YouVersion Logo
Search Icon

రోమా 7

7
ధర్మశాస్త్రం నుండి విడుదల, క్రీస్తుతో బంధం
1సహోదరి సహోదరులారా, ధర్మశాస్త్రాన్ని ఎరిగినవారితో నేను మాట్లాతున్నాను, ఒక మనిషి జీవించి ఉన్నంత వరకు మాత్రమే ధర్మశాస్త్రానికి అతనిపై అధికారం ఉంటుందని మీకు తెలుసా? 2ఉదాహరణకు, ఒక వ్యక్తిని వివాహం చేసుకున్న స్త్రీ ఆ వ్యక్తి బ్రతికి ఉన్నంత వరకు అతనితో బంధం కలిగివుంటుంది, ఆమె భర్త చనిపోతే అతనితో ఆమెకు బంధాన్ని ఏర్పరచిన ధర్మం నుండి ఆమె విడుదల పొందుతుంది. 3అయితే ఆమె తన భర్త బ్రతికి ఉండగానే మరొక వ్యక్తితో శారీరక సంబంధాన్ని కలిగివుంటే ఆమె వ్యభిచారిగా పిలువబడుతుంది. ఒకవేళ ఆమె భర్త చనిపోతే ఆ ధర్మం నుండి ఆమె విడుదల పొందుకున్నది కనుక ఆమె మరొక వ్యక్తిని వివాహం చేసుకుంటే ఆమె వ్యభిచారి అని పిలువబడదు.
4కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలించునట్లు, మరణం నుండి సజీవంగా తిరిగి లేచిన క్రీస్తుకు సంబంధించిన వారిగా అవడానికి మీరు కూడా క్రీస్తు శరీరం ద్వారా ధర్మశాస్త్ర విషయమై మరణించారు. 5మనం శరీరం యొక్క రాజ్యంలో#7:5 శరీరంను సూచించు గ్రీకు పదము మానవుల పాపస్ధితిని తెలియచేస్తుంది ఉన్నప్పుడు ధర్మశాస్త్రం చేత రేపబడిన పాపపూరితమైన ఆలోచనలు మనలో పని చేస్తున్నాయి కనుక మనం మరణాన్ని ఫలంగా పొందుకుంటున్నాము. 6కాని ఇప్పుడు, ఒకప్పుడు మనలను బంధించి ఉంచిన దాని విషయమై చనిపోవుట ద్వారా మనం ధర్మశాస్త్రం నుండి విడుదలను పొందాము కనుక, వ్రాయబడివున్న నియమం ప్రకారం కాకుండా ఆత్మ యొక్క నూతన మార్గంలో మనం సేవిస్తాము.
ధర్మశాస్త్రం పాపం
7అయితే, మనం ధర్మశాస్త్రాన్ని పాపం అని అనాలా? ఖచ్చితంగా కాదు! ఒకవేళ ధర్మశాస్త్రం లేకపోతే పాపం అంటే ఏమిటో నాకు తెలిసేది కాదు. “మీరు ఆశించకూడదు”#7:7 నిర్గమ 20:17; ద్వితీ 5:21 అని ధర్మశాస్త్రం చెప్పకపోతే ఆశించడం అంటే ఏమిటో నిజంగా నాకు తెలిసేది కాదు. 8అయితే పాపం, ఆజ్ఞ వలన ఇవ్వబడిన అవకాశాన్ని ఉపయోగించుకొని, నాలో అన్ని రకాల పాపాన్ని పుట్టించింది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం మరణిస్తుంది. 9ఒకప్పుడు ధర్మశాస్త్రం లేకపోయిన నేను సజీవంగానే ఉన్నాను, అయితే ఆజ్ఞలు ఇవ్వబడినప్పుడు పాపం జీవంలోనికి వచ్చింది, నేను మరణించాను. 10జీవాన్ని ఇవ్వడానికి ఉద్దేశించబడిన ఆ ఆజ్ఞలే మరణాన్ని తీసుకువచ్చాయని నేను తెలుసుకున్నాను. 11అయితే పాపం, ఆజ్ఞ వలన కలిగిన అవకాశాన్ని ఉపయోగించుకొని నన్ను మోసగించి ఆ ఆజ్ఞల ద్వారానే నన్ను మరణానికి గురిచేసింది. 12కనుక ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి కలిగినవి, మంచివి.
13అయితే నాకు మరణాన్ని తీసుకువచ్చింది మంచిదా? ఎన్నడు కాదు! అయితే, పాపం మంచిని ఉపయోగించి నాకు మరణాన్ని తెచ్చింది. పాపాన్ని పాపంగా చూపించే క్రమంలో ఆజ్ఞల ద్వారా పాపం మరింత పాపపూరితమైనది.
14ధర్మశాస్త్రం ఆత్మకు సంబంధించిందని మనకు తెలుసు, కాని నేను ఆత్మహీనుడను కనుక పాపానికి దాసునిగా అమ్ముడుపోయాను. 15నేను చేయవలసిన దానిని నేను గ్రహించలేదు. నేను చేయదలచిన దానిని నేను చేయలేదు కాని నేను దేనినైతే ద్వేషిస్తానో దానినే చేశాను. 16నేను ఏదైతే చేయకూడదని అనుకున్నానో దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. 17ఇదంతా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే. 18నాకున్న పాప స్వభావాన్ని#7:18 స్వభావాన్ని నా శరీరాన్ని బట్టి మంచిది ఏదీ నాలో నివసించదని నాకు తెలుసు కనుక, నేను మంచిని జరిగించాలనే కోరిక నాకు ఉన్నప్పటికీ దానిని నేను నెరవేర్చలేకపోతున్నాను. 19నేను చేయాలనుకున్న మంచిని చేయడం లేదు కాని, నేను దేనినైతే చేయకూడదు అని అనుకుంటున్నానో ఆ చెడునే చేస్తున్నాను. 20అయితే ఇప్పుడు నేను చేయకూడదని అనుకుంటున్న దానిని నేను చేస్తే, అలా చేస్తున్నది నేను కాదు నాలో నివసిస్తున్న పాపమే.
21కనుక ఈ నియమాన్ని నేను గమనించాను, నేను మంచిని చేయాలని అనుకుంటున్నప్పటికి నాలో చెడు ఉన్నది. 22నా అంతరంగంలో దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, 23కాని మరొక నియమం నాలో ఉన్నట్లు నాకు కనబడుతుంది, అది నా మనస్సులోని నియమంతో పోరాడుతున్నది, నాలో పని చేస్తున్న పాపనియమానికి అది నన్ను బంధీగా చేస్తుంది. 24నేను ఎంత దౌర్భాగ్యుడిని! మరణానికి బంధీగా ఉన్న నా శరీరం నుండి నన్ను ఎవరు రక్షించగలరు? 25మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా నాకు విడుదలను ఇచ్చే దేవునికి వందనాలు!
అయితే నా మనస్సులో నేను దేవుని ధర్మశాస్త్రానికి దాసుడను, కాని నాకున్న పాప స్వభావంలో#7:25 స్వభావంలో నా శరీరంలో నేను పాపనియమానికి దాసుడను.

Currently Selected:

రోమా 7: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in