YouVersion Logo
Search Icon

కీర్తన 50

50
ఆసాపు కీర్తన
1శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు.
2పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.
3మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.
4తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.
5బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.
6ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు.
7నా ప్రజలారా, వినండి. నేను మాట్లాడతాను. నేను దేవుణ్ణి. మీ దేవుణ్ణి.
8నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. మీ దహనబలులు ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.
9నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను.
10ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.
11కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే.
12నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే.
13ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?
14దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.
15సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.
16కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి?
17ఆదేశాలను నువ్వు అసహ్యించుకుంటావు. నా మాటలు పట్టించుకోకుండా తోసివేస్తావు.
18నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు. వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు.
19ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది.
20కూర్చుని నీ సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. నీ స్వంత సోదరుడిపై అపనిందలు మోపుతావు.
21నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగానే ఉన్నాను. దాంతో నన్ను నీతో సమానంగా జమ కట్టావు. కానీ నేను నువ్వు చేసిన పనులన్నిటినీ నీ కళ్ళ ఎదుటికి తీసుకువస్తాను. నిన్ను గద్దిస్తాను.
22దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఈ సంగతి ఆలోచించండి. లేదా నేను మిమ్మల్ని ముక్కలుగా చీల్చి వేస్తాను. మీకు సహాయం చేయడానికి ఎవరూ రారు.
23కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in