YouVersion Logo
Search Icon

2 కొరింథీ 5

5
నూతన శరీరం కొరకు వేచివుండటం
1మనం నివసిస్తున్న భూసంబంధమైన గుడారం నాశనమైనా, దేవుని నుండి ఒక భవనం మనకు వుంది, అది మానవ హస్తాలతో కట్టబడని, ఒక శాశ్వతమైన గృహం పరలోకంలో ఉందని మనకు తెలుసు. 2ఈలోగా పరలోకం నుండి వచ్చే మన నివాసాన్ని ధరించుకోవాలని మనం మూలుగుతున్నాము. 3ఎందుకంటే దాన్ని ధరించుకుంటే మనం దిగంబరులుగా కనబడం. 4ఈ గుడారంలో ఉన్నంతసేపు మనం మూల్గుతూ భారంతో వున్నాం, ఎందుకంటే, మనం దిగంబరులుగా ఉండాలని కోరుకోం కాని అనిత్యమైనది జీవం చేత మ్రింగివేయబడేలా, మన పరలోక నివాసాన్ని ధరించుకోవాలని కోరుతున్నాం. 5దీని కొరకు మనల్ని రూపించినవాడు దేవుడే; ఆయనే రాబోయే దానికి హామీగా తన ఆత్మను మనకు ఇచ్చారు.
6కాబట్టి మనం ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో ఉన్నాం, ఈ దేహంలో నివసించేంత కాలం ప్రభువుకు దూరంగా ఉన్నామని మనకు తెలుసు. 7మేము దృష్టి వల్ల కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాం. 8కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మనం సంపూర్ణ నమ్మకం కలిగి ఈ శరీరానికి దూరంగా ఉండి, ప్రభువుతో ఆయన ఇంట్లో ఉండాలని ఎంతగానో ఇష్టపడుతున్నాము. 9కాబట్టి మనం ఈ శరీరంలో ఉన్నా లేక దానికి దూరంగా ఉన్నా, ఆయనను సంతోషపెట్టడమే లక్ష్యంగా ఉందాం. 10ఎందుకంటే, మనలో ప్రతి ఒక్కరు తాము శరీరంలో ఉండగా చేసిన వాటికి, అవి మంచివైనా చెడ్డవైనా, తగిన ప్రతిఫలాన్ని పొందడానికి మనమందరం క్రీస్తు న్యాయసింహాసనం యెదుట ఖచ్చితంగా కనబడాలి.
సమాధానపరిచే పరిచర్య
11అయితే, ప్రభువుకు భయపడడం అంటే ఏమిటో మాకు తెలుసు, కనుక ఇతరులకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాం. మనమేమైయున్నామో దేవునికి స్పష్టంగా తెలుసు, మీ మనస్సాక్షికి కూడ స్పష్టంగా తెలుసని నా నిరీక్షణ. 12మరల మీ ముందు మమ్మల్ని మేము పొగడుకోవాలని ప్రయత్నించడం లేదు గాని, హృదయంలో ఉన్న దానిని బట్టి కాక, కనిపించే దానిని బట్టి గర్వించే వారికి మీరు జవాబు చెప్పగలిగేలా మమ్మల్ని బట్టి మీరు గర్వించడానికి ఒక కారణాన్ని ఇస్తున్నాము. 13కొందరు చెప్పినట్లు, మేము పిచ్చివారమైతే అది దేవుని కొరకు మాత్రమే; మేము వివేకవంతులమైనా అది మీ కొరకు. 14క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది, ఎందుకంటే అందరి కొరకు ఒక్కడే మరణించాడని కనుక అందరు మరణించినట్టే అని మనం ఒప్పించబడ్డాం. 15ఆయన అందరి కొరకు చనిపోయారు, జీవిస్తున్నవారు ఇకపై తమ కొరకు కాక, వారి కొరకు మరణించి తిరిగి లేచిన ఆయన కొరకే జీవించాలి.
16అందువల్ల, మేము ఇప్పటి నుండి ఎవరిని లోకసంబంధమైన దృష్టితో లక్ష్యపెట్టము. ఒకప్పుడు మేము క్రీస్తును ఇలాగే లక్ష్యపెట్టినా, ఇక మేము అలా చేయం. 17అందుకే, ఎవరైనా క్రీస్తులో ఉంటే, వారు నూతన సృష్టి; పాతది గతించిపోయింది, క్రొత్తది ఇక్కడ ఉంది! 18ఇదంతా దేవుని వల్లనే జరిగింది, ఆయన క్రీస్తు ద్వారా మనల్ని తనతో సమాధానపరచుకున్నారు, ఆ సమాధానపరిచే పరిచర్యను మాకు అప్పగించారు. 19ఆ పరిచర్య ఏంటంటే: ప్రజల పాపాలను వారికి విరోధంగా లెక్కించకుండా దేవుడు క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకున్నారు. ఆ సమాధాన సందేశాన్ని బోధించే పని మాకు అప్పగించారు. 20అందువల్ల మేము, దేవుడు మా ద్వారా విజ్ఞప్తి చేసే క్రీస్తు రాయబారులం. దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుతున్నాము. 21మనం ఆయనలో దేవుని నీతిగా అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కొరకు పాపంగా#5:21 పాపంగా పాపపరిహారార్ధంగా చేశారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in