YouVersion Logo
Search Icon

2 థెస్సలోనికయులకు 2

2
దుర్మార్గుడైన వ్యక్తి
1సహోదరీ సహోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు రాకడ గురించి మనం ఆయనను కలుసుకొనుట గురించి మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే, 2ప్రభువు రాబోయే దినం వచ్చేసిందని ప్రకటించే ప్రవచనాల ద్వారా గాని నోటిమాటల ద్వారా లేదా ఏదైన ఉత్తరం ద్వారా గాని మీకు తెలిస్తే తొందరపడి కలవరంతో భయపడకండి. 3మిమ్మల్ని ఎవరైనా ఏ రీతిగానైనా మోసపరచనివ్వకండి. ఎందుకంటే తిరుగుబాటు వచ్చేవరకు, నాశనానికి కర్తయైన దుర్మార్గుడు బయటపడే వరకు ఆ దినం రాదు. 4వాడు దేవునిగా పిలువబడే ప్రతిదాన్ని, పూజించబడే వాటన్నిటిని వ్యతిరేకించి, తనను తాను వాటన్నిటికంటే పైగా హెచ్చించుకొంటూ, తనంతట తానే దేవాలయంలో కూర్చుని, తానే దేవుడనని ప్రకటించుకుంటాడు.
5నేను మీతో ఉన్నప్పుడు మీకు తెలియజేసిన ఈ సంగతులు మీకు జ్ఞాపకం లేవా? 6అయితే అతడు సరియైన సమయంలో బయలుపరచబడడానికి ఏది అతన్ని అడ్డగిస్తూ ఉందో ఇప్పుడు మీకు తెలుసు. 7ఆ దుర్మార్గుని యొక్క రహస్యశక్తి ఇప్పటికే పని చేస్తూ ఉంది; అయితే దానిని అడ్డగిస్తున్నవాడు మార్గంలో నుండి వాన్ని తీసివేసే వరకు వాడు అడ్డగిస్తూ ఉంటాడు. 8ఆ దుర్మార్గుడు బయలుపరచబడినప్పుడు, ప్రభువైన యేసు తన నోటి ఊపిరితో అతన్ని పడగొట్టి, తన రాకడ ప్రకాశంతో అతన్ని నాశనం చేస్తారు. 9సాతాను చేసే పనులకు అనుకూలంగా దుర్మార్గుని రాకడ ఉంటుంది. అతడు తన అబద్ధాన్ని నిరూపించుకోవడానికి, తన శక్తిని చూపించుకోడానికి సూచకక్రియలు, అద్భుతాలు, మహాత్కార్యాలను చేస్తాడు, 10అతడు నశించువారిని అన్ని విధాలుగా దుష్టత్వంతో మోసగిస్తాడు, వారు రక్షణ పొందడానికి గాని సత్యాన్ని ప్రేమించడానికి నిరాకరించారు కాబట్టి వారు నశిస్తారు. 11ఈ కారణంగా, వారు అబద్ధాన్ని నమ్మేలా దేవుడు వారి మీదకు బలమైన భ్రమను పంపాడు. 12అప్పుడు సత్యాన్ని నమ్మకుండా దుర్మార్గంలో ఆనందించేవారు శిక్షకు పాత్రులుగా ఎంచబడతారు.
స్థిరంగా నిలబడు
13ప్రభువు ప్రేమించిన సహోదరీ సహోదరులారా, మేము మీ కోసం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించ వలసిందే ఎందుకంటే, మీరు రక్షణ పొందడానికి సత్యాన్ని నమ్మడం ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మ చేత పరిశుద్ధపరచడానికి ప్రారంభం నుండి ఏర్పరచుకున్నారు. 14మీరు మన ప్రభువైన యేసు క్రీస్తు మహిమలో పాలుపొందేలా మా సువార్త ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు.
15కాబట్టి సహోదరీ సహోదరులారా, మీరు మా నోటి మాటలతో లేదా ఉత్తరాల ద్వారా మేము మీకు చేయించిన బోధను గట్టిగా పట్టుకుని దానిలో స్థిరంగా ఉండండి.
16మన ప్రభువైన యేసు క్రీస్తును మన తండ్రియైన దేవుడు మనల్ని ప్రేమించి తన కృప చేత మనకు నిత్య ప్రోత్సాహాన్ని స్థిరమైన నిరీక్షణను ఇచ్చి, 17మన హృదయాలను ధైర్యపరచి, ప్రతి మంచి పనిలో మంచి మాటల్లో మిమ్మల్ని బలపరచును గాక.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in