7
యాజకుడైన మెల్కిసెదెకు
1ఈ మెల్కీసెదెకు షాలేముకు రాజు మరియు అత్యున్నతమైన దేవునికి యాజకుడు. అబ్రాహాము నలుగురు రాజులను ఓడించి తిరిగి వస్తున్నప్పుడు మెల్కిసెదెకు అబ్రాహామును కలిసి అతన్ని ఆశీర్వదించాడు. 2అబ్రాహాము ప్రతీ దానిలో పదో భాగాన్ని అతనికి ఇచ్చాడు. మెల్కిసెదెకు అనగా మొదట “నీతికి రాజు అని అర్థం” అటు తరువాత “షాలేము రాజు” అనగా “శాంతికి రాజు” అని అర్థం 3తల్లి తండ్రి లేకపోయినా, వంశావళి లేకపోయినా, జీవిత ఆరంభం అంతం లేకపోయినా#7:3 లేకపోయినా అతని గురించి ఏ వివరాలు వ్రాయబడి లేవు అతడు దేవుని కుమారునికి సాదృశ్యంగా, నిరంతరం యాజకునిగా ఉన్నాడు.
4ఇతడెంత గొప్పవాడో ఆలోచించండి: మన పితరుడైన అబ్రాహాము కొల్లగొట్టిన దానిలో నుండి పదో భాగాన్ని ఇచ్చాడు! 5లేవీ సంతతిలో నుండి యాజకులైనవారు ప్రజల నుండి అంటే, అబ్రాహాము నుండి వచ్చిన తోటివారైనా ఇశ్రాయేలీయుల నుండి పదవ వంతు వసూలు చేయాలని ధర్మశాస్త్రం ఆదేశిస్తుంది. 6ఈ మనుష్యుడు లేవీ సంతతి వాడు కానప్పటికి, అబ్రాహాము నుండి పదో భాగాన్ని తీసుకొని, దేవుని వాగ్దానాలను పొందిన అతన్ని దీవించాడు. 7తక్కువవాడు ఎక్కువవానిచేత దీవించబడతాడు అనడంలో సందేహం లేదు. 8ఒక సందర్భంలో, దశమభాగం చనిపోయేవారి చేత వసూలు చేయబడింది; మరో సందర్భంలో, బ్రతికి ఉన్నాడని ప్రకటించబడిన వారి ద్వారా వసూలు చేయబడింది. 9దశమభాగం పుచ్చుకొనే లేవీయులు అబ్రాహాము ద్వారా పదో భాగాన్ని చెల్లించారు అని చెప్పవచ్చు, 10ఎందుకంటే మెల్కీసెదెకు అబ్రాహామును కలుసుకొన్నపుడు, లేవీ ఇంకా తన పితరుని శరీరంలోనే ఉన్నాడు.
యేసు మెల్కిసెదెకు వంటివాడు
11ప్రజలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం స్థాపించిన లేవీయుల యాజకత్వం ద్వారా పరిపూర్ణతను సాధించగలిగివుంటే ఇంకొక యాజకుడు అహరోను క్రమంలో కాక, మెల్కీసెదెకు క్రమంలో రావల్సిన అవసరం ఏంటి? 12యాజకత్వం మార్చబడినపుడు, ధర్మశాస్త్రం కూడా మార్చబడాలి. 13ఈ సంగతులు ఎవరి గురించి చెప్పబడ్డాయో అతడు వేరొక వంశానికి చెందిన వాడు, ఆ వంశం నుండి ఎవరు, ఎన్నడు బలిపీఠం దగ్గర పరిచర్య చేయలేదు. 14మన ప్రభువు యూదా సంతానం నుండి వచ్చాడనేది స్పష్టం కాని ఆ గోత్రానికి సంబంధించి యాజకులను గురించి మోషే ఏమి చెప్పలేదు. 15మెల్కీసెదెకు వంటి వేరొక యాజకుడు వస్తే మేము చెప్పింది మరింత స్పష్టంగా అర్థమవుతుంది, 16యాజకుడైనవాడు వంశపారంపర్య నియమం ప్రకారం యాజకుడు కాలేదు, కాని తన జీవితం నాశనం కాని శక్తివంతమైనది కాబట్టి యాజకుడయ్యాడు. 17అందుకే ఇలా ప్రకటించబడింది:
“మెల్కీసెదెకు క్రమంలో,
నీవు నిరంతరం యాజకునిగా ఉన్నావు.”#7:17 కీర్తన 110:4
18పాత నియమం బలహీనం, నిరుపయోగం కనుక ప్రక్కకు పెట్టబడింది. 19ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం దేన్ని పరిపూర్ణం చేయలేదు, కనుక మనల్ని దేవునికి దగ్గర చేసే, మెరుగైన నిరీక్షణ పరిచయం చేయబడింది.
20అది ప్రమాణం లేకుండా కాదు! ఇతరులు ఏ ప్రమాణం చేయకుండానే యాజకులయ్యారు, 21అయితే ఆయన ప్రమాణంతో యాజకుడు అయ్యేటప్పుడు దేవుడు ఆయనతో ఇలా అన్నారు:
“ప్రభువు ప్రమాణం చేశాడు
ఆయన మనస్సు మార్చుకొనేవాడు కాడు:
‘నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు.’ ”#7:21 కీర్తన 110:4
22ఈ ప్రమాణం వలన, యేసు మరింత మేలైన నిబంధనకు హామీదారు అయ్యాడు.
23మరణం వారిని ఆ పదవిలో కొనసాగనివ్వలేదు కనుక యాజకులైనవారు అనేకమంది ఉన్నారు. 24అయితే యేసు నిరంతరం జీవిస్తున్నాడు కనుక ఆయన శాశ్వత యాజకత్వాన్ని కలిగివున్నాడు. 25తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారి కొరకు ఎల్లప్పుడు విజ్ఞాపన చేయడానికి ఆయన నిరంతరం జీవిస్తున్నాడు కనుక వారిని ఆయన సంపూర్ణంగా#7:25 సంపూర్ణంగా నిరంతరం రక్షించగలడు.
26పరిశుద్ధుడు, నిందారహితుడు, పవిత్రుడు, పాపుల నుండి ప్రత్యేకించబడినవాడు, ఆకాశాల కంటే పైగా హెచ్చించబడినవాడై వుండి మన అవసరాలను తీర్చగల ప్రధాన యాజకుడు. 27ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటివాడు కాదు, ప్రతి దినం, మొదట తన పాపాల కొరకు, తరువాత ప్రజల పాపాల కొరకు బలులు అర్పించాల్సిన అవసరం ఆయనకు లేదు. తనను తాను అర్పించుకొన్నప్పుడే వారందరి పాపాల కొరకు ఒకేసారి అర్పించాడు. 28ధర్మశాస్త్రం బలహీనతతో ఉన్న మనుష్యులను ప్రధాన యాజకులుగా నియమిస్తుంది; కాని ధర్మశాస్త్రం తరువాత వచ్చిన దేవుని ప్రమాణం నిత్యం పరిపూర్ణునిగా చేయబడిన దేవుని కుమారున్ని ప్రధాన యాజకునిగా నియమించింది.