YouVersion Logo
Search Icon

2 కొరింథీ 12

12
పౌలు దర్శనం మరియు అతని ముల్లు
1నేను గర్వపడవచ్చు గాని, దాని వలన నాకు ప్రయోజనం లేదు. ప్రభువు దర్శనాల గురించి, ప్రత్యక్షతల గురించి చెప్తాను. 2క్రీస్తులో ఉన్న ఒక వ్యక్తి నాకు తెలుసు, అతడు పధ్నాలుగు సంవత్సరాల క్రితం మూడవ ఆకాశానికి తీసుకుపోబడ్డాడు, అది శరీరంతోనా లేక శరీరం లేకుండానా అనేది నాకు తెలియదు; దేవునికే తెలుసు. 3అలాంటి వ్యక్తి నాకు తెలుసు. అతడు అది శరీరంతోనా లేక శరీరం లేకుండా తీసుకుపోబడ్డాడో నాకు తెలియదు. అది దేవునికే తెలుసు. 4పరదైసుకు కొనిపోబడ్డాడు, చెప్పశక్యం కాని మాటలు అతడు విన్నాడు, వాటిని పలకడానికి ఎవ్వరికి అనుమతి లేదు. 5కనుక అలాంటి వాని గురించి గర్విస్తాను, కాని నా గురించి అయితే నా బలహీనత గురించి తప్ప వేరు విధంగా గర్వించను. 6ఒకవేళ నేను గర్వించాలనుకున్నా సత్యమే చెప్తాను కనుక అవివేకిని కాను. కాని నేను చేసిన దానికి లేదా చెప్పిన దానికి మించి ఎవరూ నా గురించి ఎక్కువగా ఆలోచించకుండా నేను వాటికి దూరంగా ఉన్నాను. 7లేక నాకు కలిగిన విశేషమైన గొప్ప ప్రత్యక్షతలు వల్ల గర్వంతో ఉబ్బిపోకుండ నా శరీరంలో ఒక ముల్లు పెట్టబడింది. అది సాతాను దూతగా పని చేసి నన్ను నలుగగొట్టి గర్వించకుండా చేస్తుంది. 8దీన్ని నా నుండి తీసివేయమని నేను మూడుసార్లు ప్రభువుకు మనవి చేశాను. 9అందుకు, “నా కృప నీకు చాలు, బలహీనతలో నా శక్తి పరిపూర్ణమవుతుంది” అని ఆయన నాతో చెప్పారు. అందువల్ల క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండడానికి ముఖ్యంగా నా బలహీనతల్లోనే నేను గర్విస్తాను. 10అందుకే, క్రీస్తు కొరకు, నాకు కలిగిన బలహీనతలు, అవమానాలు, కష్టాలు, హింసలు, బాధలు నాకు ఆనందాన్నే కలిగిస్తాయి. ఎందుకంటే, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను.
కొరింథీయుల పట్ల పౌలు శ్రద్ధ
11నన్ను నేనే అవివేకిగా చేసుకున్నాను, కాని నన్ను అలా నడిపించింది మీరే. నేను మీ నుండి మెప్పుపొందాల్సింది, ఎందుకంటే, నేను వ్యర్థుడనైనా మీ “శ్రేష్ఠమైన అపొస్తలుల” కంటె ఏ విధంగాను తీసిపోను. 12అపొస్తలుల సూచక క్రియలు, అద్బుతాలు, మహత్కార్యాలు పూర్తి సహనంతో నా వల్ల మీ మధ్య జరిగాయి. 13నేనెప్పుడు మీకు భారంగా లేను అనేది తప్ప ఇతర సంఘాల కంటే మీరు ఎలా తక్కువ అవుతారు? ఈ తప్పును బట్టి నన్ను క్షమించండి!
14నేను మూడవసారి మీ దగ్గరకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను, మీకు భారంగా ఉండను, ఎందుకంటే నాకు కావల్సింది మీ ధనం కాదు కాని మీరే. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు పొదుపు చేసి ఉంచాలి. 15కాబట్టి నాకు కలిగినదంత మీ కొరకు చాలా సంతోషంగా ఖర్చుచేస్తాను, నన్ను నేను ఖర్చు చేసుకుంటాను; ఒకవేళ నేను మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తే మీరు నన్ను తక్కువగా ప్రేమిస్తారా? 16కనుక నేను మీకు భారంగా ఉండలేదని మీరు అంగీకరిస్తారు. నేను యుక్తిగలవాడిని కనుక యుక్తిగా మిమ్మల్ని పట్టుకున్నాను. 17నేను మీ దగ్గరకు పంపిన వారిలో ఎవని ద్వారానైనా మిమ్మల్ని మోసగించే ప్రయత్నం చేసానా? 18తీతును వెళ్ళమని వేడుకొన్నాను. అతనితో మా సహోదరున్ని కూడ పంపాను. తీతు మిమ్మల్ని మోసం చేయలేదు, నిజం కాదా? మేము ఒకే ఆత్మను కలిగి ఒకే అడుగుజాడల్లో నడువలేదా?
19ఇంతవరకు మేము మీతో మా గురించి వాదించుకొంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టిలో క్రీస్తులో ఉన్న వారిలా మాట్లాడుతున్నాము; మిత్రులారా! మేము చేసే ప్రతి పని మిమ్మల్ని బలపరచడానికే. 20ఎందుకంటే ఒకవేళ నేను వచ్చినపుడు నేను కోరుకున్నట్లుగా మీరు ఉండకపోవచ్చు, అలాగే మీరు కోరుకున్నట్లుగా నేను ఉండకపోవచ్చు. కలహాలు, అసూయలు, క్రోధాలు, స్వార్థపూరిత ఆశయాలు, అపవాదులు, గుసగుసలు, గర్వం, అల్లరులు అక్కడ ఉంటాయని భయపడుతున్నాను. 21మరల నేను వస్తే దేవుడు మీ ముందు నన్ను తగ్గిస్తాడేమోనని భయపడుతున్నాను, అంతేకాక గతంలో పాపం చేసిన చాలామంది పాలుపంచుకొన్న అపవిత్రమైన పనులకు, లైంగిక పాపం, జారత్వం గురించి పశ్చాత్తాపం చెందని వారి గురించి కూడ నేను దుఃఖపడతాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in