3
ప్రార్థన కొరకు మనవి
1సహోదరీ సహోదరులారా, మిగిలిన విషయాలు ఏంటంటే, ప్రభువు వాక్యం మీలో వ్యాపించిన ప్రకారమే మరింతగా వేగంగా వ్యాపించి ఘనత పొందేలా మా కొరకు ప్రార్థించండి. 2విశ్వాసం అందరికీ లేదు కనుక చెడ్డవారైన దుష్టప్రజల నుండి మేము విడిపించబడునట్లు మీరు ప్రార్థించండి. 3అయితే ప్రభువు నమ్మదగినవాడు కనుక ఆయన మిమ్మల్ని బలపరచి దుష్టుని నుండి కాపాడును. 4మేము మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేస్తున్నారని, వాటిని చేయడం కొనసాగిస్తారని ప్రభువులో మేము నమ్ముతున్నాము. 5ప్రభువు మీ హృదయాలను దేవుడు మీ పట్ల చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన సహనం వైపు నడిపించును గాక.
సోమరులకు హెచ్చరిక
6సహోదరీ సహోదరులారా, మీరు మా నుండి పొందిన బోధల ప్రకారం జీవించక, తమ పనులను చూసుకోక సోమరులుగా బ్రతుకుతున్న ప్రతి విశ్వాసికి మీరు దూరంగా ఉండాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాం. 7మా మాదిరిని మీరు ఎలా అనుసరించాలో అది మీకు తెలుసు. అంటే మేము మీ మధ్యన ఉన్నప్పుడు వట్టి చేతులతో సోమరులుగా కూర్చోలేదు, 8మేము ఎవరి దగ్గర ఉచితంగా ఆహారాన్ని తినలేదు. దానికి బదులు, మేము మీలో ఎవరికీ భారంగా ఉండకూడదని రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి పనిచేసాము. 9అలాంటి సహాయాన్ని పొందే హక్కు లేదని అలా చేయలేదు కాని, మీరు మాలా ప్రవర్తించేలా మీకు ఒక ఆదర్శంగా ఉండాలని మేము అలా చేసాము. 10మేము మీతో ఉన్నప్పుడు, “పని చేయనివాడు ఆహారం తినడానికి పాత్రుడు కాడు” అనే నియమాన్ని కూడా మీకు ఇచ్చాము.
11మీలో కొందరు సోమరులుగా ఏ పని చేసుకోకుండా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటూ ఉన్నారని మేము విన్నాం. 12అలాంటి వారు స్థిరపడి, వారు తినే ఆహారాన్ని వారే సంపాదించుకోవాలని మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మేము వారిని హెచ్చరిస్తున్నాము, వేడుకొంటున్నాము. 13సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు.
14ఈ ఉత్తరంలో మేము వ్రాసిన సూచనలను పాటించని వారిని గమనించి వారు సిగ్గుపడేలా మీరు వారితో కలవకండి. 15అయితే వారిని శత్రువులుగా చూడవద్దు కాని, మీ తోటి విశ్వాసులుగా వారిని హెచ్చరించండి.
ముగింపు వందనాలు
16సమాధానానికి కర్త అయిన దేవుడు అన్ని సమయాల్లో అన్ని విధాలుగా మీకు సమాధానము కలుగజేయును. ప్రభువు మీ అందరికి తోడై ఉండును గాక!
17పౌలు అను నేను నా స్వహస్తంతో ఈ శుభములు వ్రాస్తున్నాను, నేను వ్రాసిన ఉత్తరాలన్నింటిలో నేను వ్రాసాను అనడానికి ప్రత్యేకమైన గుర్తు యిదే.
18మీ అందరితో మన ప్రభువైన యేసు క్రీస్తు కృప ఉండును గాక.