YouVersion Logo
Search Icon

ప్రకటన 16

16
దేవుని ఏడు ఉగ్రత పాత్రలు
1అప్పుడు దేవాలయంలో నుండి ఒక పెద్ద స్వరం ఏడుగురు దేవదూతలతో, “మీరు వెళ్లి దేవుని ఉగ్రత గల ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించండి” అని బిగ్గరగా చెప్పడం విన్నాను.
2మొదటి దేవదూత వెళ్లి భూమి మీద తన పాత్రను కుమ్మరించాడు. అప్పుడు ఆ మృగం యొక్క ముద్రగలవారికి, దాని విగ్రహాన్ని పూజించేవారికి భయంకరమైన నొప్పి కలిగించే అసహ్యమైన కురుపులు పుట్టాయి.
3రెండవ దేవదూత సముద్రం మీద తన పాత్రను కుమ్మరించిన వెంటనే సముద్రపు నీరు చనిపోయినవారి రక్తంలా మారింది; దానిలోని ప్రతి ప్రాణి చనిపోయింది.
4మూడవ దేవదూత తన పాత్రను నదులు, నీటి ఊటల మీద కుమ్మరించినప్పుడు అవి రక్తంగా మారాయి. 5అప్పుడు జలాల మీద అధికారం కలిగిన దేవదూత ఇలా చెప్పడం విన్నాను,
“ఓ పరిశుద్ధుడా! నీవు ఉన్నవాడవు, ఉండిన వాడవు,
ఈ తీర్పు తీర్చడానికి నీవు న్యాయవంతుడవు.
6వారు నీ పరిశుద్ధ ప్రజల రక్తాన్ని నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు కాబట్టి,
వారికి తగినట్లే వారికి రక్తాన్ని త్రాగించావు.”
7అప్పుడు బలిపీఠం ఈ విధంగా బదులిచ్చింది:
“అవును, ఓ సర్వశక్తిమంతుడా ప్రభువైన దేవా,
నీ తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి.”
8నాలుగవ దేవదూత సూర్యుని మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు అగ్నితో ప్రజలను కాల్చడానికి సూర్యునికి అనుమతి ఇవ్వబడింది. 9ప్రజలు ఆ భయంకరమైన వేడికి కాలిపోయి ఈ తెగుళ్ళపై అధికారం కలిగిన దేవుని నామాన్ని దూషించారే తప్ప పశ్చాత్తాపపడి ఆయనను మహిమపరచలేదు.
10అయిదవ దేవదూత తన పాత్రను ఆ మృగం యొక్క సింహాసనం మీద కుమ్మరించినప్పుడు దాని రాజ్యమంతా చీకటి కమ్మింది. ప్రజలు ఆ వేదనను తట్టుకోలేక తమ నాలుకలను కొరుక్కున్నారు. 11వారికి కలిగిన వేదనకు, కురుపులకు వారు పరలోక దేవుని దూషించారు కానీ తాము చేసిన వాటి గురించి పశ్చాత్తాపపడలేదు.
12ఆరో దేవదూత యూఫ్రటీసు అనే మహా నది మీద తన పాత్రను కుమ్మరించినప్పుడు, తూర్పు నుండి రాజులు వచ్చేలా మార్గం సిద్ధపరచడానికి ఆ నది పూర్తిగా ఎండిపోయింది. 13తర్వాత కప్పలను పోలిన మూడు అపవిత్రాత్మలు నాకు కనబడ్డాయి; అవి ఘటసర్పం నోటి నుండి, మృగం నోటి నుండి అబద్ధ ప్రవక్త నోటి నుండి బయటకు వచ్చాయి. 14అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి.
15“ఇదిగో! నేను దొంగలా వస్తాను! దిగంబరులుగా ఉండి సిగ్గుపడేవారిగా ఉండకుండా, మెలకువగా ఉండి వస్త్రం ధరించుకొని సిద్ధపడి ఉన్నవారు ధన్యులు!”
16ఆ అపవిత్రాత్మలు రాజులనందరిని హెబ్రీ భాషలో “హర్మగిద్దోను” అని పిలువబడే స్థలంలో పోగుచేశాయి.
17ఏడవ దేవదూత గాలిలో తన పాత్రను కుమ్మరించినప్పుడు, దేవాలయంలోని సింహాసనం నుండి ఒక స్వరం బిగ్గరగా, “ఇక సమాప్తం అయింది!” అని చెప్పింది. 18అప్పుడు మెరుపుల వెలుగులు, ధ్వనులు, ఉరుములు, భయంకరమైన భూకంపం వచ్చాయి. మానవులు భూమి మీద జీవిస్తున్నప్పటి నుండి ఇలాంటి భూకంపం కలుగలేదు. అది చాలా భయంకరమైన భూకంపము. 19ప్రసిద్ధిగాంచిన ఆ గొప్ప పట్టణం మూడు భాగాలుగా చీలిపోయింది, దేశాల పట్టణాలు కుప్పకూలాయి. దేవుడు బబులోను మహాపట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని తన ఉగ్రత అనే మద్యంతో నిండిన పాత్రను ఆమెకు ఇచ్చారు. 20అప్పుడు ప్రతి ద్వీపం పారిపోయింది, పర్వతాలు కనబడలేదు. 21ఆకాశం నుండి మనుష్యుల మీద భారీ వడగండ్లు పడ్డాయి. ఆ వడగండ్లు ఒక్కొక్కటి సుమారు నలభై అయిదు కిలోల బరువు ఉన్నాయి. ఆ వడగండ్ల తెగులు చాలా భయంకరంగా ఉండడంతో ఆ దెబ్బలకు తట్టుకోలేక ప్రజలు దేవుని దూషించారు.

Currently Selected:

ప్రకటన 16: TSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in