YouVersion Logo
Search Icon

యాకోబు 1

1
1దేవునికి ప్రభువైన యేసుక్రీస్తుకు సేవకుడనైన, యాకోబు,
వివిధ దేశాలకు చెదిరిపోయిన పన్నెండు గోత్రాల వారికి వ్రాయునది:
మీకు శుభాలు.
శ్రమలు, శోధనలు
2నా సహోదరీ సహోదరులారా, మీ విశ్వాసానికి ఎదురయ్యే పరీక్షలవల్ల ఓర్పు వస్తుందని మీకు తెలుసు కనుక, 3మీకు ఎప్పుడైనా ఎలాంటి శోధనలు ఎదురైనా వాటిని బట్టి సంతోషించండి. 4మీరు పరిపక్వం చెంది సంపూర్ణులుగా అవడానికి, ఏ విషయంలో కూడా మీకు కొరత లేకుండా ఉండడానికి పట్టుదలను తన పనిని పూర్తి చేయనివ్వండి. 5మీలో ఎవరికైనా జ్ఞానం కొరతగా ఉంటే దేవుణ్ణి అడగండి అప్పుడు అది మీకు ఇవ్వబడుతుంది. ఆయన తప్పులను ఎంచకుండా అందరికీ ఉదారంగా ఇస్తారు. 6మీరు అడిగినప్పుడు సందేహించకుండా విశ్వాసంతో అడగండి ఎందుకంటే, సందేహించేవారు గాలిచేత విసరబడి కొట్టివేయబడే సముద్రపు అలల్లాంటివారు; 7కనుక వారు ప్రభువు నుండి తమకు ఏమైనా దొరుకుతుందని ఆశించకూడదు. 8అలాంటివారు రెండు రకాల మనస్సులను కలిగివుంటారు, తాము చేసే వాటన్నిటిలో అస్థిరంగా ఉంటారు.
9దీనులైన విశ్వాసులు తాము పైకెత్తబడుతున్న విధానాన్ని బట్టి అతిశయించాలి, 10అయితే ధనవంతులైనవారు తమ దీనస్థితిని బట్టి అతిశయించాలి, ఎందుకంటే గడ్డిలోని ఒక పువ్వులా ధనవంతులు కనుమరుగవుతారు. 11కాల్చివేసే వేడిమితో సూర్యుడు ఉదయించినప్పుడు గడ్డి వాడిపోతుంది; దాని పువ్వు రాలిపోతుంది, దాని అందం నశించిపోతుంది; ధనవంతుల పట్ల కూడా అలాగే జరుగుతుంది; తమ తీరికలేని జీవితం మధ్యలో వారు వాడిపోతారు.
12శోధన సహించినవారు ధన్యులు. పరీక్షలో నిలబడినవారు ప్రభువు తాను ప్రేమించినవారికి ఇస్తానని వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతారు.
13దేవుడు కీడు చేత శోధించబడడు; ఆయన ఎవరిని శోధించడు కాబట్టి ఎవరికైనా శోధన ఎదురైతే “నేను దేవుని చేత శోధించబడుతున్నాను” అని అనకూడదు. 14ఒకరు తమ సొంత కోరికతోనే ఆకర్షించబడి వాటి ద్వారా ప్రలోభాలకు గురికావడం వల్ల శోధించబడతారు; 15కోరిక గర్భాన్ని ధరించి పాపానికి జన్మనిస్తుంది, ఆ పాపం పూర్తిగా పెరిగినప్పుడు అది మరణానికి జన్మనిస్తుంది.
16నా ప్రియ సహోదరీ సహోదరులారా, మోసపోకండి. 17పరలోకం నుండి ఇవ్వబడిన ప్రతీ మంచిదైన సంపూర్ణమైన బహుమానం వెలుగుకు తండ్రియైనవాని దగ్గర నుండి క్రిందకు వస్తున్నాయి, ఒకచోట నిలబడని నీడల్లా ఆయన ఎన్నడు మారడు. 18ఆయన సృష్టంతటిలో మనం మొదటి ఫలాలుగా ఉండాలని, సత్యవాక్యం చేత మనకు జన్మనివ్వడానికి ఎంచుకున్నారు.
వినుట మరియు ఆచరించుట
19నా ప్రియ సహోదరీ సహోదరులారా, మీరు దీనిని గ్రహించాలి: ప్రతి ఒక్కరు వినడానికి చురుకుగా ఉండాలి, మాట్లాడడానికి నిదానంగా ఉండాలి, కోపగించుకోవడానికి నిదానంగా ఉండాలి; 20ఎందుకంటే మీ కోపం దేవుని నీతిని జరిగించదు. 21కనుక మీలో వున్న సమస్త నీచత్వాన్ని, అధికంగా పెరుగుతున్న దుష్టత్వాన్ని విడిచి మిమ్మల్ని రక్షించగల, శక్తి కలిగిన మీలో నాటబడిన వాక్యాన్ని దీనత్వంతో అంగీకరించండి.
22మీరు వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. వాక్యం చెప్పేది చేయండి. 23ఎవరైతే వాక్యాన్ని విని అది చెప్పిన ప్రకారం చేయరో, వారు తమ ముఖాన్ని అద్దంలో చూసుకొనే వారిలా ఉంటారు; 24వారు తమను చూసుకొని ప్రక్కకు వెళ్లిన వెంటనే తాము ఎలా ఉన్నారో మరిచిపోతారు. 25అయితే స్వాతంత్ర్యాన్ని ఇచ్చే సంపూర్ణమైన ధర్మశాస్త్రంలోనికి ఏకాగ్రతతో చూసి దానిలో కొనసాగేవారు, విని మర్చిపోయేవారిగా ఉండకుండా అది చెప్పిన ప్రకారం చేస్తారు; వారు తాము చేసిన దానిలో దీవించబడతారు.
26తమ నాలుకను అదుపుచేసుకోకుండా తమ హృదయాలను మోసం చేసుకుంటూ ఎవరైనా తాము భక్తిపరులమని భావిస్తే వారి భక్తి విలువలేనిది అవుతుంది. 27దేవుడైన తండ్రి యెదుట స్వచ్ఛంగా నిష్కళంకంగా ఉండే ధర్మం ఏంటంటే: అనాధలను, ఇబ్బందులలో ఉన్న విధవరాళ్ళను సంరక్షించడం, లోకంచేత మలినం కాకుండా తనను కాపాడుకోవడం.

Currently Selected:

యాకోబు 1: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in