YouVersion Logo
Search Icon

కీర్తనలు 107

107
అయిదవ గ్రంథము
కీర్తనలు 107–150
కీర్తన 107
1యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించండి, ఆయన మంచివారు;
ఆయన మారని ప్రేమ నిత్యం ఉంటుంది.
2యెహోవాచేత విమోచింపబడినవారు,
విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినవారు,
3వివిధ దేశాల నుండి, తూర్పు పడమర,
ఉత్తర దక్షిణాల#107:3 హెబ్రీలో దక్షిణాల సముద్రాల నుండి ఆయన సమకూర్చినవారు వారి కథను చెప్పుదురు గాక.
4కొందరు ఏకాంతంగా ఎడారిలో తిరిగారు;
నివాసయోగ్యమైన పట్టణం ఒక్కటి వారికి కనిపించలేదు.
5వారు ఆకలి దప్పికతో ఉన్నారు,
వారి ప్రాణాలు సొమ్మసిల్లాయి.
6అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు,
ఆయన వారిని వారి బాధలనుండి విడిపించారు.
7ఆయన వారిని తిన్నని బాటలో
నివాసయోగ్యమైన పట్టణానికి నడిపించారు.
8యెహోవా యొక్క మారని ప్రేమ కోసం
నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
9దాహంతో ఉన్న వారి దాహాన్ని ఆయన తీరుస్తారు,
మేలైన వాటితో ఆయన ఆకలి తీర్చుతారు.
10కొందరు కష్టాల ఇనుప గొలుసుల్లో బంధించబడి,
చీకటిలో, కటిక చీకటిలో కూర్చుని ఉన్నారు,
11వారు దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి,
మహోన్నతుని ప్రణాళికలను తృణీకరించారు.
12కాబట్టి ఆయన వారిని వెట్టిచాకిరికి అప్పగించారు;
వారు తొట్రిల్లారు సాయం చేసేవాడు ఒక్కడూ లేడు.
13అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు,
ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
14ఆయన వారిని చీకటి, కటిక చీకటిలో నుండి బయటకు తెచ్చారు,
వారి సంకెళ్ళను తుత్తునియలుగా చేశారు.
15యెహోవా యొక్క మారని ప్రేమ కోసం
నరులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం వారు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
16ఎందుకంటే ఆయన ఇత్తడి ద్వారాలను పగలగొడతారు
ఇనుప గడియలను విరగ్గొడతారు.
17కొందరు తమ తిరుగుబాటు మార్గాల ద్వారా మూర్ఖులయ్యారు
వారి దోషాల వల్ల బాధలు అనుభవించారు.
18వారు ఆహారాన్ని అసహ్యించుకున్నారు
మరణ ద్వారాల దగ్గరకు వచ్చారు.
19అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు,
ఆయన వారిని వారి బాధ నుండి రక్షించారు.
20తన వాక్కును పంపి
దేవుడు వారిని స్వస్థపరిచాడు.
21యెహోవా యొక్క మారని ప్రేమ కోసం
మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
22కృతజ్ఞతార్పణలు అర్పించాలి.
ఆనంద ధ్వనులతో దేవుని క్రియలను ప్రకటించాలి.
23ఓడలలో సముద్ర ప్రయాణం చేస్తూ మహాజలాల మీద వెళుతూ,
కొందరు వ్యాపారం చేస్తారు.
24వారంతా యెహోవా చేసిన క్రియలు చూచారు,
సముద్రంలో యెహోవా చేసిన అద్భుతాలు చూచారు.
25దైవాజ్ఞకు తుఫాను లేచింది,
అలలు రేగాయి.
26వారు ఆకాశానికి పైకి ఎక్కారు, జలాగాధంలోకి దిగిపోయారు;
వారి జీవం దురవస్థ చేత కరిగిపోయింది.
27వారు త్రాగుబోతుల్లా తూలుతూ, అటూ ఇటూ ఊగుతూ ఉన్నారు;
వారు తెలివి తప్పి ఉన్నారు.
28అప్పుడు వారు తమ ఆపదలో యెహోవాకు మొరపెట్టారు
ఆయన వారిని వారి బాధ నుండి విడిపించారు.
29అతడు తుఫానును గుసగుసలాడేలా చేశాడు,
సముద్ర తరంగాలు సద్దుమణిగాయి.
30అలలు తగ్గాయి వారెంతో సంతోషించారు.
వారు వెళ్లాలనుకున్న రేవుకు దేవుడు వారిని చేర్చాడు.
31యెహోవా యొక్క మారని ప్రేమ కోసం
మనుష్యులకు ఆయన చేసిన అద్భుత కార్యాల కోసం ఆయనకు కృతజ్ఞతలు చెల్లించును గాక,
32ప్రజా సమాజాలలో ఆయనకే మహిమ.
పెద్దల సభలలో ఆయనకే ప్రఖ్యాతి!
33-34అక్కడ ఉన్న మనుష్యుల దుష్టత్వాన్ని బట్టి,
ఆయన అక్కడి నదులను ఎడారిగా మార్చారు.
మీ ఊటలను ఎండిన నేలగా మార్చారు.
సారవంతమైన భూమిని చవి నేలగా మార్చారు.
35అలాగే ఎడారులు నీటి మడుగులయ్యాయి.
ఎండిన భూమి నీటి ఊటల స్థలమైంది.
36ఆయన ఆకలిగొనిన వారిని అక్కడ నివసించడానికి తీసుకువచ్చారు,
వారు అక్కడ నివాసయోగ్యమైన పట్టణాన్ని ఏర్పరచుకున్నారు.
37వారు పొలాల్లో విత్తారు ద్రాక్షతోటలు నాటారు.
ఫలసాయం బాగా దొరికింది.
38దేవుడు వారిని ఆశీర్వదించాడు.
వారు అధికంగా అభివృద్ధి చెందారు.
పశుసంపద ఏమాత్రం తగ్గలేదు.
39వారి మీదికి ఎంతో ఒత్తిడి వచ్చింది. తెగుళ్ళు, బాధ, శోకము.
వారంతా కృశించి పోయారు. సంఖ్యకూడా క్షీణించింది.
40సంస్థానాధిపతులపై ధిక్కారం క్రుమ్మరించేవాడు
వారిని గుర్తించలేని వ్యర్థంలో వారు తిరిగేలా చేశారు.
41కానీ ఆయన అవసరతలో ఉన్నవారిని వారి కష్టాల నుండి పైకి లేవనెత్తారు
గొర్రెల మందల్లా వృద్ధి వారి కుటుంబాలు వృద్ధిచేశారు.
42యథార్థవంతులకు ఇదంతా చూస్తే ఆనందము.
దుష్టులంతా నోరు మూసుకోవాలి.
43జ్ఞానులు ఈ విషయాలను ఆలోచిస్తారు,
యెహోవా ప్రేమా క్రియలను తలపోస్తారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in