2
1కాబట్టి, ప్రతి విధమైన దుష్టత్వానికి, కపటానికి, అసూయకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన దూషణ మానేయండి. 2నూతనంగా జన్మించిన శిశువుల్లా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక పాలను ఆశించండి. దాన్ని త్రాగడం వలన మీరు పెరిగి పెద్దవారై రక్షించబడతారు. 3ప్రభువు దయాళుడని మీరు రుచి చూసి తెలుసుకోండి.
సజీవమైన రాయి, ఎన్నుకోబడిన ప్రజలు
4ఉపయోగం లేనిదిగా మనుష్యులచే తిరస్కరించబడిన, అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ రాయియైన ప్రభువును సమీపించండి. 5మీరు సజీవమైన రాళ్లవలె ఆత్మీయ మందిరంగా నిర్మించబడుతున్నారు. యేసు క్రీస్తు ద్వారా దేవునికి ప్రీతికరమైన ఆత్మీయ బలులను అర్పించడానికి మీరు పవిత్రమైన యాజకులుగా చేయబడ్డారు. 6ఎందుకంటే లేఖనాల్లో,
“చూడండి, నేను సీయోనులో ఒక రాయిని వేశాను
అది ఏర్పరచబడిన అమూల్యమైన మూలరాయి;
ఆయనలో నమ్మకం ఉంచేవారు
ఎన్నడూ సిగ్గుపరచబడరు”#2:6 యెషయా 28:16
అని వ్రాయబడి ఉంది. 7ఇప్పుడు విశ్వసించేవారికి ఈ రాయి అమూల్యమైనది. కాని విశ్వసించని వారికి,
“ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి
మూలరాయి అయ్యింది.”#2:7 కీర్తన 118:22
8అంతేకాదు,
“అది ప్రజలు తడబడేలా చేసే అడ్డురాయి,
వారిని పడిపోయేలా చేసే అడ్డుబండ అయ్యింది.”#2:8 యెషయా 8:14
వారిని పడద్రోసేది ఈ రాయే, వారు ఆ వాక్యానికి అవిధేయులు అయినందుకు వారు పతనమయ్యారు. వారిని గురించిన దేవుని సంకల్పం అలాంటిది.
9కాని మీరైతే చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన దేవుని మంచితనాన్ని ప్రకటించడానికి ఏర్పరచబడిన ప్రజలుగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని ప్రత్యేకమైన సొత్తుగా ఉన్నారు. 10ఒకప్పుడు మీరు ప్రజలు కారు కాని ఇప్పుడు మీరు దేవుని ప్రజలు; ఒకప్పుడు మీరు దేవుని కృపను ఎరుగరు కాని ఇప్పుడు మీరు ఆ కృపకు పాత్రులు.
దేవుని ఎరుగని సమాజంలో దైవభక్తి కలిగి జీవించుట
11ప్రియ మిత్రులారా, ఈ లోకంలో విదేశీయులుగా, ప్రవాసులుగా ఉన్న మీకు నేను మనవి చేసుకుంటున్నాను. శారీరక కోరికలు ఎప్పుడు ఆత్మతో పోరాడుతుంటాయి. కాబట్టి వాటికి విడిచిపెట్టండి. 12దేవుని ఎరుగనివారు మిమ్మల్ని ఏ విషయాల్లో దూషిస్తున్నారో ఆ విషయాల్లో మీరు మంచి ప్రవర్తన కలవారై ఉండాలి. మీ సత్కార్యాలను వారు గుర్తించి, దేవుడు మనల్ని దర్శించే రోజున వారు దేవుని మహిమపరచగలరు.
13ప్రభువు కోసం మానవ అధికారులందరికి లోబడి ఉండండి: సార్వభౌమాధికారంలో ఉన్న చక్రవర్తులకు లోబడి ఉండండి. 14దుష్టులను శిక్షించడానికి, మంచివారిని మెచ్చుకోవడానికి పంపబడిన పాలకులకు విధేయులై ఉండండి. 15మీరు మీ సత్కార్యాల వలన మూర్ఖులైన జ్ఞానంలేని ప్రజల నోరు మూయించాలి, ఇది దేవుని చిత్తం. 16స్వతంత్రులై బ్రతకండి, దుష్టత్వాన్ని కప్పిపెట్టడానికి మీ స్వాతంత్ర్యాన్ని వినియోగించకండి; దేవునికి దాసులుగా జీవించండి. 17అందరిని గౌరవించండి, తోటి విశ్వాసులను ప్రేమించండి, దేవునిలో భయభక్తులు కలిగి ఉండండి, రాజులను గౌరవించండి.
18దాసులారా, మీ యజమానులకు మీరు విధేయులై ఉండి వారి పట్ల మర్యాదగా ప్రవర్తించండి. దయగల, సౌమ్యులైన యజమానులకే గాక కఠినులైన వారికి కూడా లోబడి ఉండండి. 19ఎవరైనా అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని పట్ల నిష్కపటమైన మనస్సాక్షి కలిగి దాన్ని ఓర్పుతో సహిస్తే దేవుని అంగీకారం పొందుతారు. 20పాపం చేసినందుకు ప్రతిఫలంగా వచ్చే శిక్షను ఓర్పుతో భరిస్తే దానిలో గొప్పతనమేంటి? అయితే మంచి చేసి బాధపడాల్సి వచ్చినపుడే మీరు ఓర్పుతో భరిస్తే అది దేవుని మెచ్చుకోదగిన విషయం. 21దీని కోసమే మీరు పిలువబడ్డారు. ఎందుకంటే క్రీస్తు కూడా మీ కోసం బాధపడి మీరు ఆయన అడుగుజాడల్లో నడవడానికి ఒక ఉదాహరణను ఉంచారు.
22“ఆయన ఎలాంటి పాపం చేయలేదు,
ఆయన నోటిలో ఏ మోసం లేదు.”#2:22 యెషయా 53:9
23తాను దూషించబడినా తిరిగి దూషించలేదు. తాను హింసించబడుతున్నా ఎవరిని బెదిరించలేదు. కాని న్యాయంగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నారు. 24మనం పాపాల విషయంలో మరణించి నీతి కోసం జీవించేలా ఆయన, “మన పాపాలను తనపై ఉంచుకుని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు. 25మీరు త్రోవ తప్పిన గొర్రెల్లా ఉన్నారు”#2:25 యెషయా 53:4,5,6 కాని ఇప్పుడు మీ ఆత్మల సంరక్షకుడు కాపరియైన వాని దగ్గరకు మీరు తిరిగి వచ్చారు.