YouVersion Logo
Search Icon

కీర్తన 55

55
ప్రధాన సంగీతకారుని కోసం. తీగెల వాయిద్యాలపై పాడేది. దావీదు రాసిన దైవధ్యానం
1దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు.
2నా మనవి విని నాకు జవాబు ఇవ్వు. నాకున్న కష్టాల వల్ల నాకు నెమ్మది లేదు.
3ఎందుకంటే నా శత్రువులు చేస్తున్న పెద్ద శబ్దాల వల్ల, దుర్మార్గులు చేస్తున్న బలాత్కారాల వల్ల నేను చింతలో మునిగిపోయి మూలుగుతున్నాను. వాళ్ళు నన్ను ఎంతగానో కష్టాలపాలు చేస్తున్నారు. ఆగ్రహంతో నన్ను హింసిస్తున్నారు.
4నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయం నాకు కలుగుతున్నది.
5దిగులు, వణుకు నాకు కలుగుతున్నాయి. తీవ్ర భయం నన్ను ముంచెత్తింది.
6ఆహా, నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను.
7త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను.
8పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను.
9పట్టణంలో హింస, కలహాలు నేను చూశాను. ప్రభూ, అలాటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి. వారి మాటలు తారుమారు చెయ్యి.
10రాత్రింబగళ్లు వారు పట్టణ సరిహద్దుల్లో తిరుగుతున్నారు. అక్కడ అంతా పాపం, చెడుతనం జరుగుతూ ఉంది.
11అక్కడ దుర్మార్గం కొనసాగుతూ ఉంది. అణచివేత, కపటం దాని వీధుల్లో జరుగుతూనే ఉన్నాయి.
12నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైతే నేను దాన్ని సహించేవాడినే. నా పైకి లేచినవాడు నా పగవాడు కాడు. అదే అయితే నేను దాక్కోవచ్చు.
13ఆ పని చేసింది నువ్వు అంటే నా నెచ్చెలివి, నా చెలికాడివి. నా ప్రియమిత్రుడివి.
14మనం కలిసి మధుర సహవాసం అనుభవించాం. ఉత్సవంగా దేవుని మందిరానికి వెళ్లాం.
15చావు వారి మీదికి అకస్మాత్తుగా ముంచుకు వస్తుంది. ప్రాణంతోనే వారు పాతాళానికి దిగిపోతారు. ఎందుకంటే చెడుతనం వారి ఇళ్ళలో, వారి అంతరంగంలో ఉంది.
16అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు.
17సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు.
18నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు.
19పూర్వకాలం నుండి ఉన్న దేవుడు మారుమనస్సు లేనివారికి, తనకు భయపడని వారికి జవాబు చెబుతాడు.
20నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు. వారితో తాను చేసిన నిబంధన మీరాడు.
21అతని నోటి మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. కాని అతని హృదయం నిండా కలహం ఉంది. అతని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి గానీ అవి నిజానికి దూసుకు వస్తున్న కత్తులు.
22నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.
23దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in