13
అధికారుల అధికారానికి లోబడుట
1దేవుడు యిచ్చిన అధికారం తప్ప మరి ఏ అధికారం లేదు కనుక ప్రతి ఒక్కరు తమ పైఅధికారులకు లోబడి ఉండాలి. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుని ద్వారా స్థాపించబడ్డాయి. 2తత్ఫలితంగా ఎవరైతే అధికారాన్ని ఎదిరిస్తారో వారు దేవుడు నియమించిన దానిని ఎదిరిస్తున్నారు, అలా చేసేవారు తమ మీదకు తామే తీర్పు తెచ్చుకుంటారు. 3పరిపాలకులు న్యాయమైనది చేసేవారికి భయం కలిగించరు కాని తప్పు చేసే వారికే భయాన్ని కలిగిస్తారు. అధికారంలో ఉన్నవారికి భయపడకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? అయితే న్యాయమైనది మీకు ఆజ్ఞాపించింది చేయండి. 4మీ మంచి కొరకు అధికారంలో ఉన్నవారు దేవుని సేవకులు. మీరు తప్పు చేస్తే భయపడండి, ఎందుకంటే పరిపాలకులు కారణం లేకుండా ఖడ్గాన్ని పట్టుకోరు. వారు తప్పు చేసేవారిపై కోపాన్ని చూపించి శిక్ష విధించే దేవుని సేవకులు. 5కాబట్టి, శిక్ష విధించబడుతుందని కాక మనస్సాక్షిని బట్టి మనం అధికారులకు లోబడి ఉండడం అవసరం.
6అధికారులు పాలన కొరకు తమ సమయాన్ని పూర్తిగా వెచ్చించే దేవుని సేవకులు, కనుకనే మనం వారికి పన్నులు చెల్లిస్తాము. 7మీరు ఎవరికి ఏమి రుణపడివున్నారో వాటిని వారందరికి చెల్లించండి: మీరు పన్నులు చెల్లించాల్సి వుంటే పన్నులు చెల్లించండి; ఆదాయపన్నైతే, ఆదాయపన్ను; మర్యాదైతే, మర్యాద; గౌరవమైతే, గౌరవం.
ప్రేమ ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తుంది
8ఇతరులను ప్రేమించేవారు ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తారు కనుక ఒకరిని ఒకరు ప్రేమించే విషయంలో మాత్రమే రుణపడి ఉండాలి తప్ప, మరి దేనిలో ఎవరికి అప్పు ఉండవద్దు. 9“మీరు వ్యభిచారం చేయకూడదు, మీరు నరహత్య చేయకూడదు, మీరు దొంగతనం చేయకూడదు, మీరు ఆశించకూడదు”#13:9 నిర్గమ 20:13-15,17; ద్వితీ 5:17-19,21 అనే ఆజ్ఞలు ఇతర ఆజ్ఞలు ఉన్నప్పటికి అవన్ని “మిమ్మల్ని మీరు ప్రేమించుకొన్నట్లే మీ పొరుగువారిని ప్రేమించాలి”#13:9 లేవీ 19:18 అనే ఒక్క ఆజ్ఞలో ఇమిడి ఉన్నాయి. 10ప్రేమ పొరుగు వారికి హాని కలిగించదు. కాబట్టి ప్రేమ చూపించడం అంటే ధర్మశాస్త్రాన్ని నేరవేర్చడమే.
ప్రభువు దినం సమీపంగా ఉంది
11ప్రస్తుత సమయాన్ని గ్రహించు: మీరు నిద్రమత్తు నుండి మేల్కోవలసిన సమయం వచ్చేసింది, ఎందుకంటే మనం మొదట్లో విశ్వసించినప్పటి కంటే ఇప్పుడు రక్షణ మరింత సమీపంగా ఉంది. 12రాత్రి చాలా వరకు గడిచిపోయింది; పగలు దాదాపు వచ్చేసింది. కనుక మనం చీకటి క్రియలు విడిచిపెడదాం, వెలుగు కవచాన్ని ధరించుకుందాం. 13అతి త్రాగుడు మత్తు, లైంగిక అనైతికత వ్యభిచారం, కలహాలు, ఓర్వలేనితనం మొదలైన వాటిని విడిచి, పగటివేళలో వలె మనం మర్యాదగా ప్రవర్తిద్దాం. 14అయితే, మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోండి, శరీరవాంఛలను ఎలా తృప్తిపరచాలని ఆలోచించకండి.