YouVersion Logo
Search Icon

ఫిలిప్పీ పత్రిక 4

4
చివరిగా స్థిరత్వం ఏకత్వం కోసం విన్నపం
1కాబట్టి, నా సహోదరీ సహోదరులారా, నా ఆనందం నా కిరీటమైన నా ప్రియ స్నేహితులారా, నేను మిమ్మల్ని ప్రేమించి, ఈ విధంగా మీరు ప్రభువులో స్థిరంగా నిలబడి ఉండాలని కోరుకుంటున్నాను.
2ప్రభువులో ఏక మనస్సు కలిగి ఉండమని యువొదియను, సుంటుకేను బ్రతిమాలుతున్నాను. 3అవును, నా నిజమైన సహకారీ, జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన ఈ స్త్రీలు క్లెమెంతుతో మిగతా నా సహపనివారితో కలిసి సువార్త పనిలో నాతోకూడ ప్రయాసపడ్డారు. కాబట్టి వారికి సహాయం చేయమని నిన్ను అడుగుతున్నా.
చివరి హెచ్చరికలు
4ఎల్లప్పుడు ప్రభువులో ఆనందించండి, మరల చెప్తున్నాను ఆనందించండి. 5మీ శాంత స్వభావాన్ని అందరికి స్పష్టంగా తెలియనివ్వండి. ప్రభువు సమీపంగా ఉన్నారు. 6దేన్ని గురించి వేదన పడకండి, కాని ప్రతి విషయంలో ప్రార్థనావిజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకంగా మీ విన్నపాలను దేవునికి తెలియజేయండి. 7అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయాలను మీ తలంపులను కాపాడుతుంది.
8చివరిగా, సహోదరీ సహోదరులారా, ఏదైనా యోగ్యమైనదిగా లేదా మంచిగా ఉంటే, సత్యమైన వాటి మీద, గొప్పవాటి మీద, న్యాయమైన వాటి మీద, పవిత్రమైన వాటి మీద, సుందరమైన వాటి మీద, ఘనమైన వాటి మీద మీ మనస్సులను పెట్టండి. 9మీరు నా నుండి ఏవి నేర్చుకున్నారో, పొందారో లేదా విన్నారో లేదా నాలో ఏమి చూశారు వాటిని ఆచరణలో పెట్టండి. అప్పుడు సమాధానకర్తయైన దేవుడు మీతో ఉంటారు.
బహుమానాల కోసం కృతజ్ఞతలు
10నా గురించి మీరు తిరిగి మరల ఆలోచిస్తున్నారని ప్రభువులో ఎంతో సంతోషించాను. మీరు నా గురించి ఆలోచిస్తున్నారు, గాని దానిని చూపించడానికి తగిన అవకాశం మీకు దొరకలేదు. 11నేను అవసరంలో ఉన్నానని ఇలా చెప్పడం లేదు. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నా, ఆ స్థితిలో తృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. 12దీనస్థితిలో ఉండడం అంటే నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం కూడా నాకు తెలుసు. ఏ స్థితిలోనైనా అన్ని పరిస్థితుల్లో అనగా, కడుపునిండా తిన్నా లేదా ఆకలితో ఉన్నా, సమృద్ధిగా ఉన్నా లేదా అవసరంలో ఉన్నా తృప్తి కలిగి ఉండడానికి రహస్యాన్ని నేను నేర్చుకున్నాను. 13నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.
14అయినప్పటికీ మీరు నా శ్రమలలో భాగం పంచుకోవడం మంచి పని. 15అంతేకాక, ఫిలిప్పీయులారా, మీరు సువార్తను తెలుసుకున్న తొలి రోజుల్లో, నేను మాసిదోనియలో నుండి పంపబడినప్పుడు, ఇవ్వడంలో తీసుకోవడంలో కేవలం మీరు తప్ప మరి ఏ సంఘం నాతో పాలివారు కాలేదని మీకు తెలుసు. 16నేను థెస్సలొనీకలో ఉన్నప్పుడు కూడా, నేను అవసరంలో ఉన్నప్పుడు అనేకసార్లు మీరు సహాయాన్ని పంపించారు. 17నేను మీ కానుకలను కోరుకోవడంలేదు; మీరు ఇంకా అధికంగా పొందుకోవాలని కోరుకుంటున్నాను. 18నేను సమృద్ధిగా పూర్తిగా పొందాను. మీరు పంపిన కానుకలు ఎపఫ్రొదితు నుండి అందుకున్నాను. అవి దేవునికి ఇష్టమైన పరిమళ అర్పణ, అంగీకారమైన త్యాగము. 19నా దేవుడు తన మహిమైశ్వర్యం ఆధారంగా క్రీస్తు యేసులో మీ ప్రతి అవసరాన్ని తీరుస్తారు.
20మన తండ్రియైన దేవునికి మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.
చివరి శుభవచనములు
21క్రీస్తు యేసులో దేవుని ప్రజలందరికి వందనాలు చెప్పండి.
నాతోకూడ ఉన్న సహోదరీ సహోదరులందరు మీకు వందనాలు చెప్తున్నారు.
22ఇక్కడ ఉన్న దేవుని ప్రజలందరు ముఖ్యంగా కైసరు కుటుంబానికి చెందినవారు మీకు వందనాలు చెప్తున్నారు.
23ప్రభువైన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక ఆమేన్.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in