YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 5

5
విశ్వాసం ద్వారా మనిషిని నిర్దోషిగా తీర్చడం మూలంగా కలిగిన ఏడు ఫలితాలు
1విశ్వాసం ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చాడు కాబట్టి మన ప్రభు యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. 2ఆయన ద్వారా మనం విశ్వాసం వలన ఈ కృపలో ప్రవేశించి, అందులో కొనసాగుతూ దేవుని మహిమ గురించిన నిశ్చయతలో ఆనందిస్తున్నాం. 3-4అంతే కాదు, కష్టాలు ఓర్పునూ, ఓర్పు యోగ్యతనూ, యోగ్యత ఆమోదాన్నీ కలిగిస్తాయని తెలిసి మన కష్టాల్లో ఆనందించుదాం. 5ఈ నమ్మకం మనలను నిరాశపరచదు. ఎందుకంటే దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తన ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించాడు.
6ఎందుకంటే మనం బలహీనులుగా ఉండగానే, సరైన సమయంలో క్రీస్తు భక్తిహీనుల కోసం చనిపోయాడు. 7నీతిపరుని కోసం సైతం ఎవరైనా చనిపోవడం అరుదు. మంచివాడి కోసం ఎవరైనా చనిపోడానికి ఒకవేళ తెగించవచ్చు. 8అయితే దేవుడు మన మీద తన ప్రేమను వ్యక్తపరిచాడు. ఎలాగంటే మనమింకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. 9కాబట్టి ఇప్పుడు ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్పు పొంది, మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించుకుంటాం. 10ఎందుకంటే మనం శత్రువులుగా ఉండి, ఆయన కుమారుని మరణం ద్వారా దేవునితో సమాధానపడితే, ఆయన జీవం చేత ఇంకా నిశ్చయంగా రక్షణ పొందుతాము. 11అంతేకాదు, మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా ఇప్పుడు సమాధాన స్థితి పొందాము కాబట్టి ఆయన ద్వారా మనం దేవునిలో ఆనందిస్తున్నాం.
మూడవ భాగం-పవిత్రపరచడం. అంతరంగంలో పాపం, దానికి సువార్త ద్వారా నివారణ.
(1) ఆదాము ద్వారా పాపం, మరణం
12ఇదిలా ఉండగా, ఒక మనిషి ద్వారా పాపం ఎలా ఈ లోకంలోకి ప్రవేశించిందో, అలాగే పాపం ద్వారా మరణం ప్రవేశించింది. మనుషులంతా పాపం చేయడం వలన చావు అందరికీ దాపురించింది. 13ఎందుకంటే ధర్మశాస్త్రం రాక ముందు కూడా లోకంలో పాపం ఉంది గాని ధర్మశాస్త్రం లేదు కాబట్టి దేవుడు వారిపై పాపం ఆరోపించలేదు. 14అయినా, ఆదాము కాలం నుండి మోషే కాలం వరకూ మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతని వలే పాపం చెయ్యని వాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది. ఆదాము రాబోయే వాడికి ఒక సూచనగా ఉన్నాడు.
(2) క్రీస్తు ద్వారా నిర్దోషత్వం, జీవం
15కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఎలాగంటే ఒకడి అపరాధం వలన చాలా మంది చనిపోయారు. అయితే దేవుని అనుగ్రహం, యేసు క్రీస్తు అనే ఒక మనిషి కృప వలన కలిగిన ఉచిత కృపాదానం మరి నిశ్చయంగా అనేకమందికి సమృద్ధిగా కలిగింది. 16పాపం చేసిన ఒక్కడి వలన శిక్ష కలిగినట్టు ఆ కృపాదానం కలగ లేదు. ఎందుకంటే తీర్పు ఒక్క అపరాధం మూలంగా వచ్చి శిక్షకు కారణమయ్యింది. కృపావరమైతే అనేక అపరాధాల మూలంగా వచ్చి మనుషులను నీతిమంతులుగా తీర్చడానికి కారణమయ్యింది. 17మరణం ఒక్కడి అపరాధం మూలంగా వచ్చి ఆ ఒక్కడి ద్వారానే ఏలితే విస్తారమైన కృప, నీతి అనే కానుక పొందేవారు జీవం కలిగి మరింత నిశ్చయంగా యేసు క్రీస్తు అనే ఒకడి ద్వారానే ఏలుతారు.
18కాబట్టి తీర్పు ఒక్క అపరాధం ద్వారా వచ్చి, మనుషులందరిపై శిక్షకు ఏ విధంగా కారణమయ్యిందో, ఆలాగే ఒక్క నీతి కార్యం వలన కృపాదానం మనుషులందరికీ జీవప్రదమైన నీతి కలగడానికి కారణమయ్యింది. 19ఎందుకంటే ఒకడి అవిధేయత అనేకమందిని పాపులుగా ఎలా చేసిందో, ఆలాగే ఒకడి విధేయత అనేక మందిని నీతిమంతులుగా చేస్తుంది. 20ధర్మశాస్త్రం ప్రవేశించడం వలన అపరాధం విస్తరించింది. అయినా పాపం మరణాన్ని ఆధారం చేసుకుని ఏవిధంగా ఏలిందో, 21అదే విధంగా శాశ్వత జీవం కలగడానికి నీతి ద్వారా కృప మన ప్రభు యేసు క్రీస్తు మూలంగా ఏలడానికి పాపం విస్తరించిన చోటెల్లా కృప అపరిమితంగా విస్తరించింది.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for రోమా పత్రిక 5