YouVersion Logo
Search Icon

మార్కు 2

2
పక్షవాతంగల వానిని క్షమించి స్వస్థపరచిన యేసు
1కొన్ని రోజుల తర్వాత, యేసు మళ్ళీ కపెర్నహూము పట్టణంలో ప్రవేశించినప్పుడు, ఆయన ఇంటికి వచ్చారని ప్రజలకు తెలిసింది. 2వారు పెద్ద సంఖ్యలో కూడి వచ్చారు కనుక తలుపు బయట నిలబడడానికి కూడ స్థలం లేదు, అయినా ఆయన వారికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. 3అప్పుడు కొందరు మనుష్యులు పక్షవాతంగల ఒక వ్యక్తిని ఆయన దగ్గరకు తీసుకొని వచ్చారు, నలుగురు అతన్ని మోసుకొచ్చారు. 4కానీ ప్రజలు గుంపుగా ఉన్నందుకు వాన్ని యేసు దగ్గరకు తీసుకొని వెళ్లలేక, సరిగ్గా యేసు ఉన్న చోట ఇంటి పైకప్పును విప్పి పక్షవాతంగల వాన్ని చాపపై పడుకోబెట్టి కిందికి దింపారు. 5యేసు వారి విశ్వాసం చూసి, పక్షవాతం గలవానితో, “కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి” అన్నారు.
6-7కొందరు ధర్మశాస్త్ర ఉపదేశకులు అక్కడ కూర్చొని ఉన్నారు, వారు తమలో తాము, “ఈ వ్యక్తి ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? ఇతడు దైవదూషణ చేస్తున్నాడు! దేవుడు తప్ప పాపాలను క్షమించగలవారెవరు?” అని ఆలోచిస్తున్నారు.
8వారు తమ హృదయాల్లో ఆలోచిస్తున్నది ఇదే అని వెంటనే యేసు తన ఆత్మలో గ్రహించి వారితో, “మీరు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు? 9ఏది సులభం: ఈ పక్షవాతం గలవానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడమా లేక, ‘నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు’ అని చెప్పడమా? 10అయితే మనుష్యకుమారునికి భూలోకంలో పాపాలను క్షమించే అధికారం ఉందని మీరు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను” అని అన్నారు. ఆయన పక్షవాతం గలవానితో, 11“నేను చెప్తున్నా. నీవు లేచి, నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్లు” అన్నారు. 12అతడు లేచి, తన పరుపెత్తుకొని అందరూ చూస్తుండగానే నడిచి వెళ్లాడు. అది చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపడి, “ఇలాంటివి ఇంతకు ముందు మేము ఎప్పుడు చూడలేదు!” అని చెప్తూ దేవుని స్తుతించారు.
లేవిని పిలిచిన, పాపులతో కలిసి భోజనం చేసిన యేసు
13యేసు మరొకసారి సరస్సు తీరానికి వెళ్లారు. అక్కడ ఒక గొప్ప జనసమూహం యేసు దగ్గరకు వచ్చింది, ఆయన వారికి బోధించడం మొదలుపెట్టారు. 14ఆయన మార్గంలో నడుస్తుండగా, పన్ను వసూలు చేసే స్థానంలో కూర్చుని ఉన్న అల్ఫయి కుమారుడగు లేవిని చూసి, “నన్ను వెంబడించు” అని యేసు అతనితో అన్నారు, లేవి లేచి ఆయనను వెంబడించాడు.
15లేవి ఇంట్లో యేసు భోజనం చేస్తుండగా, అనేకమంది పన్ను వసూలు చేసేవారు, పాపులు ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు, ఆయనను వెంబడించేవారు చాలామంది అక్కడ ఉన్నారు. 16పరిసయ్యులైన ధర్మశాస్త్ర ఉపదేశకులు అతన్ని పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి తినడం చూసి, “ఆయన పన్ను వసూలు చేసేవారితో పాపులతో ఎందుకు భోజనం చేస్తున్నాడు?” అని ఆయన శిష్యులను అడిగారు.
17అది విని, యేసు వారితో, “రోగులకే గాని, ఆరోగ్యవంతులకు వైద్యులు అక్కరలేదు. నేను నీతిమంతులను పిలువడానికి రాలేదు, కానీ పాపులను పిలువడానికి వచ్చాను” అన్నారు.
ఉపవాసం గురించి ప్రశ్నించిన యేసు
18యోహాను శిష్యులు మరియు పరిసయ్యులు ఉపవాసం ఉన్నారు. కొందరు వచ్చి, “యోహాను శిష్యులు మరియు పరిసయ్యుల శిష్యులు ఉపవాసం ఉంటున్నారు కాని, నీ శిష్యులు ఉండడం లేదు ఎందుకు?” అని యేసును అడిగారు.
19అందుకు యేసు, “పెండ్లికుమారుడు తమతో ఉన్నప్పుడు అతని అతిథులు ఎందుకు ఉపవాసం ఉంటారు? అతడు తమతో కూడ ఉన్నంత వరకు, వారు ఉపవాసం ఉండరు. 20అయితే పెండ్లికుమారుడు వారి దగ్గర నుండి తీసుకొనిపోబడే సమయం వస్తుంది, ఆ రోజున వారు ఉపవాసం ఉంటారు.
21“ఎవ్వరూ పాత బట్టకు క్రొత్త బట్ట అతుకువేసి కుట్టరు, అలా చేస్తే, క్రొత్త బట్టముక్క పాత బట్ట నుండి విడిపోయి చినుగును మరి ఎక్కువ చేస్తుంది. 22ఎవ్వరూ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసం పోయరు. అలా చేస్తే, ద్రాక్షరసం వలన ఆ తిత్తులు పిగిలిపోతాయి. అప్పుడు ద్రాక్షరసం, తిత్తులు రెండూ పాడైపోతాయి. అందుకే, వారు క్రొత్త ద్రాక్షరసం క్రొత్త తిత్తులలోనే పోస్తారు” అని చెప్పారు.
యేసు సబ్బాతుకు ప్రభువు
23ఒక సబ్బాతు దినాన యేసు పంటచేనుల గుండా వెళ్తున్నప్పుడు, ఆయనతోపాటు నడుస్తున్న శిష్యులు, కొన్ని కంకులు తెంపుకొని తినడం మొదలుపెట్టారు. 24అది చూసిన పరిసయ్యులు, “చూడు, ఎందుకు వారు సబ్బాతు దినాన చేయకూడని పని చేస్తున్నారు?” అని ఆయనతో అన్నారు.
25అందుకు ఆయన, “దావీదుకు మరియు అతనితో ఉన్నవారికి ఆకలి వేసినప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు అతడు ఏమి చేశాడో మీరు చదవలేదా? 26ప్రధాన యాజకుడైన అబ్యాతారు దినాలలో, అతడు దేవుని ఆలయంలో ప్రవేశించి, ధర్మశాస్త్రం ప్రకారం యాజకులు తప్ప మరెవరు తినకూడని ప్రతిష్ఠిత రొట్టెను తీసుకొని తాను తిని, తనతో ఉన్నవారికి కూడా ఇచ్చాడు” అని జవాబిచ్చారు.
27ఆయన వారితో, “మనుష్యుల కొరకు సబ్బాతు దినం కాని, సబ్బాతు దినం కొరకు మనుష్యులు నియమించబడలేదు. 28కనుక మనుష్యకుమారుడు సబ్బాతు దినానికి కూడ ప్రభువు” అని చెప్పారు.

Currently Selected:

మార్కు 2: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in