5
గ్రంథపుచుట్ట, గొర్రెపిల్ల
1అప్పుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని కుడిచేతిలో ఇరువైపుల వ్రాయబడి ఏడు ముద్రలతో ముద్రించబడి ఉన్న ఒక గ్రంథపుచుట్టను నేను చూశాను. 2అప్పుడు శక్తిగల ఒక దేవదూత బిగ్గరగా, “చుట్టబడి ఉన్న ఈ ముద్రలను విప్పి గ్రంథపుచుట్టను తెరవగలిగే యోగ్యుడు ఎవరు?” అని ప్రకటన చేస్తుంటే నేను చూశాను. 3అయితే పరలోకంలో కాని, భూమి మీద కాని, భూమి క్రింద కాని ఉన్నవారిలో కాని ఎవరూ ఆ గ్రంథపుచుట్టను విప్పలేకపోయారు, కనీసం దానిలోనికి చూడలేకపోయారు. 4ఆ గ్రంథపుచుట్టను తెరవడానికి కాని దాని లోపలకి చూడడానికి కాని సామర్థ్యం కలవారు ఎవరూ లేరని నేను చాలా ఏడుస్తూ ఉన్నప్పుడు, 5పెద్దలలో ఒకరు నాతో, “ఏడవకు, ఇదిగో, దావీదు వేరు నుండి వచ్చిన యూదా గోత్రపు సింహం జయాన్ని పొందాడు. ఆయనే ఆ ఏడు ముద్రలను విప్పి ఆ గ్రంథపుచుట్టను తెరవగలరు” అన్నాడు.
6అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూశాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ల ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు. 7ఆ గొర్రెపిల్ల, సింహాసనం మీద కూర్చుని ఉన్నవాని దగ్గరకు వెళ్లి ఆయన కుడిచేతిలో ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకున్నాడు. 8ఆయన ఆ గ్రంథపుచుట్టను తీసుకోగానే ఆ నాలుగు ప్రాణులు, ఆ ఇరవైనలుగురు పెద్దలు వధించబడిన ఆ గొర్రెపిల్ల ముందు సాగిలపడ్డారు. వారిలో ప్రతి ఒక్కరు తంతి వీణను పరిశుద్ధుల ప్రార్థనలనే ధూపంతో నిండిన బంగారు గిన్నెలను పట్టుకున్నారు. 9వారు ఒక క్రొత్త పాటను పాడారు,
“చుట్టబడి ఉన్న ఆ గ్రంథపుచుట్టను తీసుకుని,
దాని ముద్రలను తెరవడానికి నీవే యోగ్యుడవు!
ఎందుకంటే ప్రతి గోత్రం నుండి, ప్రతి భాష మాట్లాడేవారి నుండి,
ప్రతి జాతిలో నుండి, ప్రతి దేశంలోని ప్రజలను,
దేవుని కోసం విడిపించడానికి నీవు వధించబడి నీ రక్తంతో కొన్నావు.
10నీవు వారిని దేవుని సేవించే రాజ్యంగా యాజకులుగా చేశావు,
భూమిని పరిపాలించడానికి వారిని నియమించావు.”
11అప్పుడు నేను చూస్తూ ఉండగా, సింహాసనం చుట్టూ ఉన్న నాలుగు ప్రాణుల పెద్దల చుట్టూ ఉన్న వేలాదివేల కోటానుకోట్ల దేవదూతల స్వరం నాకు వినబడింది. 12వారు పెద్ద స్వరంతో ఇలా అంటున్నారు:
“శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, బలం,
గౌరవం, మహిమ, స్తుతులను పొందడానికి
యోగ్యుడు వధించబడిన గొర్రెపిల్లయే!”
13అప్పుడు పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద, సముద్రంలో ఉన్న సృష్టించబడిన ప్రతి ప్రాణి, అనగా వాటిలో ఉన్న సమస్తం ఇలా చెప్తుండగా నేను విన్నాను:
“సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవానికి, వధించబడిన గొర్రెపిల్లకు
స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం,
నిరంతరం కలుగును గాక!”
14ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని చెప్పాయి, అప్పుడు ఆ పెద్దలందరు సాగిలపడి ఆరాధించారు.