YouVersion Logo
Search Icon

తీతు పత్రిక 1

1
స్థానిక సంఘాల్లో దైవ క్రమం
1దేవుడు ఎన్నుకున్న వారి విశ్వాసాన్ని స్థిరపరచడం కోసం, వారు దైవ భక్తికి అనుగుణమైన సత్యం గురించిన ఎరుకలో నిలకడగా ఉండేలా, 2అబద్ధమాడలేని దేవుడు కాలానికి ముందే వాగ్దానం చేసిన శాశ్వత జీవం గురించిన నిశ్చయతలో పౌలు అనే నేను దేవుని సేవకుణ్ణి, యేసు క్రీస్తు అపొస్తలుణ్ణి. 3సరైన సమయంలో ఆయన ఇప్పుడు మన రక్షకుడైన దేవుని ఆజ్ఞ ప్రకారం నాకు అప్పగించిన సందేశం వలన తన వాక్కును వెల్లడి చేశాడు.
4మన అందరి ఉమ్మడి విశ్వాసం విషయంలో నా సొంత కుమారుడు తీతుకు రాస్తున్న లేఖ. తండ్రియైన దేవుని నుండీ, మన రక్షకుడైన క్రీస్తు యేసు నుండీ కృప, కరుణ, శాంతి సమాధానాలు నీకు కలుగు గాక.
5నేను నీకు ఆదేశించినట్టు నువ్వు ఇంకా క్రమపరచని వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలోని క్రీస్తు ప్రభువు సంఘంలో పెద్దలను నియమించడం కోసం నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చాను.
6సంఘపెద్ద నిందకు చోటివ్వనివాడూ ఒకే భార్య కలవాడై ఉండాలి. అతని పిల్లలు లెక్కలేనితనంగా క్రమశిక్షణ లేనివారు అనే పేరు లేకుండా విశ్వాసులై ఉండాలి. 7అధ్యక్షుడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడు కాబట్టి నిందారహితుడుగా ఉండాలి. అతడు అహంకారి, ముక్కోపి, ద్రాక్ష మద్యానికి అలవాటు పడినవాడు, దెబ్బలాడేవాడు, దురాశపరుడు అయి ఉండకూడదు. 8అతిథి ప్రియుడు, మంచిని ప్రేమించేవాడు, ఇంగిత జ్ఞానం గలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశలను అదుపులో ఉంచుకొనేవాడు, 9నమ్మదగిన బోధను స్థిరంగా చేపట్టడం ద్వారా క్షేమకరమైన సిద్ధాంతం బోధిస్తూ ప్రజలను హెచ్చరించడంలో, ఎదిరించే వారి వాదాలను ఖండించడంలో సమర్ధుడుగా ఉండాలి.
10ఎందుకంటే అక్రమకారులు, ముఖ్యంగా సున్నతి పొందిన వారు చాలామంది ఉన్నారు. వారి మాటలు ఎందుకూ పనికి రానివి. వారు మనుషులను తప్పుదారి పట్టిస్తారు. 11వారి నోళ్ళు మూయించడం అవసరం. వారు సిగ్గుకరమైన స్వలాభం కోసం బోధించకూడని వాటిని బోధిస్తూ, కుటుంబాలను పాడు చేస్తున్నారు.
12వారిలో ఒకడు, వారి స్వంత ప్రవక్తే ఇలా అన్నాడు, ‘క్రేతు ప్రజలు ఎంతసేపూ అబద్ధికులు, ప్రమాదకరమైన దుష్టమృగాలు, సోమరులైన తిండిబోతులు.’ 13-14ఈ మాటలు నిజమే. అందుచేత వారు యూదుల కల్పిత గాథలనూ, సత్యం నుండి మళ్ళిన వారి ఆజ్ఞల గురించి సమయం వ్యర్థం చేసుకోకుండా పట్టించుకోకుండా విశ్వాసంలో స్థిరపడడం కోసం వారిని కఠినంగా మందలించు.
15పవిత్రులకు అన్నీ పవిత్రమే. కానీ అపవిత్రులకు, అవిశ్వాసులకు ఏదీ పవిత్రం కాదు. కానీ వారి హృదయం, వారి మనస్సాక్షి కూడా అపవిత్రాలే. 16దేవుడు తమకు తెలుసని వారు చెప్పుకొంటారు గాని తమ క్రియల వలన దేవుడెవరో తమకు తెలియదు అన్నట్టు ఉన్నారు. నిజానికి వారు అసహ్యులు, అవిధేయులు, ఎలాంటి సత్కార్యం విషయంలోనూ పనికి రానివారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in