YouVersion Logo
Search Icon

లూకా 8

8
విత్తువాని ఉపమానము
1ఆ తర్వాత, యేసు దేవుని రాజ్యసువార్తను ప్రకటిస్తూ, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి ప్రయాణం చేశారు. ఆయనతోపాటు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు, 2మరియు అపవిత్రాత్మల నుండి వ్యాధుల నుండి బాగుపడిన కొందరు స్త్రీలు, అనగా, ఏడు దయ్యాలు వదిలిపోయిన మగ్దలేనే మరియ; 3హేరోదు గృహనిర్వాహకుడైన కూజా భార్య యోహన్న; సూసన్న మరియు ఇంకా అనేకమంది ఉన్నారు. ఈ స్త్రీలు తమకు కలిగిన వాటితో వారికి సహాయం చేసేవారు.
4ఒక రోజు ప్రతి పట్టణం నుండి గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వస్తుండగా, ఆయన వారికి ఈ ఉపమానం చెప్పారు: 5“ఒక రైతు విత్తనాలను చల్లడానికి వెళ్లాడు. అతడు విత్తనాలు చల్లేటప్పుడు, కొన్ని దారి ప్రక్కన పడ్డాయి; అవి కాళ్ళతో త్రొక్కబడ్డాయి, పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. 6మరికొన్ని రాతి నేలలో పడ్డాయి, అవి మొలిచినప్పుడు, వాటికి తడి లేదు కనుక మొక్కలు ఎండిపోయాయి. 7మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదలలో పడ్డాయి, వాటితో ఆ ముండ్ల పొదలు పెరిగి వాటిని అణిచివేసాయి. 8మరికొన్ని విత్తనాలు మంచినేలలో పడ్డాయి. అవి మొలకెత్తి, విత్తబడినవాటి కన్న వందరెట్లు అధికంగా పంటనిచ్చాయి.”
ఆయన ఇది చెప్పిన తర్వాత, “వినడానికి చెవులుగలవారు విందురు గాక!” అని బిగ్గరగా అన్నారు.
9శిష్యులు, ఈ ఉపమాన భావం ఏమిటి? అని ఆయనను అడిగారు. 10ఆయన, “దేవుని రాజ్యం గురించిన రహస్యాలకు సంబంధించిన జ్ఞానం మీకు ఇవ్వబడింది, కాని ఇతరులతో ఉపమానరీతిలోనే మాట్లాడతాను, ఎందుకంటే,
“ ‘చూస్తూనే ఉంటారు కాని గ్రహించరు,
వింటూనే ఉంటారు కాని అర్థం చేసుకోరు.’#8:10 యెషయా 6:9
11“ఇది ఈ ఉపమాన భావం: విత్తనం దేవుని వాక్యం. 12దారి ప్రక్కన పడిన విత్తనాలు ఎవరంటే, వారు వాక్యాన్ని వింటారు, కానీ నమ్మి రక్షణ పొందకుండా అపవాది వచ్చి వారి హృదయాల్లో నుండి వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. 13రాతి నేలలో పడిన విత్తనాలు ఎవరంటే, వారు వాక్యన్ని విన్నప్పుడు దానిని సంతోషంతో అంగీకరిస్తారు, కానీ వారిలో వేరు ఉండదు. వారు కొంతకాలమే నమ్ముతారు, శోధన సమయంలో త్వరగా పడిపోతారు. 14ముండ్ల పొదలలో పడిన విత్తనాలు ఎవరంటే, వారు వాక్యాన్ని వింటారు, కాని కాలం గడిచేకొలది తమ జీవితాల్లో ఎదురయ్యే తొందరలు, ఐశ్వర్యాలు మరియు ఆనందాలతో అణిచివేయబడడంవల్ల, వాక్యంలో ఎదగరు. 15అయితే మంచినేలలో పడిన విత్తనాలు యోగ్యులై మంచి హృదయం కలిగినవారు, వారు వాక్యాన్ని వింటారు, దానిని పాటిస్తారు, పట్టుదలతో ఫలిస్తారు.”
దీపం ఒక స్తంభం పైన పెట్టబడాలి
16“ఎవ్వరూ దీపాన్ని వెలిగించి దానిని మట్టి పాత్ర క్రింద లేక మంచం క్రింద పెట్టరు. దానికి బదులు, లోపలికి వచ్చే వారికి వెలుగిచ్చేలా, దానిని దీపస్తంభం మీద పెడతారు. 17ఎందుకంటే మరుగున ఉంచినదేది బయటపడక ఉండదు, దాచిపెట్టబడినదేది తెలియకుండా లేక బహిర్గతం కాకుండ ఉండదు. 18కనుక మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. కలిగినవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది; లేనివారి నుండి, తమకు ఉన్నదని అనుకునేది కూడా తీసివేయబడుతుంది” అని చెప్పారు.
యేసు తల్లి మరియు సహోదరులు
19యేసు తల్లి మరియు సహోదరులు ఆయనను కలవడానికి వచ్చారు, కానీ ప్రజలు గుంపుగా ఉండడంతో ఆయన దగ్గరకు రాలేకపోయారు. 20అది చూసిన ఒకడు ఆయనతో, “నీ తల్లి మరియు నీ సహోదరులు నిన్ను కలవడానికి వచ్చి, బయట వేచి ఉన్నారు” అని చెప్పాడు.
21అందుకు ఆయన, “దేవుని వాక్యాన్ని విని, దాని ప్రకారం జీవించేవారే నా తల్లి, నా సహోదరులు” అని జవాబిచ్చారు.
యేసు తుఫానును శాంతింపచేయుట
22ఒక రోజు యేసు తన శిష్యులతో, “మనం సరస్సు అవతలి వైపుకి వెళ్దాం పదండి” అన్నారు, వారు పడవ ఎక్కి బయలుదేరారు. 23వారు ప్రయాణం చేస్తూ ఉండగా, యేసు నిద్రపోయారు. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి, పడవంతా నీళ్ళతో నిండిపోవడం మొదలు పెట్టింది, వారు ఎంతో ప్రమాదంలో ఉన్నారు.
24కనుక శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “బోధకుడా, బోధకుడా, మేము మునిగిపోతున్నాం” అంటూ ఆయనను లేపారు.
ఆయన లేచి, ఉప్పొంగుతున్న నీటిని మరియు గాలిని గద్దించగానే, తుఫాను ఆగింది, అంతా ప్రశాంతంగా మారింది. 25అప్పుడు ఆయన, “మీ విశ్వాసం ఎక్కడ?” అని తన శిష్యులను అడిగారు.
అయితే వారు విస్మయంతో భయపడుతు ఒకనితో ఒకడు, “ఈయన ఎవరు? గాలిని నీళ్ళను ఈయన ఆజ్ఞాపించగానే, అవి లోబడుతున్నాయి” అని చెప్పుకొన్నారు.
దయ్యం పట్టిన వానికి యేసు విడుదల కలుగచేయుట
26వారు గలిలయ సరస్సును దాటి, గెరాసేనీయులు నివసించు ప్రాంతాన్ని చేరుకొన్నారు. 27యేసు ఒడ్డున అడుగు పెట్టగానే, దయ్యాలు పట్టిన గ్రామస్తుడొకడు ఆయనకు ఎదురుగా వచ్చాడు. వాడు చాలా కాలం నుండి బట్టలు వేసుకోలేదు ఇంట్లో నివసించలేదు, సమాధుల్లో ఉండేవాడు. 28వాడు యేసును చూడగానే, వాడు కేక వేస్తూ ఆయన పాదాల దగ్గర పడి, “సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసూ, నాతో నీకేమి? నన్ను వేధించవద్దని నిన్ను వేడుకొంటున్నాను!” అని బిగ్గరగా అరిచాడు. 29ఎందుకంటే యేసు ఆ అపవిత్రాత్మను వాని నుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించారు. అది చాలాసార్లు వానిని పట్టి పీడిస్తూ ఉంది, వాని కాళ్ళకు చేతులకు గొలుసులను వేసి బంధించి కాపలా ఉన్నా, కాని వాడు ఆ గొలుసులను తెంపివేసేవాడు, అరిచేవాడు అరణ్యంలోనికి తరమబడేవాడు.
30“నీ పేరేమి?” అని యేసు వానిని అడిగారు.
“సేన” అని వాడు జవాబిచ్చాడు, ఎందుకంటే అనేక దయ్యాలు వానిలో చొరబడి ఉన్నాయి. 31పాతాళానికి వెళ్లమని తమను ఆజ్ఞాపించొద్దని అవి యేసును పదే పదే బ్రతిమలాడాయి.
32అక్కడ ఒక పెద్ద పందుల మంద కొండ మీద మేస్తూ ఉంది. ఆ దయ్యాలు ఆ పందులలోనికి చొరబడడానికి అనుమతి ఇవ్వుమని యేసును బ్రతిమలాడాయి, ఆయన వాటికి అనుమతి ఇచ్చారు. 33ఆ దయ్యాలు వానిలో నుండి బయటకు వచ్చి, ఆ పందులలోనికి చొరబడ్డాయి, వెంటనే ఆ మంద కొండ మీది నుండి వేగంగా సరస్సులోనికి పరుగెత్తుకొని వెళ్లి మునిగిపోయింది.
34ఎప్పుడైతే పందులను కాస్తున్నవారు జరిగిన దానిని చూసారో, వారు పరుగెత్తుకొని వెళ్లి పట్టణంలోను గ్రామీణ ప్రాంతంలోను తెలియజేసారు. 35ప్రజలు ఏమి జరిగిందో చూడడానికి వెళ్లారు. వారు యేసు వద్దకు వచ్చినప్పుడు, దయ్యాలు వదలిన మనుష్యుడు, బట్టలు వేసుకొని సరియైన మానసిక స్థితిలో, యేసు పాదాల దగ్గర కూర్చుని ఉండడం చూశారు; వారు భయపడ్డారు. 36ఆ దయ్యాలు పట్టినవాడు ఎలా బాగయ్యాడో చూసినవారు ఆ గ్రామ ప్రజలకు తెలియజేసారు. 37అప్పుడు గెరాసేన ప్రాంతపు ప్రజలందరు ఎంతో భయపడి, తమను విడిచిపొమ్మని యేసును బ్రతిమలాడారు. కనుక ఆయన పడవ ఎక్కి అక్కడి నుండి వెళ్లిపోయారు.
38అప్పుడు ఆ దయ్యాల నుండి విడుదల పొందినవాడు, తాను ఆయనతో పాటు వస్తానని బ్రతిమలాడాడు. 39కాని యేసు అతనితో, “నీ ఇంటికి వెళ్లి దేవుడు నీకు ఎంతగా మేలు చేశాడో చెప్పు” అని చెప్పి పంపివేసారు. కనుక వాడు వెళ్లిపోయి యేసు తనకు ఎంతగా మేలు చేశాడో ఆ పట్టణమంతటికి చెప్పాడు.
యేసు చనిపోయిన బాలికను తిరిగి లేపుట మరియు రోగియైన స్త్రీని స్వస్థపరచుట
40యేసు తిరిగి రాగానే, ఆయన కొరకు ఎదురు చూస్తున్న ప్రజలు సంతోషంగా ఆయనను ఆహ్వానించారు. 41అప్పుడు యాయీరు అనే పేరుగల సమాజమందిరపు అధికారి వచ్చి, యేసు పాదాలపై పడి, తన ఇంటికి రమ్మని బ్రతిమాలుకొన్నాడు. 42ఎందుకంటే సుమారు పన్నెండేళ్ల వయస్సుగల అతని ఏకైక కుమార్తె జబ్బుతో చనిపోయేలా ఉంది.
యేసు అతనితో వెళ్తూ ఉండగా, ప్రజలు గుంపుగా ఆయనపై పడుతున్నారు. 43మరియు పన్నెండేళ్ల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అక్కడ ఉంది. ఆమె తనకున్నదంతా వైద్యులకు ఖర్చు చేసినా గానీ, ఎవరు ఆమెను బాగు చేయలేకపోయారు. 44ఆమె ఆయన వెనుక నుండి వచ్చి, ఆయన వస్త్రపు అంచును ముట్టింది, వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయింది.
45“నన్ను ముట్టింది ఎవరు?” అని యేసు అడిగారు.
మేము కాదని అందరు అంటూ ఉంటే, పేతురు, “బోధకుడా, ప్రజలు గుంపుగా నీపై పడుతున్నారు కదా” అన్నాడు.
46అయినా యేసు, “ఎవరో నన్ను ముట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయటకు వెళ్లినట్లు నాకు తెలిసింది” అని అన్నారు.
47అప్పుడు ఆ స్త్రీ, ఇక దాగి ఉండలేనని తెలిసి, వణుకుతు వచ్చి ఆయన పాదాల యెదుట సాగిలపడింది. ఆమె ఎందుకు ఆయనను ముట్టుకుందో మరియు వెంటనే ఎలా స్వస్థత పొందిందో ప్రజలందరి ముందు చెప్పింది. 48అప్పుడు ఆయన ఆమెతో, “కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచింది. సమాధానంతో వెళ్లు” అని చెప్పారు.
49యేసు ఇంకా మాట్లాడుతుండగా, సమాజమందిరపు నాయకుడైన యాయీరు ఇంటి నుండి ఒకడు వచ్చాడు, యాయీరుతో, “నీ కుమార్తె చనిపోయింది, ఇక బోధకునికి శ్రమ కలిగించవద్దు” అని చెప్పాడు.
50వారి మాటలను విని, యేసు యాయీరుతో, “భయపడకు, నమ్మకం మాత్రం ఉంచు, నీ కుమార్తె స్వస్థపడుతుంది” అని చెప్పారు.
51ఆయన యాయీరు ఇల్లు చేరిన తర్వాత, పేతురు, యోహాను, యాకోబు మరియు ఆ బాలిక తల్లిదండ్రులును తప్ప మరి ఎవరిని లోనికి రానివ్వలేదు. 52ఆ సమయంలో, ప్రజలందరు ఆమె కొరకు ఏడుస్తూ రోదిస్తున్నారు. అప్పుడు యేసు, “ఏడుపు ఆపండి! ఈమె చనిపోలేదు కానీ నిద్రపోతుంది” అన్నారు.
53ఆమె చనిపోయిందని తెలిసి, వారు ఆయనను ఎగతాళి చేశారు. 54అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని ఆమెతో, “చిన్నదానా, లే!” అన్నారు. 55అప్పుడు ఆమెకు ప్రాణం తిరిగి వచ్చింది, ఆమె వెంటనే లేచి నిలబడింది. అప్పుడాయన, “ఆమెకు తినడానికి ఏమైన ఇవ్వండి” అని వారితో చెప్పారు. 56ఆమె తల్లిదండ్రులు అది చూసి ఆశ్చర్యపడ్డారు, అయితే ఆయన జరిగింది ఎవరికీ చెప్పకూడదు అని వారిని ఆదేశించారు.

Currently Selected:

లూకా 8: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in