YouVersion Logo
Search Icon

ప్రసంగి 8

8
1జ్ఞానులకు ఎవరు సాటి?
విషయాలను ఎవరు వివరించగలరు?
ఒకని జ్ఞానం వాని ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది
దాని కఠిన రూపాన్ని మారుస్తుంది.
రాజుకు లోబడాలి
2నీవు దేవుని ఎదుట ప్రమాణం చేశావు కాబట్టి రాజాజ్ఞకు లోబడమని నేను చెప్తున్నాను. 3రాజు సముఖం నుండి తొందరపడి వెళ్లి పోవద్దు. అతడు తనకు ఏది ఇష్టమైతే అది చేస్తాడు కాబట్టి చెడ్డపనులు చేయవద్దు. 4రాజు మాట మహోన్నతమైనది, “మీరు నీవు ఏం చేస్తున్నావు?” అని రాజును ఎవరు అడగగలరు?
5అతని ఆజ్ఞను పాటించే వారెవరికి ఏ హాని జరగదు,
ఏది సరియైన సమయమో న్యాయమో జ్ఞానుల హృదయానికి తెలుసు.
6ఒక వ్యక్తి కష్టం అతని మీద అధిక భారంగా ఉన్నప్పటికీ,
ప్రతి దానికి సరియైన సమయం విధానం ఉంది.
7భవిష్యత్తు గురించి ఎవరికి తెలియదు కాబట్టి,
ఏది రాబోతుందో ఒకరికి ఎవరు చెప్పగలరు?
8గాలిని అదుపుచేసే శక్తి ఎవరికీ లేదు,
కాబట్టి#8:8 లేదా దానిని నిలుపుకోవల్సింది మానవ ఆత్మ మీద కాబట్టి తమ మరణ సమయం మీద ఎవరికీ అధికారం లేదు.
ఎలాగైతే యుద్ధ సమయంలో ఎవరూ విడుదల చేయబడరో,
అలాగే దుర్మార్గం దానిని ఆచరించేవారిని విడుదల చేయదు.
9ఇవన్నీ నేను చూశాను, సూర్యుని క్రింద చేసిన ప్రతిదానికీ నేను నా మనస్సులో ఆలోచించాను. ఒకరు ఇతరులపై ఉన్న అధికారంతో తనకే హాని తెచ్చుకుంటున్నారు. 10పవిత్ర స్థలానికి తరచూ వెళ్లేవారు ఇప్పుడు ఎక్కడ నేరాలు చేశారో అదే పట్టణంలో పొగడబడతారు. అలాంటి దుర్మార్గులు సక్రమంగా పాతిపెట్టబడడం నేను చూశాను. ఇది కూడా అర్థరహితమే.
11చేసిన నేరానికి శిక్ష త్వరగా పడకపోతే ప్రజలు భయం లేకుండా చెడుపనులు చేస్తారు. 12వంద నేరాలకు పాల్పడిన దుర్మార్గుడు ఎక్కువకాలం జీవించినప్పటికీ, దేవునికి భయపడుతూ ఆయన పట్ల భక్తిగలవారి స్థితి మేలు అని నాకు తెలుసు. 13దుర్మార్గులు దేవునికి భయపడరు కాబట్టి, వారు అభివృద్ధి చెందరు, వారి రోజులు నీడలా ధీర్ఘకాలం ఉండవు.
14భూమిపై అర్థరహితమైనది మరొకటి ఉంది: దుర్మార్గులు పొందవలసిన దాన్ని నీతిమంతులు, నీతిమంతులు పొందవలసిన దాన్ని దుర్మార్గులు పొందుతున్నారు. ఇది కూడా అర్థరహితమే అని నేను చెప్తున్నాను. 15కాబట్టి జీవితాన్ని ఆనందించడాన్ని నేను అభినందిస్తున్నాను, ఎందుకంటే సూర్యుని క్రింద ఉన్నవారు తిని త్రాగి సంతోషించడం కన్నా గొప్పది లేదు. అప్పుడు దేవుడు సూర్యుని క్రింద వారికి ఇచ్చిన జీవితకాలంలో వారి కష్టంలో వారికి తోడుగా ఉండేది ఆ సంతోషమే.
16జ్ఞానాన్ని పొందడానికి, భూమిపై ప్రజలు పగలు రాత్రి నిద్రలేకుండ చేసే శ్రమను గమనించడానికి నేను నా మనస్సును నిలిపినప్పుడు 17దేవుడు చేస్తున్నదంతా నేను చూశాను. సూర్యుని క్రింద ఏమి జరుగుతుందో ఎవరూ అర్థం చేసుకోలేరు. దీన్ని వెదకడానికి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, దాని పూర్తిగా గ్రహించలేరు. జ్ఞానులు తమకు తెలుసు అని వాదించినప్పటికీ, వారు దానిని నిజంగా గ్రహించలేరని నేను తెలుసుకున్నాను.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in