YouVersion Logo
Search Icon

కొలొస్సయులకు 3

3
క్రీస్తులో జీవం కలిగినవారిలా జీవించుట
1మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కనుక, పైనున్న వాటిపై మీ హృదయాలను ఉంచండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి వైపున కూర్చునివున్నారు. 2భూసంబంధమైన వాటి మీద కాకుండా, పైనున్న వాటి మీదనే మీ మనస్సులను ఉంచండి. 3ఎందుకంటే, మీరు చనిపోయారు, కనుక మీ జీవం క్రీస్తుతో కూడా దేవునిలో దాచబడివుంది. 4మీ జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, మీరు కూడా ఆయనతోపాటు మహిమలో ప్రత్యక్షమవుతారు.
5కనుక మీ భూసంబంధమైన స్వభావానికి సంబంధించిన వాటిని అనగా: లైంగిక దుర్నీతిని, అపవిత్రతను, కామవాంఛలను, దుష్ట కోరికలను, విగ్రహారాధన అయిన దురాశలను చంపివేయండి. 6వీటి కారణంగానే దేవుని ఉగ్రత వస్తుంది. 7ఒకప్పుడు మీరు వీటి ప్రకారం నడుచుకొని జీవించారు. 8కానీ ఇప్పుడైతే, మీరు కోపం, ఆగ్రహం, అసూయ, దూషణ, మీ నోటితో బూతులు మాట్లాడడం వంటి వాటిని కూడా విడిచిపెట్టండి. 9మీరు మీ పాత స్వభావాన్ని దాని అలవాట్లతో సహా విడిచిపెట్టారు, కనుక ఒకనితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు, 10మరియు సృష్టికర్త స్వారూప్యంలోని జ్ఞానంలో నూతనపరచబడుతున్న క్రొత్త స్వభావాన్ని మీరు ధరించుకున్నారు. 11ఇక్కడ యూదేతరులను గాని లేక యూదులని గానీ, సున్నతి పొందిన వారని గానీ సున్నతి పొందని వారని గానీ, అనాగరికులని లేక నాగరికులని కాని, బానిసలని గాని స్వతంత్రులని కాని భేదం లేదు. క్రీస్తే సమస్తం, అందరిలో ఉన్నది ఆయనే.
12కనుక, దేవుని చేత ఏర్పరచబడిన పరిశుద్ధులు, ప్రియమైన వారిలా, మీరు జాలిగల మనస్సు, దయ, వినయం, శాంతం, సహనం అనే వాటిని ధరించుకోండి. 13ఎవరికైనా ఎవరిపట్లనైనా బాధ ఉంటే, ఒకరిని ఒకరు సహించుకుంటూ ఒకరిని ఒకరు క్షమించుకోండి. ప్రభువు మిమ్మల్ని క్షమించినట్లే మీరు కూడా క్షమించండి. 14వాటన్నిటిని ఒక్కటిగా సంపూర్ణ ఐక్యతలోనికి తీసుకువచ్చే ప్రేమను వీటన్నింటి కంటే పైగా ధరించుకోండి.
15ఒకే శరీరంలోని అవయవాల వలె, సమాధానం కొరకు మీరు పిలువబడ్డారు, కనుక క్రీస్తు యొక్క సమాధానం మీ హృదయాలను పరిపాలించనివ్వండి. అలాగే కృతజ్ఞత కలిగి ఉండండి. 16సంగీతంతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పాటలతో సమస్త జ్ఞానంతో ఒకరికి ఒకరు బోధించుకుంటూ, హెచ్చరించుకుంటూ మీ హృదయాల్లో కృతజ్ఞతతో దేవుని గురించి పాటలు పాడుతూ, క్రీస్తు సువార్తను మీ మధ్యలో సమృద్ధిగా నివసింపనివ్వండి. 17మీరు మాటలలో కాని పనులలో కాని, ఏమి చేసినా ప్రభువైన యేసు నామంలో చేయండి, తండ్రియైన దేవునికి ఆయన ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండండి.
క్రైస్తవ కుటుంబాలకు సూచనలు
18భార్యలారా, మీ భర్తలకు లోబడి ఉండండి, అది ప్రభువులో తగినది.
19భర్తలారా, మీ భార్యలను ప్రేమించండి వారితో కఠినంగా ప్రవర్తించకండి.
20పిల్లలారా, అన్ని విషయాలలో మీ తల్లిదండ్రులకు విధేయులై యుండండి, ఇది ప్రభువుకు ఇష్టము.
21తండ్రులారా, మీ పిల్లల మనస్సు నిరుత్సాహపడేటట్లు వారికి కోపం రేపకండి.
22బానిసలారా, మీ భూసంబంధ యజమానులకు లోబడి ఉండండి; వారి కనుదృష్టి మీ మీద ఉన్నప్పుడు వారి దయను పొందాలని కాకుండా చిత్తశుద్ధి గల హృదయంతో, ప్రభువుకు భయపడుతూ అన్ని విషయాలలో వారికి లోబడి ఉండండి. 23మీరు ఏమి చేసినా, అది మనుష్యుల మెప్పు కొరకు కాకుండా ప్రభువు కొరకు చేస్తున్నామని మనస్ఫూర్తిగా చేయండి. 24మీరు ప్రభువు నుండి స్వాస్థ్యాన్ని ప్రతిఫలంగా పొందుకుంటారని మీకు తెలుసు కనుక మీరు ప్రభువైన క్రీస్తునే సేవిస్తున్నారు. 25తప్పు చేసినవారికి, వారి తప్పులను బట్టి తగిన శిక్ష ఇవ్వబడుతుంది, ఇందులో ఎటువంటి పక్షపాతం ఉండదు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in