YouVersion Logo
Search Icon

తీతు పత్రిక 2

2
కాపరి పరిచర్య
1అయితే నీవు ఆరోగ్యకరమైన ఉపదేశానికి అనుకూలమైన సంగతులను బోధించు. 2వృద్ధులు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగా, వివేకంతో మెలుగుతూ విశ్వాసం, ప్రేమ, సహనంలో శుద్ధంగా ఉండాలి.
3అలాగే వృద్ధ స్త్రీలు గౌరవప్రదంగా, పుకార్లు పుట్టించేవారుగా కాకుండా ఉండాలి. అస్తమానం మద్యపానంలో మునిగి తేలుతూ ఉండకూడదు. నడవడిలో భయభక్తులు గలిగి మంచి విషయాలు నేర్పుతూ ఉండాలి. 4-5దేవుని వాక్యానికి చెడ్డ పేరు రాకుండేలా తమ భర్తలను, పిల్లలను ప్రేమతో చూసుకోవాలని యువతులను ప్రోత్సహిస్తూ, మనసును అదుపులో ఉంచుకుంటూ, శీలవతులుగా, తమ ఇంటిని శ్రద్ధగా చక్కబెట్టుకొనేవారుగా, తమ భర్తలకు లోబడుతూ ఉండాలని వృద్ధ స్త్రీలు వారికి బోధించాలి.
6అలానే మనసు అదుపులో ఉంచుకోవాలని యువకులను హెచ్చరించు. 7నిన్ను వ్యతిరేకించేవాడు నీ గురించి చెడ్డ మాటలేవీ చెప్పలేక సిగ్గుపడే విధంగా అన్ని మంచి పనుల విషయంలో నిన్ను నీవే ఆదర్శంగా కనపరచుకో. 8నీ ఉపదేశం యథార్థంగా, మర్యాదపూర్వకంగా, విమర్శకు చోటియ్యనిదిగా ఉండాలి.
9-10మన రక్షకుడైన దేవుని గూర్చిన బోధ అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా దాసులు అన్నివిషయాల్లో తమ యజమానులకు విధేయులై ఉండాలి. తమ యజమానులను ఎదిరించక అన్ని విషయాల్లో వారిని సంతోషపెట్టాలి. పనివారు యజమానులకు ఎదురు చెప్పకూడదు. దొంగతనం చేయకూడదు. సంపూర్ణ విశ్వాసపాత్రులుగా ఉండాలి. మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని ఇతరులకు ఆకర్షణీయంగా చేయాలి. ఈ సంగతులు వారికి బోధించు.
11చూడు, ఎందుకంటే మానవాళికి రక్షణ కారకమైన దేవుని కృప వెల్లడి అయింది. 12-13మంగళకరమైన నిరీక్షణ నిమిత్తం మహా దేవుడు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తూ భక్తిహీనతనూ, ఈ లోక సంబంధమైన దురాశలనూ వీడి, ఈ యుగంలో నీతితో, భక్తితో జీవించమని అది మనకు నేర్పుతుంది.
14ఆయన సమస్తమైన విచ్చలవిడి పనుల నుండి మనలను విమోచించి, మంచి పనులు చేయడంలో ఆసక్తిగల ప్రజలుగా పవిత్రపరచి తన సొత్తుగా చేసుకోడానికి తనను తానే మన కోసం అర్పించుకున్నాడు. 15వీటిని గూర్చి బోధించు. సంపూర్ణమైన అధికారంతో హెచ్చరించు, ఖండించు. ఎవరూ నిన్ను నిర్లక్ష్యం చేయకుండా చూసుకో.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in