YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 10

10
(6) ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానాలు విఫలం అయినట్టు కనిపించడం వారి అపనమ్మకం మూలానే
1సోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలనేదే నా హృదయవాంఛ, వారి గురించిన నా ప్రార్థన. 2దేవుని విషయంలో వారు బహు ఆసక్తి గలవారని వారి గురించి సాక్షమిస్తున్నాను. అయితే వారి ఆసక్తి జ్ఞానయుక్తమైంది కాదు. 3అయితే వారికి దేవుని నీతి విషయంలో అవగాహన లేదు. కాబట్టి తమ స్వనీతిని స్థాపించాలని చూస్తూ దేవుని నీతికి విధేయత చూపలేదు. 4విశ్వసించే ప్రతివాడికీ నీతి కలగడానికి క్రీస్తు ధర్మశాస్త్రానికి ముగింపు పలికాడు. 5ధర్మశాస్త్ర మూలమైన నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవిస్తాడని మోషే రాస్తున్నాడు. 6అయితే విశ్వాసమూలమైన నీతి ఇలా చెబుతున్నది, “పరలోకానికి ఎవడు ఎక్కిపోతాడు? (అంటే క్రీస్తును కిందకి తేవడానికి). 7లేక అగాధంలోకి ఎవడు దిగిపోతాడు? (అంటే క్రీస్తును చనిపోయిన వారిలో నుండి పైకి తేవడానికి) అని నీ హృదయంలో అనుకోవద్దు.”
8కానీ ఆ నీతి ఏమి చెబుతున్నదో చూడండి,
“దేవుని వాక్కు మీకు దగ్గరగా, మీ నోటిలో,
మీ హృదయంలో ఉంది.”
మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్కు కూడా ఇదే. 9అదేమంటే యేసును ప్రభువుగా నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనను చనిపోయిన వారిలో నుండి సజీవంగా లేపాడని నీ హృదయంలో నమ్మితే, నీకు రక్షణ కలుగుతుంది. 10ఎలాగంటే మనిషి నీతి కోసం హృదయంలో నమ్ముతాడు, పాప విమోచన కోసం నోటితో ఒప్పుకుంటాడు. 11“ఆయనలో నమ్మకం ఉంచిన వారెవరూ సిగ్గుపడరు” అని దేవుని వాక్కు చెబుతున్నది. 12ఇందులో యూదులూ, గ్రీకులూ అనే వ్యత్యాసం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభువు. ఆయన తనకు ప్రార్థన చేసే వారందరికీ కృప చూపగల సంపన్నుడు. 13ఎందుకంటే ప్రభువు నామంలో ప్రార్థన చేసే వారందరికీ పాపవిమోచన కలుగుతుంది. 14నమ్మని వాడికి వారు ఎలా ప్రార్థన చేస్తారు? తాము వినని వాడిపై ఎలా నమ్మకం పెట్టుకుంటారు? ఆయన్ని గురించి ప్రకటించేవాడు లేకుండా వారెలా వింటారు? 15ప్రకటించే వారిని పంపకపోతే ఎలా ప్రకటిస్తారు? దీన్ని గురించి, “శ్రేష్ఠమైన వాటిని గురించిన శుభ సమాచారం అందించే వారి పాదాలు ఎంతో అందమైనవి” అని రాసి ఉంది. 16అయితే అందరూ సువార్తకు లోబడలేదు. “ప్రభూ, మా సందేశాన్ని ఎవరు నమ్మారు?” అని యెషయా చెబుతున్నాడు కదా? 17కాబట్టి వినడం ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినడం క్రీస్తు గురించిన మాట ద్వారా కలుగుతుంది.
18అయినా, నేను చెప్పేదేమంటే, “వారు వినలేదా? విన్నారు గదా?
వారి స్వరం భూలోకమంతటిలోకీ,
వారి మాటలు భూదిగంతాలకు చేరాయి.”
19నేనింకా చెప్పేదేమంటే, “ఇశ్రాయేలు ప్రజలకు ఇది తెలియలేదా? మోషే ముందుగా మాట్లాడుతూ,
“అసలు జాతి అని పిలవడానికి వీలు లేని వారి వలన మీలో రోషం పుట్టిస్తాను.
తెలివి లేని ప్రజల వలన మీకు కోపం కలిగేలా చేస్తాను” అని అన్నాడు.
20తరువాత యెషయా ధైర్యంగా ఇలా అన్నాడు,
“నన్ను వెదకనివారు నన్ను కనుగొన్నారు.
నా గురించి అడగని వారికి నేను ప్రత్యక్షమయ్యాను.”
21ఇశ్రాయేలు విషయమైతే అతడు, “అవిధేయులై ఎదురు తిరిగి మాట్లాడుతున్న ప్రజలవైపు నేను రోజంతా నా చేతులు చాస్తూనే ఉన్నాను” అని చెబుతున్నాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for రోమా పత్రిక 10