చాలినంత ఆహారం ఉంటుంది.
20అయితే దుష్టులు నశించిపోతారు. యెహోవా విరోధుల కీర్తి పచ్చిక బయళ్ళ చందంగా ఉంటుంది. వాళ్ళు సమసిపోయి పొగలాగా కనిపించకుండా పోతారు.
21దుష్టులు అప్పు చేస్తారు, కానీ తిరిగి చెల్లించరు. కానీ ధర్మాత్ములు దయతో దానం చేస్తారు.
22యెహోవా ఆశీర్వదించిన వాళ్ళు భూమిని స్వాధీనం చేసుకుంటారు. ఆయన ఎవరినైతే శపిస్తాడో వాళ్ళు నాశనమౌతారు.
23దేవుని దృష్టిలో ఏ వ్యక్తి మార్గం కొనియాడదగ్గదిగా ఉందో ఆ వ్యక్తి నడతను యెహోవా స్థిరపరుస్తాడు.
24యెహోవా అతని చెయ్యి పట్టుకుని ఉన్నాడు కాబట్టి అతడు తన మార్గంలో తడబడినా కిందపడడు.
25నేను ఒకప్పుడు చిన్నవాడిగా ఉన్నాను. ఇప్పుడు పెద్దవాణ్ణి అయ్యాను. అయితే నీతిమంతుడు అనాథ కావడం గానీ, లేదా అతడి పిల్లలు అడుక్కోవడం గానీ నేను చూడలేదు.
26అతడు రోజంతా దయతో అప్పులిస్తూ ఉంటాడు. అతని పిల్లలు ఆశీర్వాదంగా ఉంటారు.
27చెడు నుండి మళ్ళుకో. ఏది మంచిదో దాన్ని చెయ్యి. అప్పుడు నువ్వు కలకాలం సురక్షితంగా ఉంటావు.
28ఎందుకంటే యెహోవా న్యాయాన్ని ప్రేమిస్తాడు. విశ్వాసంతో తనను అనుసరించే వాళ్ళను ఆయన విడిచిపెట్టడు. వాళ్ళను శాశ్వతంగా భద్రపరుస్తాడు. అయితే దుర్మార్గుల సంతానం నాశనం అవుతుంది.
29నీతిమంతులు భూమిని స్వాధీనం చేసుకుంటారు. అక్కడ వాళ్ళు కలకాలం జీవిస్తారు.
30నీతిమంతుని నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. అది న్యాయాన్ని అధికం చేస్తుంది.
31అతని హృదయంలో అతని దేవుని ధర్మశాస్త్రం ఉంది. అతని అడుగులు జారవు.
32దుర్మార్గుడు ధర్మాత్ముణ్ణి గమనిస్తూ ఉంటాడు. అతణ్ణి చంపడానికి చూస్తూ ఉంటాడు.
33అయితే యెహోవా అతణ్ణి దుష్టుడి చేతిలో వదిలిపెట్టడు. అతనికి తీర్పు జరిగే సమయంలో నేరం మోపడు.
34యెహోవా కోసం వేచి ఉండు. ఆయన మార్గాన్ని అనుసరించు. భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఆయన నిన్ను లేపుతాడు. దుర్మార్గులు నిర్మూలమైనప్పుడు నువ్వు చూస్తావు.
35భీకరుడైన దుర్మార్గుడు స్వంత నేలలో పెరిగిన పెద్ద పచ్చని చెట్టులా విస్తరించడం నేను చూశాను.
36అయితే నేను ఆ దారిన వెళ్ళినప్పుడు నేను వాడి కోసం చూశానుగానీ వాడు నాకు కనిపించలేదు.
37చిత్తశుద్ధి కలిగిన వ్యక్తిని గమనించు. యథార్ధంగా ఉండే వాణ్ణి కనిపెట్టు. శాంతి కోసం జీవించేవాడికి మంచి భవిష్యత్తు ఉంటుంది.
38పాపులు సమూలంగా నాశనం అవుతారు. దుర్మార్గుడికి భవిష్యత్తు ఉండదు.
39నీతిపరులకు యెహోవా దగ్గరనుండే ముక్తి కలుగుతుంది. వేదన సమయంలో ఆయన వాళ్ళను కాపాడతాడు.
40యెహోవా వాళ్ళని దుర్మార్గుల బారినుంచి రక్షిస్తాడు. ఎందుకంటే వాళ్ళు ఆయనలో ఆశ్రయం పొందారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in