YouVersion Logo
Search Icon

ప్రకటన 14

14
గొర్రెపిల్ల, 1,44,000 మంది
1ఆ తర్వాత నా ఎదుట సీయోను పర్వతం మీద వధించబడిన గొర్రెపిల్ల, ఆయనతో 1,44,000 మంది తమ నుదుటి మీద ఆయన పేరును ఆయన తండ్రి పేరును వ్రాయబడినవారు నిలబడి ఉండడం చూశాను. 2అప్పుడు నేను పరలోకం నుండి ప్రవాహ జలాల ధ్వనిలా, గొప్ప ఉరుములా ఒక శబ్దాన్ని విన్నాను. అది నాకు వీణ వాయిద్యకారులు తమ వాయిద్యాలను వాయిస్తున్న ధ్వనిలా వినిపించింది. 3వారు సింహాసనం ముందు, నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచన పొందిన ఈ 1,44,000 మంది తప్ప ఆ పాటను ఎవరు నేర్చుకోలేరు. 4వీరు ఏ స్త్రీతో తమను అపవిత్రం చేసుకోకుండా పవిత్రంగా జీవించారు. గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తే అక్కడికి వారు దాన్ని అనుసరించారు. వారు మానవుల నుండి దేవునికి, గొర్రెపిల్లకు తొలిఫలంగా అర్పించడానికి కొనబడ్డవారు. 5వారి నోటి మాటల్లో ఏ అబద్ధం కనిపించదు; వీరు నిందలేనివారు.
ముగ్గురు దేవదూతలు
6ఆ తర్వాత నేను ఇంకొక దేవదూత ఆకాశం మధ్య ఎగిరివెళ్తూ భూమి మీద జీవిస్తున్న ప్రతి దేశానికి, ప్రతి జాతి వారికి, ప్రతి భాష మాట్లాడేవారికి, ప్రతి జనులకు శాశ్వతమైన సువార్తను ప్రకటించడాన్ని చూశాను. 7అతడు పెద్ద స్వరంతో, “దేవునికి భయపడి ఆయనకు మహిమ చెల్లించండి! ఎందుకంటే ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చింది! ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని నీటి ఊటలను సృష్టించిన దేవుని ఆరాధించండి!” అని చెప్పాడు.
8రెండవ దేవదూత అతని వెంబడించి, “ ‘కూలిపోయింది! బబులోను మహా పట్టణం కూలిపోయింది!’#14:8 యెషయా 21:9 అది తన వ్యభిచార మద్యాన్ని అన్ని దేశాలకు త్రాగించింది” అని చెప్పాడు.
9మూడవ దేవదూత వారిని వెంబడించి పెద్ద స్వరంతో, “మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించి, తమ నుదుటి మీద లేదా చేతి మీద దాని ముద్ర వేయించుకొంటే, 10వారు ఏమి కలపకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమనే మద్యాన్ని త్రాగుతారు. పవిత్ర దేవదూతల ఎదుట వధించబడిన గొర్రెపిల్ల సన్నిధిలో అగ్ని గంధకంతో బాధించబడతారు. 11ఆ మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించిన లేదా దాని పేరు ముద్రను వేయించుకొన్నవారు విశ్రాంతి లేకుండా రాత్రింబగళ్ళు వేదన పొందుతారు. ఆ వేదన పొగ ఎల్లప్పుడు లేస్తూనే ఉంటుంది” అని బిగ్గరగా చెప్పాడు. 12ఇది యేసు క్రీస్తుకు నమ్మకంగా ఉండి ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్న దేవుని ప్రజలు సహనాన్ని చూపించాల్సిన సమయం.
13అప్పుడు పరలోకం నుండి ఒక స్వరం, “ఇప్పటినుండి ప్రభువులో ఉంటూ చనిపోయే వారు ధన్యులు! అని వ్రాసి పెట్టు” అని చెప్పింది.
దేవుని ఆత్మ, “అవును నిజమే, తమ ప్రయాస నుండి విశ్రాంతి పొందుతారు. ఎందుకంటే వారి క్రియల ఫలాన్ని వారు పొందుతారు” అని పలకడం వినిపించింది.
భూమిపై పంటను కోయుట, ద్రాక్ష గానుగ త్రొక్కుట
14నేను చూస్తుండగా ఒక తెల్లని మేఘం మీద మనుష్యకుమారునిలా#14:14 దాని 7:13 ఉన్న ఒకడు కూర్చుని ఉన్నాడు. అతడు తన తలమీద బంగారు కిరీటాన్ని ధరించి చేతిలో పదునైన కొడవలిని పట్టుకుని ఉన్నాడు. 15అప్పుడు మరొక దేవదూత దేవాలయంలో నుండి బయటకు వచ్చి మేఘం మీద కూర్చున్న వానితో, “భూమి మీద పంట పూర్తిగా పండి పోయింది కాబట్టి నీ కొడవలి తీసుకుని పండిన పంటను కోయాలి” అని బిగ్గరగా చెప్పాడు. 16కాబట్టి మేఘం మీద కూర్చున్న వాడు తన కొడవలిని భూమి మీద తిప్పగానే భూమి పంటంతా కోయబడింది.
17మరొక దేవదూత పరలోక దేవాలయంలో నుండి బయటకు వచ్చాడు. అతని చేతిలో కూడా పదునైన కొడవలి ఉంది. 18మరో దేవదూత బలిపీఠం నుండి వచ్చాడు. అతనికి బలిపీఠం మీద ఉన్న అగ్నిపై అధికారం ఉంది. అతడు పదునైన కొడవలి గలవానితో బిగ్గరగా, “భూమి మీద ఉన్న ద్రాక్షపండ్లు పండిపోయాయి కాబట్టి నీ పదునైన కొడవలితో ద్రాక్షపండ్ల గుత్తులను కోయాలి” అని చెప్పాడు. 19అప్పుడు ఆ దేవదూత తన కొడవలిని భూమి మీద త్రిప్పి ద్రాక్షపండ్లను కోసి దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిలో పడవేశాడు. 20ఆ ద్రాక్ష గానుగ పట్టణానికి బయట ఉంది. అక్కడ ద్రాక్షపండ్లను త్రొక్కడంతో ఆ ద్రాక్ష గానుగ నుండి 1,600 స్టాడియా#14:20 అంటే, సుమారు మూడువందల కిలోమీటర్లు దూరం వరకు గుర్రాల కళ్లెమంత ఎత్తులో ఆ రక్తం నదిలా ప్రవహించింది.

Currently Selected:

ప్రకటన 14: TSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in