9
ఇశ్రాయేలీయుల కొరకు పౌలు ఆవేదన
1నేను క్రీస్తులో సత్యమే చెప్తున్నాను అబద్ధం చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా నా మనస్సాక్షి దానిని నిర్ధారిస్తుంది. 2నా హృదయంలో ఎంతో దుఃఖం తీరని ఆవేదన ఉన్నాయి. 3నా సొంత జాతి వారైన, ఇశ్రాయేలీయుల కొరకు క్రీస్తు నుండి విడిపోయి శపించబడిన వానిగా ఉండాలని కోరుకుంటాను. 4వారు ఇశ్రాయేలు ప్రజలు, వారు దత్తపుత్రులుగా చేయబడినవారు; దైవికమైన మహిమ, నిబంధనలు, పొందిన ధర్మశాస్త్రం, దేవాలయంలో ఆరాధన, వాగ్దానాలు వారివే. 5పితరులు వారి వారే, అందరికి దేవుడైన క్రీస్తు మానవ వంశావళి వారిలో నుండే గుర్తించబడింది. నిత్యం స్తుతింపబడునుగాక! ఆమేన్.
దేవుని సార్వభౌమ ఎంపిక
6దేవుని మాట విఫలమైనదని కాదు. ఇశ్రాయేలు నుండి వచ్చిన సంతతి వారందరు ఇశ్రాయేలీయులు కారు. 7అబ్రాహాము సంతతి అయినంత మాత్రాన వారు అబ్రాహాముకు పిల్లలు అవ్వరు. అయితే “ఇస్సాకు ద్వారా కలిగినవారే నీకు సంతానంగా లెక్కించబడతారు.”#9:7 ఆది 21:12 8మరో మాటలో చెప్పాలంటే, శరీర సంబంధమైన పిల్లలు దేవుని బిడ్డలు కారు, కాని వాగ్దాన సంబంధమైన పిల్లలు అబ్రాహాము సంతానంగా పరిగణించబడతారు. 9అందువల్లనే, “నియమించబడిన సమయానికి నేను తిరిగి వస్తాను అప్పటికి శారాకు ఒక కుమారుడు ఉంటాడు”#9:9 ఆది 18:10,14 అని వాగ్దానం ఇవ్వబడింది.
10అది మాత్రమే కాకుండా, మన తండ్రియైన ఇస్సాకు వలన రిబ్కా గర్భాన్ని ధరించిన సమయంలో, 11కవల పిల్లలు జన్మించి మంచియైన చెడైనా ఏదీ చేయక ముందే, ఏర్పాటు చేయబడిన ప్రకారం దేవుని ఉద్దేశం క్రియలమూలంగా కాకుండా, 12పిలుచువాని మూలంగా స్థిరంగా నిలబడడానికి “పెద్దవాడు చిన్నవానికి సేవ చేస్తాడు”#9:12 ఆది 25:23 అని ఆమెతో చెప్పబడింది. 13“నేను యాకోబును ప్రేమించాను, ఏశావును ద్వేషించాను”#9:13 మలాకీ 1:2,3 అని వ్రాయబడివున్నది.
14అయితే దీనిని బట్టి మనము ఏమి చెప్పగలం? దేవుడు అన్యాయం చేస్తాడనా? ఎన్నటికి కాదు! 15ఎందుకంటే ఆయన మోషేతో,
“ఎవరి పట్ల నాకు కనికరం కలదో వారి పట్ల నేను కనికరం చూపుతాను,
ఎవరి పట్ల నాకు దయ కలదో వారి పట్ల నేను దయ చూపుతాను”#9:15 నిర్గమ 33:19
అని చెప్పారు. 16కనుక ఇది మానవుల కోరిక లేదా వారి ప్రయాసపై ఆధారపడి ఉండదు కాని, దేవుని కనికరంపై ఆధారపడి ఉంటుంది. 17అయితే లేఖనం ఫరోతో ఇలా చెప్తుంది: “నేను నా బలాన్ని నీలో కనబరచడానికి, నా నామం భూలోకమంతా బలంగా ప్రకటించబడాలనే ఉద్దేశంతో నేను నిన్ను లేవనెత్తాను.”#9:17 నిర్గమ 9:16 18కనుక దేవుడు ఎవరిపై తాను కనికరాన్ని చూపదలిచాడో వారిపైన కనికరాన్ని చూపుతాడు, ఎవరి పట్ల కఠినంగా ఉండాలనుకున్నాడో వారి పట్ల కఠినంగా ఉంటాడు.
19మీలో ఒకరు నాతో: “అప్పుడు ఇంకా ఎందుకు దేవుడు మనల్ని నిందిస్తాడు? ఆయన చిత్తాన్ని అడ్డుకోగలవాడెవడు?” అనవచ్చు, 20కాని ఓ మానవుడా, దేవుని తిరిగి ప్రశ్నించడానికి నీవు ఎవరు? “నీవు నన్ను ఇలా ఎందుకు చేసావు? అని రూపించబడింది తనను రూపించినవానితో అంటుందా?”#9:20 యెషయా 29:16; 45:9 21ఒకే మట్టి ముద్ద నుండి కొన్ని ప్రత్యేకమైన పాత్రలను, కొన్ని సాధారణమైన పాత్రలను చేయడానికి కుమ్మరివానికి హక్కు లేదా?
22దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తమ శక్తిని తెలియజేయడానికి ఏర్పరచుకొన్నప్పటికి, నాశనం కొరకు సిద్ధపరచబడిన ఆయన ఉగ్రతకు పాత్రలైన వారిని ఆయన గొప్ప సహనంతో భరిస్తే ఏంటి? 23మహిమ కొరకు ముందుగానే ఆయనచే సిద్ధపరచబడి ఆయన కృపకు పాత్రులైన వారికి, 24అనగా యూదుల నుండి మాత్రమే కాకుండా యూదేతరుల నుండి కూడా ఆయనచే పిలువబడినవారమైన మనకొరకు తన మహిమైశ్వర్యాలను తెలియపరిస్తే ఏంటి? 25హోషేయ గ్రంథంలో ఆయన చెప్పిన ప్రకారం,
“నా ప్రజలు కాని వారిని నా ప్రజలుగా పిలుస్తాను;
నా ప్రియం కాని దానిని ‘నా ప్రియమైనదానా’ అని పిలుస్తాను,”#9:25 హోషేయ 2:23
26ఇంకా,
“ ‘మీరు నా ప్రజలు కారు’ అని ఏ స్థలంలో అయితే వారితో చెప్పబడిందో,
అదే స్థలంలో వారు
‘సజీవుడైన దేవుని పిల్లలారా’ అని పిలువబడతారు.”#9:26 హోషేయ 1:10
27ఇశ్రాయేలీయుల గురించి యెషయా ఇలా మొరపెట్టాడు:
“ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుకరేణువు వలె ఉన్నప్పటికి
కేవలం వారిలో మిగిలివున్నవారు మాత్రమే రక్షించబడతారు.
28ప్రభువు తాను చెప్పిన మాటను
భూమిపై త్వరగా తప్పక నెరవేరుస్తాడు.”#9:28 యెషయా 10:22,23
29యెషయా గతంలో చెప్పినట్లుగా,
“సర్వశక్తిమంతుడైన ప్రభువు
మనకు సంతానాన్ని మిగల్చకపోయుంటే
మనము సొదొమ వలె మారేవారం,
గొమొర్రాను పోలి ఉండేవారం.”#9:29 యెషయా 1:9
ఇశ్రాయేలు ప్రజల అవిశ్వాసం
30అయితే దీనిని బట్టి మనం ఏమి చెప్పగలం? నీతిని అనుసరించని యూదేతరులు విశ్వాసాన్ని బట్టి నీతిని పొందుకున్నారు. 31కాని నీతి మార్గంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించిన ఇశ్రాయేలు ప్రజలు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 32వారెందుకు చేరుకోలేకపోయారు? వారు నీతిని విశ్వాసమూలంగా కాకుండా క్రియలమూలంగా అన్నట్లు అనుసరించారు. ఆటంకంగా అడ్డురాయి ఎదురైనప్పుడు వారు తడబడ్డారు. 33దీని కొరకు ఇలా వ్రాయబడి ఉంది:
“ఇదిగో, నేను ప్రజలు తడబడునట్లుగా
ఒక రాతిని వారు పడిపోవునట్లుగా ఒక బండను సీయోనులో ఉంచుతున్నాను,
ఆయనలో నమ్మకం ఉంచేవారు ఎన్నడూ సిగ్గుపడరు.”#9:33 యెషయా 8:14; 28:16