YouVersion Logo
Search Icon

జెకర్యా 1

1
దేవుని వైపు తిరుగుటకు పిలుపు
1దర్యావేషు పాలించే కాలంలో రెండవ సంవత్సరం ఎనిమిదవ నెలలో యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన వాక్కు.
2“యెహోవా మీ పూర్వీకుల మీద తీవ్రంగా కోపం తెచ్చుకున్నాడు. 3కాబట్టి నువ్వు వాళ్ళతో ఇలా చెప్పు. సేనల ప్రభువు యెహోవా సెలవిచ్చేది ఏమిటంటే, మీరు నావైపు తిరిగిన పక్షంలో నేను మీ వైపు తిరుగుతాను. ఇదే సేనల ప్రభువు యెహోవా వాక్కు. 4మీరు మీ పూర్వీకుల వలే ఉండవద్దు. పూర్వికులైన ప్రవక్తలు ఇలా ప్రకటించారు. సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే, మీ దుర్మార్గతను, మీ దుష్ట క్రియలను మానుకుని ప్రవర్తించమని వారికి ప్రకటించినప్పటికీ వాళ్ళు వినలేదు. నా మాట ఆలకించలేదు. ఇదే యెహోవా వాక్కు.”
5“మీ పితరులు ఏమయ్యారు?
ప్రవక్తలు కలకాలం జీవిస్తారా?
6అయినప్పటికీ నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలు, కట్టడలు మీ పూర్వీకుల విషయంలో నెరవేరాయి గదా. అవి నెరవేరినప్పుడు వాళ్ళు ‘మళ్ళీ మన ప్రవర్తన బట్టి, క్రియలను బట్టి, యెహోవా మనకు చేయాలని సంకల్పించినదంతా మనకు చేశాడు’ అని చెప్పుకున్నారు.”
గంజి చెట్ల మధ్య కనిపించిన వ్యక్తి
7దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం శెబాటు అనే 11 వ నెల 24 వ రోజున యెహోవా వాక్కు బెరక్యా కొడుకు, ఇద్దో మనుమడు, ప్రవక్త అయిన జెకర్యాకు ప్రత్యక్షమయింది. 8రాత్రి సమయంలో ఎర్రని గుర్రం ఎక్కిన ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు ఉన్న గుర్రాలు, తెల్లని గుర్రాలు కనబడ్డాయి. 9అప్పుడు నేను “స్వామీ, ఇవి ఏమిటి?” అని అడిగినప్పుడు నాతో మాట్లాడే దూత “ఇవి ఏమిటో నేను నీకు చెబుతాను” అన్నాడు.
10అప్పుడు గొంజి చెట్లలో నిలబడి ఉన్న వ్యక్తి “ఇవి లోకమంతా సంచరించడానికి యెహోవా పంపిన గుర్రాలు” అని చెప్పాడు. 11అప్పుడు అవి గొంజి చెట్ల మధ్య నిలబడి ఉన్న యెహోవా దూతతో “మేము లోకమంతా సంచరించి వచ్చాము. లోకంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ప్రశాంతంగా ఉన్నారు” అన్నాడు. 12అప్పుడు యెహోవా దూత “సేనల ప్రభువు యెహోవా, 70 సంవత్సరాల నుండి నీవు యెరూషలేము మీదా, యూదా పట్టణం మీదా కోపగిస్తూ ఉన్నావు. ఎంతకాలం పాటు వాళ్ళపై కనికరం చూపకుండా ఉంటావు?” అని వేడుకున్నాడు. 13నాతో మాటలాడిన దూతకు యెహోవా ఆదరణకరమైన సున్నితమైన మాటలతో జవాబిచ్చాడు.
14అప్పుడు నాతో మాట్లాడుతున్న దూత నాతో ఇలా అన్నాడు “నువ్వు ఈ విధంగా ప్రకటించాలి, సేనల ప్రభువు యెహోవా ఇలా చెబుతున్నాడు. నాకు యెరూషలేము, సీయోనుల విషయంలో అమితమైన ఆసక్తి ఉంది. 15ఏమీ పట్టనట్టు ఉన్న ఇతర దేశాల ప్రజలపై నాకు తీవ్రమైన కోపం ఉంది. ఇంతకు ముందు నాకున్న కోపం స్వల్పమే గానీ వారు కీడును వృద్ది చేసుకున్నారు. 16కాబట్టి యెహోవా చెప్పేది ఏమిటంటే, కనికరం చూపాలన్న ఆసక్తితో నేను యెరూషలేము వైపు చూస్తున్నాను. అందులో నా మందిరాన్ని కడతారు. యెరూషలేము మీద శిల్పకారులు కొలనూలు లాగి కొలతలు వేస్తారు. ఇది యెహోవా వాక్కు. 17నీవు ఇంకా ప్రకటించాల్సింది ఏమిటంటే, ఇకపై నా పట్టణాలు మరింత ఎక్కువగా భోగభాగ్యాలతో నిండి పోతాయి. యెహోవా సీయోనుకు ఓదార్పు కలిగిస్తాడు. యెరూషలేముపై ఆయన మరింత మక్కువ చూపుతాడు.”
నాలుగు కొమ్ములు, నలుగురు కంసాలిలు
18ఆ తరువాత నేను కన్నులెత్తి చూసినప్పుడు నాలుగు కొమ్ములు కనిపించాయి. 19“ఇవి ఏమిటి?” అని నేను నాతో మాట్లాడుతున్న దూతను అడిగాను. అతడు “ఇవి యూదా ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలను, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు” అని బదులిచ్చాడు.
20అప్పుడు నలుగురు కంసాలి పనివారిని యెహోవా నాకు చూపించాడు. 21“వీళ్ళు ఏమి చేయబోతున్నారు?” అని నేను అడిగాను. ఆయన “ఇవి ఎవ్వరూ తల ఎత్తకుండా యూదా ప్రజలను చెదరగొట్టిన కొమ్ములు. యూదా దేశ నివాసులను చెదరగొట్టడానికి వారిపై దురాక్రమణ జరిగించిన అన్య దేశాల ప్రజలను భయపెట్టడానికి కొమ్ములను నేలమట్టం చేయడానికి ఈ కంసాలి పనివాళ్ళు వచ్చారు” అని నాకు బదులిచ్చాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in