11
ఇశ్రాయేలు ప్రజల్లో మిగిలి ఉన్నవారు
1అందుకు నా ప్రశ్న ఏంటంటే: దేవుడు తన ప్రజలను తిరస్కరిస్తారా? ఎన్నటికీ కాదు! నేను కూడా ఇశ్రాయేలుకు చెందినవాన్నే, అబ్రాహాము సంతానాన్నే, బెన్యామీను గోత్రానికి చెందినవాన్నే. 2తన ప్రజలను అనగా తాను ముందుగానే ఎరిగి ఉన్నవారిని దేవుడు తిరస్కరించరు. ఏలీయా గురించిన భాగంలో లేఖనం ఏమి చెప్తుందో మీకు తెలియదా? ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా అతడు దేవునికి ప్రార్థన చేస్తూ, 3“ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపారు, నీ బలిపీఠాలను కూల్చివేశారు, నేను ఒక్కన్ని మాత్రమే మిగిలాను, వారు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు”#11:3 1 రాజులు 19:10,14 అని ఎంతగానో మొరపెట్టుకున్నాడు. 4అయితే దేవుడు అతనికిచ్చిన సమాధానం ఏంటి? “బయలుకు మోకరించని ఏడువేలమందిని నా కోసం ప్రత్యేకించుకున్నాను”#11:4 1 రాజులు 19:18 అని. 5అదే విధంగా ప్రస్తుత సమయంలో కూడా కృప ద్వారా ఏర్పాటు చేయబడినవారు మిగిలే ఉన్నారు. 6అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు.
7అప్పుడు ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు ఆసక్తితో దేనిని వెదికారో అది వారికి దొరకలేదు. వారిలో ఏర్పరచబడినవారికే అది దొరికింది. కాని మిగిలిన వారు కఠినంగా అయ్యారు. 8దాని గురించి ఇలా వ్రాయబడింది:
“నేటి వరకు
దేవుడు వారికి మైకంగల ఆత్మను,
చూడలేని కళ్లను
వినలేని చెవులను ఇచ్చారు.”#11:8 ద్వితీ 29:4; యెషయా 29:10
9దావీదు,
“వారి భోజనబల్ల వారికి ఉచ్చుగా బోనుగా మారి
వారికి అడ్డుబండగా తగిన శాస్తిగా ఉండును గాక.
10వారు చూడకుండ వారి కళ్లకు చీకటి కమ్మును గాక,
వారి నడుములు శాశ్వతంగా వంగిపోవును గాక”#11:10 కీర్తన 69:22,23 అని చెప్తున్నాడు.
అంటుకట్టబడిన కొమ్మలు
11మరలా నేను: వారు తిరిగి తేరుకోలేనంతగా తొట్రిల్లి పడిపోతారా? అని అడుగుతున్నా, అలా ఎన్నటికి కాదు, వారు చేసిన ఆజ్ఞాతిక్రమాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు అసూయపడేలా చేయడానికి యూదేతరులకు రక్షణ లభించింది. 12అయితే వారి ఆజ్ఞాతిక్రమం లోకానికి ఐశ్వర్యంగా, వారి నష్టం యూదేతరులకు ఐశ్వర్యంగా ఉంటే వారి పరిపూర్ణత మరి ఎంత ఎక్కువ ఐశ్వర్యాన్ని తెస్తుందో కదా!
13యూదేతరులైన మీతో నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే యూదేతరులకు అపొస్తలునిగా నేను ఉన్నాను కాబట్టి నా పరచర్యలో నేను గర్వపడుతూ, 14ఏదో ఒక విధంగా నా సొంత ప్రజలకు అసూయను కలిగించి వారిలో కొందరినైనా రక్షించాలనేది నా కోరిక. 15తిరస్కారం లోకానికి సమాధానం తెస్తే, వారి అంగీకారం వల్ల ఏం జరుగుతుంది. మరణం నుండి జీవం వస్తుందా? 16ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైతే ఆ ముద్ద అంతా పరిశుద్ధమే; అలాగే చెట్టు వేరు పరిశుద్ధమైతే ఆ చెట్టు కొమ్మలు కూడా పరిశుద్ధమే.
17అయితే ఒలీవచెట్టు కొమ్మల్లో కొన్ని విరిచివేయబడి, అడవి ఒలీవచెట్టు కొమ్మలాంటి నీవు మిగిలిన కొమ్మల మధ్యలో అంటుకట్టబడి, ఆ ఒలీవచెట్టు వేరు నుండి వచ్చే సారంలో పాలుపొందినప్పుడు, 18మిగిలిన కొమ్మల కన్నా నీవు గొప్పవానిగా భావించవద్దు. నీవు అలా భావిస్తే, నీవు వేరుకు ఆధారం కాదు గాని వేరే నీకు ఆధారంగా ఉందని తెలుసుకో. 19“నేను అంటుకట్టబడాలని ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి” అని నీవు చెప్పవచ్చు. 20నిజమే. వారు అవిశ్వాసాన్ని బట్టి విరిచివేయబడ్డారు, విశ్వాసం వల్ల నీవు నిలిచి ఉన్నావు. కాబట్టి అహంకారంగా ఉండక భయంతో ఉండు. 21దేవుడు సహజమైన కొమ్మలనే విడిచిపెట్టనప్పుడు ఆయన నిన్ను కూడా విడిచిపెట్టరు కదా.
22దేవుడు చూపించే దయను, కఠినత్వాన్ని తెలుసుకోండి: పడిపోయిన వారి పట్ల ఆయన కఠినంగా ఉన్నారు కాని, నీ పట్ల దయ చూపించి నీవు ఆయన దయలో కొనసాగేలా చేశారు. లేకపోతే నీవు కూడా నరికివేయబడతావు. 23వారు అవిశ్వాసంలో కొనసాగకపోతే దేవుడు వారిని తిరిగి అంటుకట్టగల సమర్ధుడు కాబట్టి వారు మరలా అంటుకట్టబడతారు. 24సహజంగా అడవి ఒలీవచెట్టు నుండి కోయబడిన కొమ్మవైన నీవే స్వభావానికి విరుద్ధంగా మంచి ఒలీవచెట్టుకు అంటుకట్టబడితే, సహజమైన కొమ్మలు మరింత సులభంగా వాటి సొంత ఒలీవచెట్టుకు అంటుకట్టబడతాయి గదా!
ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షించబడతారు
25సహోదరీ సహోదరులారా, మీరు అహంకారులుగా ఉండకూడదని మీకు ఈ మర్మం తెలియాలని నేను కోరుకుంటున్నాను. అది ఏంటంటే యూదేతరులంతా లోపలికి ప్రవేశించే వరకు ఇశ్రాయేలు ప్రజలు కొంతవరకు కఠినం చేయబడ్డారు. 26అదేరీతిగా ఇశ్రాయేలు ప్రజలందరు రక్షించబడతారు. దీనిని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది,
“సీయోనులో నుండి విమోచకుడు వస్తాడు,
యాకోబులో నుండి భక్తిహీనతను అతడు తీసివేస్తాడు.
27నేను వారి పాపాలను వారి నుండి తీసివేసినప్పుడు
నేను వారితో చేసే నా నిబంధన ఇదే.”#11:27 యెషయా 59:20,21; 27:9; యిర్మీయా 31:33,34
28సువార్తకు సంబంధించినంత వరకు మిమ్మల్ని బట్టి వారు శత్రువులుగా ఉన్నారు, కాని ఎన్నికకు సంబంధించినంత వరకు వారు పితరులను బట్టి ప్రేమించబడినవారు. 29అయితే దేవుని కృపావరం ఆయన పిలుపు ఎన్నటికి మారనివి. 30గతంలో దేవునికి అవిధేయులుగా ఉండి, ఇప్పుడు వారి అవిధేయత ఫలితంగా దేవుని కృపను పొందారు. 31అదే విధంగా మీకు చూపిన దేవుని కృపను బట్టి వారు కృపను పొందుకొనే క్రమంలో వారు నేడు అవిధేయులుగా ఉన్నారు. 32దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు.
దేవుని కీర్తించుట
33ఆహా, దేవుని బుద్ధి జ్ఞానాల సమృద్ధి ఎంతో లోతైనది!
ఆయన తీర్పులు ఎంతో నిగూఢమైనవి,
ఆయన మార్గాలు మన ఊహకు అందనివి!
34“ప్రభువు మనస్సును తెలుసుకున్న వారెవరు?
ఆయనకు ఆలోచన చెప్పగలవారెవరు?”#11:34 యెషయా 40:13
35“ముందుగానే దేవునికి ఇచ్చి
ఆయన నుండి తిరిగి పొందగలవారు ఎవరు?”#11:35 యోబు 41:11
36ఆయన నుండి ఆయన ద్వారా ఆయన కోసమే సమస్తం ఉన్నాయి
కాబట్టి ఆయనకే మహిమ నిరంతరం కలుగును గాక ఆమేన్.