YouVersion Logo
Search Icon

అపొస్తలుల కార్యములు 25

25
ఫేస్తు యెదుట పౌలు విచారణ
1ఫేస్తు వచ్చిన మూడు రోజుల తర్వాత తన పదవి బాధ్యతలను స్వీకరించడానికి కైసరయ పట్టణం నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. 2అక్కడ ముఖ్య యాజకులు మరియు యూదా నాయకులు అతన్ని కలిసి పౌలుకు వ్యతిరేకంగా తాము చేసిన ఫిర్యాదును తెలియజేసారు. 3వెళ్తున్నప్పుడే మధ్యలో పౌలును చంపాలని కుట్రను పన్ని, పౌలును యెరూషలేముకు పంపించమని ఫేస్తును వేడుకొన్నారు. 4అందుకు ఫేస్తు, “పౌలు కైసరయలో ఉన్నాడు, నేను త్వరలో అక్కడికి వెళ్తున్నాను. 5కనుక మీలో కొందరు నాయకులు నాతో రండి. అతడు ఏమైన తప్పు చేస్తే అది అతనిపై మోపవచ్చు” అని చెప్పాడు.
6వారితో ఎనిమిది, పది రోజులు గడిపిన తర్వాత ఫేస్తు అధిపతి కైసరయకు వెళ్లాడు. మరుసటిరోజు అతడు న్యాయసభను ఏర్పాటు చేసి పౌలును తన ముందుకు తీసుకొని రమ్మని ఆదేశించాడు. 7పౌలు లోపలికి వచ్చినప్పుడు, యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలబడ్డారు. అతని మీద అనేక తీవ్ర ఆరోపణలు చేశారు, కాని వాటిని రుజువు చేయలేకపోయారు.
8అప్పుడు పౌలు సమాధానం చెప్పుతూ, “నేను యూదుల ధర్మశాస్త్రానికి గాని దేవాలయానికి గాని లేదా కైసరుకు గాని వ్యతిరేకంగా ఏ తప్పు చేయలేదు” అని చెప్పాడు.
9ఫేస్తు యూదులకు అనుకూలంగా ఉండాలని భావిస్తూ పౌలుతో, “నీవు యెరూషలేముకు వచ్చి అక్కడ నా ముందు వీరు చేసిన ఫిర్యాదుల గురించిన విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నావా?” అని అడిగాడు.
10అందుకు పౌలు, “నేను ఇప్పుడు కైసరు న్యాయసభలో నిలబడి ఉన్నాను, నన్ను విచారణ చేయవలసిన స్థలం ఇదే. నేను యూదుల పట్ల ఏ తప్పు చేయలేదని మీకు బాగా తెలుసు. 11ఒకవేళ, నేను మరణశిక్షకు తగిన తప్పును చేస్తే, నేను మరణశిక్షను నిరాకరించను. కానీ ఈ యూదులు నాకు వ్యతిరేకంగా చేసిన ఫిర్యాదులలో సత్యం లేనప్పుడు, నన్ను వారికి అప్పగించే అధికారం ఎవరికి లేదు. నేను కైసరుకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను!” అని చెప్పాడు.
12ఫేస్తు తన న్యాయసభతో కలిసి చర్చించిన అతడు, “నీవు కైసరు దగ్గర విజ్ఞప్తి చేసుకుంటానని చెప్పావు కనుక నీవు కైసరు దగ్గరకే వెళ్తావు!” అని ప్రకటించాడు.
రాజైన అగ్రిప్పను కలిసిన ఫేస్తు
13కొన్ని రోజుల తర్వాత రాజైన అగ్రిప్ప అతని భార్య బెర్నీకేతో ఫేస్తును దర్శించడానికి కైసరయకు వచ్చారు. 14వారు అనేక రోజులు అక్కడ ఉన్నారు కనుక ఫేస్తు పౌలు విషయాన్ని రాజుతో చర్చిస్తూ, “ఫెలిక్స్ విడిచిపెట్టిన ఒక ఖైదీ నా దగ్గర ఉన్నాడు. 15నేను యెరూషలేము పట్టణానికి వెళ్లినప్పుడు, ముఖ్య యాజకులు యూదా నాయకులు అతనికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసి అతన్ని శిక్షించమని కోరారు.
16“అందుకు నేను ‘ఎవరినైనా సరే నేరం మోపిన వారిని కలుసుకొని, తమ వాదన వినిపించుకొనే అవకాశం ఇవ్వకుండా అప్పగించడం అనేది రోమీయుల ఆచారం కాదు’ అని వారితో చెప్పాను. 17వారు నాతో ఇక్కడికి వచ్చినప్పుడు, నేను ఈ విషయంలో ఆలస్యం చేయకుండా, న్యాయసభను సమావేశపరిచి మరునాడే ఆ వ్యక్తిని తీసుకొని రమ్మని ఆదేశించాను. 18అతని మీద ఫిర్యాదు చేసినవారు నేను ఊహించిన ఏ నేరాన్ని మోపలేదు. 19దానికి బదులు అతనితో వారికున్న మతసంబంధమైన, యేసు అనే ఒక వ్యక్తి చనిపోయినా ఇంకా బ్రతికే ఉన్నాడని పౌలు చెప్తున్నాడనే కొన్ని వివాదాలను తెలియచేశారు. 20ఇలాంటి విషయాలను ఏ విధంగా విచారించాలో నాకు అర్థం కాలేదు; కనుక యెరూషలేము వెళ్లి అక్కడ వారి ఫిర్యాదుకు విచారణ ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నావా అని అతన్ని అడిగాను. 21కానీ పౌలు తాను చక్రవర్తికి విజ్ఞప్తి చేసుకుంటానని మనవి చేసినప్పుడు, నేను అతన్ని కైసరు దగ్గరకు పంపించే వరకు అతన్ని అక్కడే ఉంచుమని ఆదేశించాను” అని చెప్పాడు.
22అప్పుడు అగ్రిప్ప రాజు ఫేస్తుతో, “నాకు ఆ వ్యక్తి మాటలను స్వయంగా వినాలని ఉంది” అన్నాడు.
అందుకు అతడు, “రేపు మీరు వినవచ్చు” అని చెప్పాడు.
అగ్రిప్ప రాజు యెదుట పౌలు విచారణ
23మరుసటిరోజు అగ్రిప్ప రాజు అతని భార్య బెర్నీకే గొప్ప ఆడంబరంగా, ఉన్నత సైనికాధికారులతో పట్టణ ప్రముఖులతో కలిసి ప్రేక్షకుల గదిలోనికి ప్రవేశించారు. ఫేస్తు ఆజ్ఞతో పౌలును లోపలికి తీసుకొని వచ్చారు. 24అప్పుడు ఫేస్తు, “అగ్రిప్ప రాజా, ఇక్కడున్న ప్రజలారా! ఈ వ్యక్తిని చూడండి, యూదా సమాజమంత ఇతనికి వ్యతిరేకంగా యెరూషలేములోను ఇక్కడ కైసరయలోను ఫిర్యాదు చేసి, ఇతడు బ్రతకడానికి అర్హుడుకాడు అని కేకలు వేస్తున్నారు. 25ఇతడు మరణశిక్ష పొందేంత నేరమేమి చేయలేదని నేను గ్రహించాను, కానీ ఇతడు చక్రవర్తికి విజ్ఞప్తి చేసుకుంటాను అన్నాడు కనుక ఇతన్ని రోమా దేశానికి పంపించాలని నిర్ణయించాను. 26అయితే ఇతని గురించి చక్రవర్తికి వ్రాయడానికి ఖచ్చితమైన కారణాలు ఏమి కనబడలేదు. కనుక ఈ విచారణ తర్వాత నేను వ్రాయడానికి నాకు కారణం లభిస్తుందని అతన్ని మీ అందరి ముందుకు, ముఖ్యంగా రాజైన అగ్రిప్ప ముందుకు తీసుకు వచ్చాను. 27ఒక ఖైదీ మీద మోపిన నేరాల గురించి సరియైన వివరణ లేకుండా అతన్ని రోమాకు పంపించడం సరికాదని నేను భావిస్తున్నాను” అని వారితో చెప్పాడు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in