YouVersion Logo
Search Icon

మార్కు 16

16
చనిపోయి తిరిగి లేచిన యేసు
1సబ్బాతు దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి యేసు శరీరానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలను కొన్నారు. 2సబ్బాతు దినం గడిచిన తర్వాత ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు వారు సమాధి దగ్గరకు వెళ్తూ 3“సమాధి ద్వారాన్ని మూసివుంచిన రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు అనుకున్నారు.
4కాని వారు అక్కడ చేరుకుని, ఆ పెద్ద రాయి ప్రక్కకు తొలగిపోయి ఉండడం చూసారు 5వారు ఆ సమాధిలోనికి వెళ్లినప్పుడు, తెల్లని అంగీ వేసుకొని ఉన్న ఒక యవ్వనస్థుడు కుడి ప్రక్కన కూర్చొని ఉండడం చూసి, చాలా భయపడ్డారు.
6అప్పుడు ఆ దూత, “భయపడవద్దు, మీరు సిలువవేయబడిన, నజరేయుడైన యేసును వెదుకుతున్నారు. ఆయన లేచారు! ఆయన ఇక్కడ లేరు. వారు ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. 7అయితే వెళ్లి, ఆయన శిష్యులతో, పేతురుతో, ‘ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. ఆయన మీతో చెప్పినట్లే, అక్కడ మీరు ఆయనను చూస్తారు’ ” అని చెప్పండని ఆ స్త్రీలతో చెప్పాడు.
8ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ సమాధి నుండి పరుగెత్తి వెళ్లిపోయారు. వారు చాలా భయపడ్డారు, కనుక వారు ఎవరితో ఏమి చెప్పలేదు.
9వారంలో మొదటి రోజైన ఆదివారం తెల్లవారుతుండగా, యేసు ఎవరిలో నుండి ఏడు దయ్యాలను వెళ్లగొట్టారో ఆ మగ్దలేనె మరియకు మొదట కనిపించారు. 10ఆమె వెళ్లి, ఆయనతోపాటు ఉండినవారై ఆయన కొరకు దుఃఖిస్తూ, ఏడుస్తున్నవారికి చెప్పింది. 11యేసు బ్రతికి ఉన్నాడని, ఆమె ఆయనను చూసిందని వారు విన్నప్పుడు, వారు నమ్మలేదు.
12ఆ తర్వాత వారిలో ఇద్దరు నడుస్తూ వెళ్తుండగా యేసు వారికి వేరే రూపంలో కనిపించారు. 13వారు తిరిగి వెళ్లి జరిగిన విషయాన్ని మిగిలిన శిష్యులకు చెప్పారు; కాని వీరి మాటలను కూడా వారు నమ్మలేదు.
14తర్వాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తున్నప్పుడు యేసు వారికి కనిపించారు. యేసు తిరిగి లేచిన తర్వాత ఆయనను చూసినవారు వారికి చెప్పినా వారు నమ్మలేదని, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన వారిని గద్దించారు.
15యేసు వారితో, “మీరు సర్వలోకానికి వెళ్లి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి. 16నమ్మి, బాప్తిస్మం పొందేవారు రక్షణ పొందుతారు, నమ్మని వారు శిక్షను అనుభవిస్తారు. 17నన్ను నమ్మిన వారందరి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి: నా నామంలో దయ్యాలను వెళ్లగొడతారు; క్రొత్త భాషలు మాట్లాడుతారు; 18తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు; విషం త్రాగినా వారికి ఏ హాని కలుగదు; వారు రోగుల మీద చేతులుంచినప్పుడు, రోగులు స్వస్థత పొందుతారు” అన్నారు.
19ప్రభువైన యేసు శిష్యులతో మాట్లాడిన తర్వాత, ఆయన పరలోకానికి ఆరోహణమయ్యారు, దేవుని కుడి వైపున కూర్చున్నారు. 20ఆ తర్వాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రకటించారు, ప్రభువు వారితో కూడా ఉండి, అద్బుతాలు మరియు సూచనలతో తన మాటలు నిజమని నిరూపించారు.#16:20 కొన్ని ప్రతులలో 9-20 వచనాలు లేవు.

Currently Selected:

మార్కు 16: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in