4
దేవుని కోసం జీవించుట
1క్రీస్తు తన శరీరంలో శ్రమపడ్డారు, కాబట్టి మీరు అలాంటి మనసును ఆయుధంగా ధరించుకోండి. ఎందుకంటే శరీరంలో శ్రమపడే వారు పాప జీవితాన్ని విడిచిపెడతారు. 2కాబట్టి ఇప్పటినుండి మీరు ఈ లోకంలో మిగిలిన జీవితకాలాన్ని మానవ ఆశలను అనుసరించడానికి కాకుండా దేవుని చిత్తానికి అనుకూలంగా ఉండేలా కొనసాగించండి. 3ఎందుకంటే, మీరు గతకాలంలో దేవుని ఎరుగనివారిగా జీవించారు, సిగ్గుమాలిన వారై, వ్యభిచారులుగా, త్రాగుబోతులుగా, అల్లరితో కూడిన ఆటపాటలు, అసహ్యకరమైన విగ్రహారాధనలు చేస్తూ జీవించారు. 4మీరు ఆ యూదేతరులతో కలిసి విచ్చలవిడిగా నిర్లక్ష్యంగా జీవించకపోవడం చూసి వారు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. 5కాని వారు దేవుని ఎదుట సమాధానం చెప్పాల్సి ఉంది. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. 6అందుకే చనిపోయినవారు శరీర విషయంలో మానవ ప్రమాణాల ప్రకారం తీర్పు పొందేలా, ఆత్మీయ జీవితంలో దేవుని బట్టి జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది.
7అన్నిటికి అంతం సమీపించింది, కాబట్టి మీరు స్వస్థబుద్ధి కలిగి, మెలకువతో ప్రార్థించండి. 8అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపట్ల ఒకరు ఎక్కువ ప్రేమగలవారై ఉండండి. ఎందుకంటే ప్రేమ అనేక పాపాలను కప్పివేస్తుంది. 9సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి. 10అనేక రకాలైన దేవుని వరాలకు మంచి నిర్వాహకుల్లా ప్రతి ఒక్కరు దేవుని నుండి తాము పొందిన విశేష కృపావరాలను ఇతరుల మేలుకోసం ఉపయోగించాలి. 11ఎవరైనా మాట్లాడితే, వారు దేవుని మాటలే మాట్లాడాలి. ఎవరైనా సేవ చేస్తే, దేవుడు ఇచ్చే శక్తితోనే సేవ చేయాలి. అప్పుడు అన్ని విషయాల్లో యేసు క్రీస్తు ద్వారా దేవుడు స్తుతించబడతారు. ఆయనకే మహిమ, ప్రభావం నిరంతరం కలుగును గాక ఆమేన్.
క్రైస్తవునిగా ఉండడం వల్ల వచ్చే శ్రమలు
12ప్రియ మిత్రులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చిన అగ్నివంటి పరీక్షను చూసి మీకేదో వింత జరుగుతున్నట్లుగా ఆశ్చర్యపడకండి. 13క్రీస్తు మహిమ వెల్లడి అయినప్పుడు మీరు మహానందాన్ని అనుభవించేలా ఆయన బాధల్లో పాలుపొందామని ఆనందించండి. 14క్రీస్తు నామం కోసం మీరు నిందలపాలైతే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమగల దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని దాని భావము. 15ఒకవేళ మీరు శ్రమపడినా, హంతకునిగా దొంగగా దోషిగా ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకొన్న వారిగా ఆ శ్రమ ఉండకూడదు. 16అయినా, మీరు క్రైస్తవునిగా శ్రమపడితే సిగ్గుపడకండి, కాని మీరు ఆ నామాన్ని మోస్తున్నవారిగా దేవున్ని స్తుతించండి. 17తీర్పు మొదలయ్యే సమయం ఆసన్నమైంది; దేవుని ఇంటివారే ముందుగా తీర్పు తీర్చబడతారు. అది మనతోనే మొదలైతే దేవుని సువార్తను నమ్మనివారి గతి ఏంటి? 18అలాగే,
“నీతిమంతుడే రక్షించబడడం కష్టమైతే,
భక్తిహీనులు, పాపాత్ముల గతి ఏంటి?”#4:18 సామెత 11:31
19కాబట్టి, దేవుని చిత్తప్రకారం బాధలు అనుభవించేవారు మంచి కార్యాలను కొనసాగిస్తూ, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.