YouVersion Logo
Search Icon

అపొస్తలుల 28

28
మెలితే ద్వీపం
1తీరం చేరుకున్నాక ఆ ద్వీపాన్ని “మెలితే” అంటారని తెలుసుకున్నాము. 2ఆ ద్వీపంలో నివసించేవాళ్ళు మాపై చాలా దయచూపారు. అప్పుడు వర్షం కురుస్తూవుంది. చలి తీవ్రంగా ఉంది. వాళ్ళు చలిమంటలు వేసి మమ్మల్ని కూడా రమ్మన్నారు. 3పౌలు కట్టెలు ప్రోగుచేసి ఆ మోపును మంటపై వేసాడు. ఆ కట్టెల మోపునుండి ఒక పాము ఆ వేడికి తట్టుకోలేక వెలుపలికి వచ్చి, పౌలు చేతిని కరిచి దాని పళ్ళతో పట్టుకుంది. 4ఆ ద్వీపవాసులు పౌలు చేతికి పాము వ్రేలాడి ఉండటం చూసి తమలో తాము, “ఇతడు తప్పక ఒక హంతకుడై ఉండాలి! సముద్రంనుండి తప్పించుకున్నాడు కాని, దేవుడతన్ని బ్రతుకనివ్వలేదు” అని అనుకున్నారు.
5కాని పౌలు, ఆ పామును మంటలోకి దులిపి వేసాడు. అతనికి ఏ హాని కలుగలేదు. 6వాళ్ళు అతని శరీరం వాచి పోతుందనో, లేక అతడు అకస్మాత్తుగా చనిపోతాడనో అనుకొని చాలా సేపు కాచుకున్నారు. అతనికి ఏ హాని కలగక పోవటం గమనించి, వాళ్ళు తమ మనస్సును మార్చుకొని, “అతడు ఒక దేవత” అని అన్నారు.
7ఆ ప్రక్కనున్న పొలాలు “పొప్లి” అనే అతనికి చెందినవి. పొప్లి ఆ ద్వీపానికి అధికారి. అతడు మమ్మల్ని తన యింటికి ఆహ్వానించి మూడు రోజుల దాకా అతిథిసత్కారాలు చేసాడు. 8పొప్లి తండ్రి జ్వరంతో, చీమునెత్తురు విరేచనాలతో మంచం పట్టి ఉన్నాడు. పౌలు అతణ్ణి చూడటానికి వెళ్ళాడు. దేవుణ్ణి ప్రార్థించి పౌలు తన చేతుల్ని అతని తలపై ఉంచాడు. వెంటనే అతనికి నయమైపోయింది. 9ఈ విధంగా జరిగిన తర్వాత ఆ ద్వీపంలో ఉన్న మిగతా రోగులు కూడా వచ్చారు. వాళ్ళక్కూడా నయమైపోయింది.
10ఆ ద్వీప వాసులు మమ్మల్ని ఎన్నో విధాలుగా గౌరవించి మేము ప్రయాణమయ్యేముందు మాకు కావలసిన సామగ్రి నిచ్చారు.
రోమాకు రావటం
11చలికాలమంతా ఆ ద్వీపంలో ఉండిపోయిన ఒక ఓడలో మూడు నెలల తర్వాత ప్రయాణం చేసాము. అది అలెక్సంద్రియ నగరానికి చెందిన ఓడ. దాని పేరు “కవల దేవతలు.” 12మేము “సురకూసై” అనే పట్టణానికి చేరుకున్నాము. సురకూసైలో మేము మూడు రోజులుండి, మరల బయలు దేరాము. 13మేము రేగియ నగరానికి వచ్చాము. మరుసటి రోజు నైరుతి గాలి వీచటంతో మేము బయలుదేర గలిగాము. ఒక రోజు తరువాత మేము పొతియొలీ నగరం చేరాము. 14అక్కడున్న సోదరుల్లో కొందర్ని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారం ఉండమన్నారు. ఈ విధంగా రోమా చేరుకున్నాము. 15రోమాలో ఉన్న సోదరులు మేము వస్తున్నామని విన్నారు. మమ్మల్ని కలుసుకోవటానికి వాళ్ళు అప్పీయా ఫోరన్,#28:15 అప్పీయా ఫోరన్ రోమా నగరము దగ్గర అప్పీయాకు వెళ్ళే మార్గములోనున్న ఒక సంత జరిగే గ్రామము. ట్రెయిన్ టాబెర్న్ అనగా మూడు సత్రాల గ్రామము. ట్రెయిన్ టాబెర్న్ అనే గ్రామాల వరకు వచ్చారు. వీళ్ళను చూడగానే పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. అతనిలో ధైర్యం కలిగింది.
రోమా నగరంలో బోధించటం
16మేము రోమా పట్టణం చేరుకున్నాక పౌలును ఏకాంతంగా ఉండనిచ్చారు. కాని ఒక సైనికుణ్ణి అతనికి కాపలాగా ఉంచారు.
17మూడు రోజుల తర్వాత పౌలు యాదుల నాయకుల్ని పిలిపించాడు. అంతా సమావేశమయ్యాక పౌలు వాళ్ళతో, “సోదరులారా! మన ప్రజలకు విరుద్ధంగా లేక మన పూర్వికుల ఆచారాలకు విరుద్ధంగా నేను ఏది చెయ్యలేదు. అయినా నన్ను యెరూషలేములో బంధించి రోమా అధికారులకు అప్పగించారు. 18వాళ్ళు విచారణ చేసారు. కాని యూదులు ఆరోపించినట్లు మరణదండన పొందవలసిన అపరాధమేదీ నేను చెయ్యలేదు. కనుక నన్ను విడుదల చెయ్యాలనుకున్నారు. 19కాని, దానికి యూదులు ఒప్పుకోలేదు. నేను చక్రవర్తికి విజ్ఞాపన చెయ్యటం అవసరమైంది. యూదులపై నేరారోపణ చెయ్యటానికి నేనిక్కడికి రాలేదు. 20ఈ కారణంగానే నేను మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలువనంపాను. ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న ఆశ కోసం నేనీ సంకెళ్ళలో ఉన్నాను” అని అన్నాడు.
21వాళ్ళు ఈ విధంగా సమాధానం చెప్పారు: “యూదయనుండి మిమ్మల్ని గురించి మాకెలాంటి ఉత్తరంరాలేదు. అక్కడినుండి వచ్చిన సోదరులు కూడా మిమ్మల్ని గురించి ఏ సమాచారం చెప్పలేదు. చెడుగా మాట్లాడలేదు. 22కాని అన్ని ప్రాంతలవాళ్ళు ఈ మతాన్ని గురించి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మాకు తెలుసు. అందువలన దీన్ని గురించి మీ అభిప్రాయం వినాలని ఉంది.”
23పౌలును కలుసుకోవటానికి వాళ్ళు ఒక దినాన్ని నిర్ణయించారు. ఆ రోజు మొదటి రోజుకన్నా ఎక్కువ మంది పౌలు నివసిస్తున్న స్థలానికి వచ్చారు. పౌలు ఉదయంనుండి సాయంకాలం దాకా వాళ్ళతో మాట్లాడి, దేవుని రాజ్యాన్ని గురించి విడమరచి చెప్పాడు. మోషే ధర్మశాస్త్రంనుండి, ప్రవక్తల వ్రాతలనుండి ఉదాహరణలు తీసుకొని, యేసును గురించి చెప్పి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. 24అతడు చెప్పింది కొందరు నమ్మారు. కొందరు నమ్మలేదు. 25వాళ్ళలో వాళ్ళకు భేదాభిప్రాయం రావటం వలన వాళ్ళు వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. పౌలు ఈ చివరి మాట చెప్పటం మొదలు పెట్టాడు: “పరిశుద్ధాత్మ మీ పూర్వికులతో యెషయా ప్రవక్త ద్వారా ఈ విధంగా చెప్పి నిజం పలికాడు:
26‘ప్రజలతో ఈ విధంగా చెప్పు:
మీరెప్పుడూ వింటుంటారు.
కాని ఎన్నటికి అర్థం చేసుకోరు!
మీరు అన్ని వేళలా చూస్తుంటారు.
కాని ఎన్నటికి గ్రహించరు.
27వాళ్ళు కళ్ళతో చూసి,
చెవుల్తో విని హృదయాలతో అర్థం చేసుకొని
నా వైపు మళ్ళితే నేను వాళ్ళకు నయం చేస్తాను.
కాని అలా జరుగకూడదని ఈ ప్రజల
హృదయాలు ముందే మొద్దు బారాయి.
వాళ్ళకు బాగా వినిపించదు.
వాళ్ళు తమ కళ్ళు మూసుకున్నారు.’#యెషయా 6:9-10.
28“అందువల్ల మీరీ విషయాన్ని గ్రహించాలి. రక్షణను గురించి ఈ సందేశం యూదులు కానివాళ్ళ వద్దకు పంపబడింది. వాళ్ళు వింటారు!” 29#28:29 కొన్ని వ్రాత ప్రతులలో 29వ వాక్యము చెప్పబడింది: “అతడిలా అన్నాక, యూదులు తమలో తాము తీవ్రంగా వాదించుకొంటూ వెళ్ళిపోయారు.”
30పౌలు రెండు సంవత్సరాలు తాను అద్దెకు తీసుకున్న ఇంట్లో నివసించాడు. తనను చూడాలని వచ్చినవాళ్ళందరికీ స్వాగతం చెప్పాడు. 31ధైర్యంగా, స్వేచ్ఛతో దేవుని రాజ్యాన్ని గురించి చెప్పి, యేసు క్రీస్తు ప్రభువును గురించి బోధించాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for అపొస్తలుల 28