YouVersion Logo
Search Icon

రోమా 2

2
న్యాయమైన దేవుని తీర్పు
1మీరు వేరొకరికి తీర్పు చెప్తారు, కాబట్టి, మీకు తీర్పు తప్పించుకునే అవకాశం లేదు, మీరు ఏ విషయంలో మరొకరికి తీర్పు ఇచ్చినా, మిమ్మల్ని మీరే ఖండించుకుంటున్నారు, ఎందుకంటే తీర్పు ఇస్తున్న మీరు అవే పనులు చేస్తున్నారు. 2అలాంటి కార్యాలు చేసేవారి పట్ల సత్యాన్ని అనుసరించి దేవుని తీర్పు ఉంటుందని మనకు తెలుసు. 3కాబట్టి మీరు, కేవలం మానవులై యుండి, వారిపై తీర్పు ఇస్తూ, మీరూ వాటినే చేస్తూఉంటే, దేవుని తీర్పును మీరు తప్పించుకోగలరని అనుకుంటున్నారా? 4దేవుని దయ మిమ్మల్ని పశ్చాత్తాపం వైపు నడిపించడానికి ఉద్దేశించినదని గ్రహించకుండా, కనికరం, ఓర్పు, దయాసంపన్నత పట్ల అలక్ష్యాన్ని చూపిస్తున్నారా?
5అయితే మీ మొండితనం, పశ్చాత్తాపంలేని హృదయాన్ని బట్టి దేవుని న్యాయమైన తీర్పు వెల్లడిచేయబడే దేవుని ఉగ్రత దినాన దేవుని ఉగ్రతను నీకు నీవే కూర్చుకుంటున్నావు. 6దేవుడు “ప్రతి ఒక్కరికి వారు చేసిన కార్యాలను బట్టి ప్రతిఫలమిస్తారు.”#2:6 కీర్తన 62:12; సామె 24:12 7ఎవరైతే పట్టువదలకుండా మంచిని చేస్తూ మహిమను, ఘనతను, నిత్యత్వాన్ని వెదకుతారో వారికి ఆయన నిత్యజీవాన్ని ఇస్తారు. 8కానీ స్వలాభాన్ని చూసుకొంటూ సత్యాన్ని తిరస్కరించి చెడ్డపనులను చేసేవారి మీదికి దేవుని కోపం, ఉగ్రత వస్తుంది. 9చెడ్డపనులు చేసే ప్రతి ఒక్కరికి, మొదట యూదులకు తరువాత యూదేతరులకు శ్రమ, వేదన కలుగుతుంది. 10అయితే మంచి పనులు చేసే ప్రతి ఒక్కరికి అనగా మొదట యూదులకు తరువాత యూదేతరులకు మహిమ, ఘనత, సమాధానములు కలుగుతాయి. 11ఎందుకంటే దేవుడు పక్షపాతం చూపించరు.
12ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వారందరు ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు, ధర్మశాస్త్రం క్రింద ఉండి పాపం చేసేవారు ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పుపొందుతారు. 13ఎందుకంటే, ధర్మశాస్త్రాన్ని కేవలం వినేవారు దేవుని దృష్టిలో నీతిమంతులు కారు గాని లోబడేవారే నీతిమంతులుగా ప్రకటించబడతారు. 14ధర్మశాస్త్రం లేని యూదేతరులు స్వతహాగా ధర్మశాస్త్రానికి సంబంధించిన పనులు చేస్తే, వారు ధర్మశాస్త్రం లేనివారైనప్పటికీ, తమకు తామే ధర్మశాస్త్రంగా ఉన్నారు. 15ధర్మశాస్త్రానికి కావలసినవి తమ హృదయాల మీద రాసి ఉన్నట్లుగా వారు చూపిస్తారు, అలాంటివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిస్తుంది, వారి ఆలోచనలు కొన్ని సమయాల్లో వారిని నిందిస్తాయి మరికొన్ని సమయాల్లో వారిని కాపాడతాయి. 16నా సువార్తలో చెప్పిన ప్రకారం, దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యాలను తీర్పుతీర్చే దినాన ఇలా జరుగుతుంది.
యూదులు మరియు ధర్మశాస్త్రం
17ఒకవేళ మిమ్మల్ని మీరు యూదులుగా పిలుచుకుంటూ, మీరు ధర్మశాస్త్రం మీద ఆధారపడుతూ దేవునిలో అతిశయిస్తున్నట్లయితే; 18మీరు ఆయన చిత్తాన్ని తెలుసుకొని, ఉన్నతమైనదాన్ని ఆమోదిస్తే, మీరు ధర్మశాస్త్రం యొక్క ఉపదేశం వల్లనే. 19మీరు గ్రుడ్డివారికి మార్గదర్శి అని, చీకటిలో ఉన్నవారికి వెలుగు అని మీకు నమ్మకం ఉంటే, 20మీరు మూర్ఖులకు బోధకులు, చిన్నపిల్లలకు గురువులు, ఎందుకంటే మీకు ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం యొక్క స్వరూపం ఉంది, 21కనుక ఇతరులకు బోధించే మీరు, మీకు మీరు బోధించుకోరా? దొంగతనం చేయవద్దని ప్రకటిస్తున్న మీరే దొంగతనం చేస్తారా? 22వ్యభిచరించవద్దు అని ప్రజలకు చెప్పే మీరే, వ్యభిచరిస్తారా? విగ్రహాలను అసహ్యించుకునే మీరే గుళ్లను దోచుకుంటారా? 23ధర్మశాస్త్రాన్ని బట్టి అతిశయించే మీరే ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తూ దేవుణ్ణి అవమానిస్తారా? 24లేఖనాల్లో వ్రాయబడి ఉన్నట్టు: “నిన్ను బట్టే దేవుని నామం యూదేతరుల మధ్య దూషించబడుతుంది.”#2:24 యెషయా 52:5; యెహె 36:20,22
25మీరు ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే సున్నతికి విలువ ఉంటుంది, మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, మీరు సున్నతి చేయబడని వారుగా అయ్యారు. 26అలా అని, సున్నతి పొందనివారు ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, వారు సున్నతి చేయబడినవారిగా ఎంచబడరా? 27శారీరకంగా సున్నతి చేయబడకపోయినా, ధర్మశాస్త్రంలో చెప్పబడిన ప్రకారం జీవిస్తున్నవారు, మీరు ధర్మశాస్త్రాన్ని సున్నతిని కలిగియున్నప్పటికీ ధర్మశాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్న మీకు తీర్పు తీరుస్తారు.
28పైకి మాత్రమే యూదులైనవారు నిజంగా యూదులు కారు; భౌతికంగా బాహ్యంగా పొందిన సున్నతి సున్నతి కాదు. 29అయితే అంతరంగంలో కూడా యూదునిగా ఉన్నవారే యూదులు. ఆత్మ వలన హృదయం పొందే సున్నతియే సున్నతి అవుతుంది కాని వ్రాయబడిన నియమాల ప్రకారం పొందింది కాదు. అలాంటి వారికి ఘనత మనుష్యుల నుండి కాదు గాని దేవుని నుండే కలుగుతుంది.

Currently Selected:

రోమా 2: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in