YouVersion Logo
Search Icon

ప్రకటన 19

19
బబులోను పతనాన్ని బట్టి మూడింతల హల్లెలూయా
1ఈ సంగతుల తర్వాత పరలోకంలో ఒక గొప్ప జనసమూహం అరుస్తున్న శబ్దం వంటి శబ్దాన్ని నేను విన్నాను:
“హల్లెలూయా! రక్షణ, మహిమ, బలం మన దేవునివే!
2ఎందుకంటే ఆయన తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి.
భూమిని తన వ్యభిచారంతో చెడగొట్టిన,
ఆ మహావేశ్యకు ఆయన శిక్ష విధించారు.
తన సేవకుల రక్తాన్ని కార్చిన ఆమెపై ఆయన పగతీర్చుకున్నారు.”
3మరొకసారి వారు ఇలా బిగ్గరగా కేకలు వేశారు:
“హల్లెలూయా! ఆమె నుండి వస్తున్న పొగ
ఎల్లకాలం పైకి లేస్తూనే ఉంటుంది!”
4అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి బిగ్గరగా ఇలా అన్నారు:
“ఆమేన్! హల్లెలూయా!”
అంటూ ఆరాధించారు.
5అప్పుడు సింహాసనం నుండి వచ్చిన ఒక స్వరం,
“దేవునికి భయపడేవారలారా,
ఓ దేవుని సేవకులారా!
చిన్నవారైన పెద్దవారైన అందరు
మన దేవుని స్తుతించండి”
అని పలికింది.
6అప్పుడు మహా గొప్ప జనసమూహం వంటి శబ్దాన్ని, పారే జలాల గర్జనను ఉరుముల ధ్వనిని పోలిన స్వరం ఇలా అన్నది,
“హల్లెలూయా! సర్వశక్తిగల మన ప్రభువైన
దేవుడు పరిపాలిస్తున్నారు.
7కాబట్టి మనం ఆనందించి ఉత్సాహ ధ్వనులతో
ఆయనను కీర్తించుదాం!
ఎందుకంటే ఇదిగో గొర్రెపిల్ల పెళ్ళి రోజు వచ్చేసింది
ఆయన వధువు తనను తాను సిద్ధపరచుకుంది.
8ఆమె ధరించడానికి ప్రకాశమైన శుద్ధమైన,
సున్నితమైన నార వస్త్రాలు ఆమెకు ఇవ్వబడ్డాయి.”
సన్నని నారబట్టలు అనగా దేవుని పరిశుద్ధ ప్రజలు చేసిన నీతి క్రియలు అని అర్థము.
9ఆ తర్వాత దేవదూత నాతో, “గొర్రెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానం పొందినవారు ధన్యులు! ఇది వ్రాయి. ఇవి దేవుని సత్య వాక్కులు” అని చెప్పాడు.
10అప్పుడు అతన్ని ఆరాధించడానికి నేను ఆ దేవదూత పాదాల ముందు సాగిలపడ్డాను. కాని అతడు నాతో, “వద్దు! ఇలా చేయకు! నేను ఇతర విశ్వాసుల వలె యేసు కోసం సాక్ష్యమిచ్చే నీలాంటి సేవకుడనే. దేవునినే పూజించు! ఎందుకంటే యేసును గురించిన సాక్ష్యం కలిగి ఉండడమే ప్రవచించే ఆత్మ” అని నాతో చెప్పాడు.
పరలోక వీరుడు మృగాన్ని ఓడించుట
11అప్పుడు పరలోకం తెరవబడి నా ముందు ఒక తెల్లని గుర్రం కనిపించింది. దాని మీద స్వారీ చేసే వ్యక్తి నమ్మకమైన సత్యవంతుడు అని పిలువబడతాడు. ఆయన న్యాయమైన తీర్పును ఇస్తూ యుద్ధం చేస్తాడు. 12ఆయన కళ్లు అగ్నిజ్వాలల్లా ఉంటాయి. ఆయన తలమీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఆయన మీద ఒక పేరు వ్రాయబడి ఉంది, అది ఆయనకు తప్ప మరి ఎవరికి తెలియదు. 13రక్తంలో ముంచబడిన వస్త్రాలను ఆయన ధరించి ఉన్నాడు. ఆయనకు దేవుని వాక్యమని పేరు. 14తెల్లని, పవిత్రమైన సన్నని నారబట్టలను ధరించి తెల్లని గుర్రాల మీద స్వారీ చేస్తున్న పరలోక సైన్యాలు ఆయనను వెంబడిస్తున్నాయి. 15దేశాలను నరకడానికి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. “ఆయన ఒక ఇనుపదండంతో వారిని పరిపాలిస్తారు.#19:15 కీర్తన 2:9” ఆయన సర్వశక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిని త్రొక్కుతారు. 16ఆయన ధరించిన వస్త్రాల మీద ఆయన తొడ మీద ఈ పేరు వ్రాసి ఉంది:
రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు.
17అప్పుడు సూర్యుని మీద నిలబడిన ఒక దూతను నేను చూశాను, అతడు బిగ్గరగా మధ్య ఆకాశంలో ఎగిరే పక్షులన్నిటినీ పిలుస్తూ వాటితో, “రండి! దేవుని గొప్ప విందుకు కలిసి రండి! 18గుర్రాలు, రాజుల మాంసాన్ని, సైన్యాధికారుల మాంసాన్ని, బలవంతుల మాంసాన్ని, గుర్రాల, వాటి మీద స్వారీ చేసేవారి మాంసాన్ని, స్వతంత్రులు బానిసలు సామాన్యులు గొప్పవారితో సహా ప్రజలందరి మాంసాన్ని తినడానికి రండి!” అని బిగ్గరగా అరిచి చెప్పాడు.
19అప్పుడు నేను ఆ గుర్రం మీద స్వారీ చేసేవానితో ఆయన సైన్యంతో యుద్ధం చేయడానికి ఆ మృగం భూ రాజులు, వారి సైన్యాలతో కలిసి రావడం నేను చూశాను. 20అయితే ఆ మృగం పట్టుబడింది, దాంతో పాటు దాని పక్షాన సూచకక్రియలు చేసిన అబద్ధ ప్రవక్త కూడా పట్టుబడ్డాడు. అతడు ఈ సూచకక్రియలతో మృగం యొక్క ముద్ర వేయబడి దాని విగ్రహాన్ని పూజించిన వారిని మోసగించాడు. వీరిద్దరు ప్రాణాలతో మండుతున్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయబడ్డారు. 21మిగిలిన వారు ఆ గుర్రం మీద కూర్చుని స్వారీ చేస్తూ వస్తున్న వాని నోటి నుండి బయటకు వస్తున్న ఖడ్గంతో చంపబడ్డారు. అప్పుడు పక్షులన్నీ వారి మాంసాన్ని కడుపారా తిన్నాయి.

Currently Selected:

ప్రకటన 19: TSA

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in