YouVersion Logo
Search Icon

జెఫన్యా 2

2
1సిగ్గుమాలిన ప్రజలారా, రండి. గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు సమయం గతించిపోతోంది.
2విధి నిర్ణయం కాకమునుపే,
యెహోవా కోపాగ్ని మీ మీదికి రాక మునుపే,
మిమ్మల్ని శిక్షించడానికి యెహోవా ఉగ్రత దినం రాకమునుపే కూడి రండి. 3దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించే దీనులారా, యెహోవాను వెదకండి.
మీరు వెతికి వినయంతో నీతిని అనుసరిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు భద్రంగా ఉంటారేమో.
ఫిలిష్తీయుల వారికి శిక్ష
4గాజా పట్టణం నిర్జనమై పోతుంది.
అష్కెలోను పాడై పోతుంది.
మధ్యాహ్నవేళలో అష్డోదువారిని బయటికి తరిమి వేయడం జరుగుతుంది.
ఎక్రోను నగరాన్ని దున్నేస్తారు.
5సముద్రప్రాంతాల్లో నివసించే కెరేతీయులారా, మీకు బాధ.
ఫిలిష్తీయుల దేశమైన కనానూ,
నిన్ను గూర్చి యెహోవా చెప్పేదేమిటంటే నీలో ఒక్కడూ కాపురం ఉండకుండా నేను నిన్ను లయం చేస్తాను.
6సముద్రప్రాంతం గొర్రెల కాపరులు విశ్రాంతి తీసుకునే మేత స్థలం అవుతుంది.
మందలకు దొడ్లు అక్కడ ఉంటాయి.
7తమ దేవుడైన యెహోవా యూదా వారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా,
అక్కడ వారిలో శేషించిన వారికి ఒక స్థలం ఉంటుంది.
వారు అక్కడ తమ మందలు మేపుతారు.
చీకటి పడ్డాక వారు అష్కెలోను ఇళ్ళలో నిద్రపోతారు.
మోయాబు, అమ్మోను వారికి శిక్ష
8మోయాబువారు వేసిన నింద,
అమ్మోనువారు పలికిన దూషణ మాటలు నాకు వినబడ్డాయి.
వారు నా ప్రజల సరిహద్దుల్లో ప్రవేశించి అహంకారంగా వారిని దూషించారు.
9నా జీవం తోడు మోయాబు దేశం సొదొమ పట్టణం వలె,
అమ్మోను దేశం గొమొర్రా పట్టణం వలె అవుతాయి#2:9 ఆది. 19:23-29 చూడండి.
అవి ముళ్ళ చెట్లకు ఉప్పు గోతులకు స్థావరమై ఎప్పుడూ పాడుబడిపోయి ఉంటాయి.
నా ప్రజల్లో శేషించినవారు ఆ దేశాలను దోచుకుంటారు.
నా ప్రజల్లో శేషించినవారు వాటిని స్వతంత్రించుకుంటారు.
కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సేనలప్రభువు యెహోవా వాక్కు ఇదే.
10వారు అతిశయపడి సేనల ప్రభువు అయిన యెహోవా ప్రజలను దూషించారు గనక వారి గర్వాన్నిబట్టి అది వారికి సంభవిస్తుంది.
11ద్వీపాల్లో నివసించే వారంతా తమ స్థలాల నుండి తనకే నమస్కారం చేసేలా లోకంలోని దేవుళ్ళను ఆయన నిర్మూలం చేస్తాడు.
యెహోవా వారికి భయంకరుడుగా ఉంటాడు.
12కూషీయులారా, మీరు కూడా నా ఖడ్గం చేత హతమైపోతారు.
13ఆయన ఉత్తరదేశం మీద తన హస్తం చాపి అష్షూరు దేశాన్ని నాశనం చేస్తాడు.
నీనెవె పట్టణాన్ని పాడు చేసి దాన్ని ఆరిపోయిన ఎడారిలాగా చేస్తాడు.
14దానిలో మందలు విశ్రమిస్తాయి.
అన్ని జాతుల పశువులు మందలుగా కూడుతాయి.
పక్షులు, గుడ్లగూబలు వారి ద్వారాల పైకమ్ముల మీద వాలుతాయి.
పక్షుల శబ్దాలు కిటికీల్లో వినబడతాయి.
గడపల మీద నాశనం కనిపిస్తుంది.
వారు చేసికున్న దేవదారు కర్రపని అంతటిని యెహోవా నాశనం చేస్తాడు.
15“నాలాంటి పట్టణం మరొకటి లేదని మురిసి పోతూ ఉత్సాహ పడుతూ నిశ్చింతగా ఉండిన పట్టణం ఇదే.
అయ్యో, అది పాడైపోయింది. అడవి జంతువులు పడుకునే ఉనికిపట్టు అయింది.”
అని దారిన పోయేవారంతా చెప్పుకుంటూ,
ఈసడింపుగా దాని వైపు చెయ్యి ఆడిస్తారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in