YouVersion Logo
Search Icon

తీతుకు 1

1
1దేవుడు ఎన్నుకొన్నవారి విశ్వాసాన్ని, నిత్యజీవం గురించిన నిరీక్షణలో ఉండే దైవభక్తిలోనికి నడిపించే, వారి సత్యజ్ఞానాన్ని బలపరచడానికి, 2దేవుని సేవకుడు యేసు క్రీస్తు అపొస్తలుడనైన పౌలు అనే నేను, మనమందరం నమ్ముతున్న ఒకే విశ్వాసాన్ని బట్టి నాకు నిజ కుమారుడైన తీతుకు వ్రాయునది, 3ఆ నిత్యజీవం గురించి అబద్ధమాడని దేవుడు సృష్టి ఆరంభానికి ముందే వాగ్దానం చేశాడు.
4విశ్వాస విషయంలో నా నిజమైన కుమారుడు, తీతుకు:
మన తండ్రియైన దేవుని నుండి, రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగును గాక.
మంచిని ప్రేమించేవారిని సంఘపెద్దలుగా నియమించుట
5నేను నిన్ను క్రేతులో విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం, ఇంకా పూర్తి చేయవలసిన వాటిని క్రమపరచి, ప్రతి పట్టణంలో సంఘ పెద్దలను నియమించు. 6ఒక సంఘపెద్ద నిందారహితునిగా, తన భార్యకు నమ్మకమైనవానిగా ఉండాలి, అతని పిల్లలు విశ్వాసం గలవారిగా ఉండి, దుష్టమైన పనులు చేశారని అవిధేయులు అనే నిందలేనివారిగా ఉండాలి. 7సంఘపెద్ద దేవుని కుటుంబాన్ని నడిపిస్తాడు కనుక, అతడు నిందారహితునిగా ఉండాలి, అయితే అహంకారిగా, త్వరగా కోపపడేవానిగా, త్రాగుబోతుగా, దౌర్జన్యం చేసేవానిగా, అక్రమ సంపాదన ఆశించేవానిగా ఉండకూడదు. 8దానికి బదులు, అతడు ఆతిథ్యాన్ని ఇచ్చేవానిగా, మంచిని ప్రేమించేవానిగా, స్వీయ నియంత్రణ కలవానిగా, నీతిమంతునిగా, పరిశుద్ధునిగా, క్రమశిక్షణ గలవాడై ఉండాలి. 9బోధించబడిన రీతిలో ఈ నమ్మకమైన వాక్యాన్ని అతడు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు అతడు తాను నేర్చుకున్న సత్య బోధతో ఇతరులను ప్రోత్సాహించి దానిని వ్యతిరేకించే వారిని ఖండించగలడు.
మంచి చేయడంలో విఫలమైన వారిని గద్దించుట
10ఎందుకంటే మీలో అనేకమంది, ముఖ్యంగా సున్నతి పొందినవారిలో కొందరు, తిరుగుబాటు స్వభావం కలిగి, అర్థంలేని మాటలు మాట్లాడేవారిగా, మోసగించేవారిగా ఉన్నారు. 11వారి నోళ్లు ఖచ్చితంగా మూయించాలి, ఎందుకంటే వారు తమ అవినీతి సంపాదన కొరకు బోధించకూడని తప్పుడు బోధలు చేస్తూ, కుటుంబాలన్నింటిని చెడగొడుతున్నారు. 12క్రేతు ప్రవక్తలలో ఒకడు తన సొంత ప్రజల గురించి చెప్తూ, “క్రేతు దేశస్థులు ఎప్పుడు అబద్ధికులుగా, క్రూరులుగా, సోమరులుగా, తిండిబోతులుగా ఉన్నారు” అన్నాడు. 13వారి గురించి అతడు చెప్పింది సత్యమే. కనుక విశ్వాసంలో స్థిరంగా ఉండేలా, 14యూదుల కట్టుకథలను లేక సత్యాన్ని తిరస్కరించిన మనుష్యుల ఆజ్ఞలను లక్ష్యపెట్టకుండా నీవు వారిని తీవ్రంగా గద్దించు. 15ఎందుకంటే, పవిత్రులకు అన్ని పవిత్రంగానే ఉంటాయి కాని, నమ్మనివారికి, చెడిపోయినవారికి ఏది పవిత్రంగా ఉండదు. నిజానికి అలాంటివారి మనస్సులు, మనస్సాక్షి కూడా చెడిపోయాయి. 16వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నా, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు.

Currently Selected:

తీతుకు 1: TCV

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in