YouVersion Logo
Search Icon

కీర్తనలు 145

145
కీర్తన 145#145 ఈ కీర్తన ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి.
దావీదు వ్రాసిన స్తుతికీర్తన.
1నా దేవా, నా రాజా! మిమ్మల్ని ఘనపరుస్తాను.
మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.
2ప్రతిరోజు మిమ్మల్ని స్తుతిస్తాను
మీ నామాన్ని ఎప్పటికీ స్తుతిస్తాను.
3యెహోవా గొప్పవారు ఆయన స్తుతికి ఎంతో అర్హుడు;
ఆయన గొప్పతనం ఎవరూ గ్రహించలేరు.
4ఒక తరం వారు మరో తరానికి మీ క్రియలను కొనియాడుతూ చెపుతారు;
మీ బలమైన చర్యలను గురించి చెపుతారు.
5వారు ఘనమైన మీ మహిమ వైభవం గురించి మాట్లాడతారు,
నేను మీ అద్భుత కార్యాలను ధ్యానిస్తాను.
6వారు మీ అద్భుత కార్యాల శక్తి గురించి చెపుతారు,
నేను మీ గొప్ప కార్యాలను ప్రకటిస్తాను.
7వారు మీ సమృద్ధి మంచితనాన్ని స్తుతిస్తారు,
మీ నీతి గురించి సంతోషంగా పాడతారు.
8యెహోవా కృప కలవారు, దయ గలవారు,
త్వరగా కోప్పడరు, అపారమైన ప్రేమ గలవారు.
9యెహోవా అందరికి మంచివారు;
ఆయన చేసిన సృష్టి అంతటి మీద దయ గలవాడు.
10యెహోవా మీ సృష్టంతా మిమ్మల్ని స్తుతిస్తుంది;
నమ్మకమైన మీ ప్రజలు మిమ్మల్ని ఘనపరుస్తారు.
11మీ రాజ్య మహిమ గురించి వారు చెపుతారు
మీ బలము గురించి మాట్లాడతారు,
12అప్పుడు మనుష్యులందరు మీ గొప్ప చర్యలను
మీ రాజ్యము యొక్క మహిమా వైభవాన్ని తెలుసుకుంటారు.
13మీ రాజ్యం శాశ్వత రాజ్యం,
మీ ఆధిపత్యం తరతరాలకు నిలుస్తుంది.
యెహోవా చేసే వాగ్దానాలన్నిటిలో ఆయన నమ్మదగినవాడు
ఆయన చేసేవాటన్నిటిలో ఆయన నమ్మదగినవాడు.#145:13 చాలా ప్రా.ప్ర. లలో చివరి రెండు వాక్యాలు లేవు
14యెహోవా పడిపోతున్న వారికి సహాయం చేస్తారు,
అలిసిపోయిన వారిని లేవనెత్తుతారు.
15అందరి కళ్లు మీ వైపు చూస్తాయి,
సరియైన వేళలో మీరు వారికి ఆహారం ఇస్తారు.
16మీరు మీ గుప్పిలి విప్పి
జీవులన్నిటి కోరికలు తీరుస్తారు.
17యెహోవా తన మార్గాలన్నిటిలో నీతిమంతుడు.
ఆయన క్రియలన్నిటిలో నమ్మకమైనవాడు.
18ఆయనకు మొరపెట్టు వారందరికి,
నిజాయితీగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉంటారు.
19ఆయనయందు భయము గలవారి కోరికలు తీరుస్తారు;
వారి మొర విని వారిని రక్షిస్తారు.
20యెహోవా తనను ప్రేమించే వారందరిని కాపాడతారు,
కాని దుష్టులను ఆయన నాశనం చేస్తారు.
21నా నోరు యెహోవా స్తుతి పలుకుతుంది.
శరీరులంతా ఆయన పవిత్ర నామాన్ని
శాశ్వతంగా కీర్తించాలి.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in