YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 1

1
1అపొస్తలునిగా ఉండడానికి పిలువబడి దేవుని సువార్త కోసం ప్రత్యేకపరచబడిన పౌలు అనే నేను క్రీస్తు యేసు దాసుడను. 2ఈ సువార్త ఏమంటే దేవుడు తన కుమారుని గురించి పరిశుద్ధ లేఖనాల్లో ప్రవక్తల ద్వారా ముందుగానే వాగ్దానం చేశారు. 3ఆయన కుమారుని విషయానికి వస్తే, శరీరానుసారంగా ఆయన దావీదు సంతానానికి చెందినవారు. 4ఆయన పునరుత్థానం ద్వారా పరిశుద్ధమైన ఆత్మను బట్టి మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుని కుమారునిగా అధికారంతో#1:4 లేదా దేవుని కుమారుడని బలముతో ప్రకటించబడెను నిరూపించబడ్డారు. 5సమస్త ప్రజలందరిని ఆయన నామం కోసం విశ్వాసం నుండి వచ్చే విధేయతలోకి పిలువడానికి ఆయన ద్వారా మేము కృపను అపొస్తలత్వాన్ని పొందాము. 6యేసు క్రీస్తుకు చెందినవారిగా ఉండడానికి పిలువబడిన ఆ ప్రజలతో పాటు మీరు కూడా ఉన్నారు.
7రోమాలో ఉన్న దేవునిచే ప్రేమించబడుతున్న వారికి ఆయన పరిశుద్ధ ప్రజలుగా ఉండడానికి పిలువబడిన వారందరికి పౌలు వ్రాయునది:
మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక.
రోమాను దర్శించాలని పౌలు కోరిక
8మీ విశ్వాసం గురించి లోకమంతా చాటించబడుతూ ఉంది అందరి కోసం యేసు క్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. 9నేను నిరంతరం నా ప్రార్థనలలో మిమ్మల్ని గుర్తు చేసుకుంటాను అనడానికి, తన కుమారుని గురించిన సువార్తను ప్రకటిస్తూ నా ఆత్మలో నేను సేవిస్తున్న ఆ దేవుడే సాక్షి. 10దేవుని చిత్తమైతే నేను మీ దగ్గరకు రావడానికి కనీసం ఇప్పటికైనా నాకు అవకాశం రావాలని ప్రార్థిస్తున్నాను.
11మిమ్మల్ని బలపరచడానికి, ఆధ్యాత్మిక వరం ఏదైనా మీకు అందించడానికి మిమ్మల్ని చూడాలని నేను ఆరాటపడుతున్నాను. 12తద్వారా, మీరు నేను పరస్పరం ఒకరి విశ్వాసం ద్వారా ఒకరం ప్రోత్సాహించబడతాము. 13సహోదరీ సహోదరులారా, యూదేతరుల మధ్యలో నేను ఫలం పొందినట్లు మీ మధ్యలో కూడా ఫలం పొందాలని మీ దగ్గరకు రావడానికి చాలాసార్లు ప్రయత్నించాను గాని ఇప్పటివరకు నాకు ఆటంకాలు వస్తూనే ఉన్నాయి. ఇది మీకు తెలియకుండా ఉండడం నాకిష్టం లేదు.
14గ్రీసు దేశస్థులు, గ్రీసు దేశస్థులు కాని వారు, జ్ఞానులు అజ్ఞానుల పట్ల నేను బాధ్యత కలిగి ఉన్నాను. 15అందువల్ల, రోమాలో ఉన్న మీకు కూడా సువార్తను ప్రకటించాలని నేను చాలా ఆసక్తితో ఉన్నాను.
16సువార్త గురించి నేను సిగ్గుపడను. ఎందుకంటే నమ్మిన ప్రతివారికి అనగా మొదట యూదులకు తర్వాత యూదేతరులకు రక్షణ కలుగజేయడానికి సువార్త దేవుని శక్తి. 17“నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు”#1:17 హబ 2:4 అని వ్రాయబడి ఉన్న ప్రకారం, విశ్వాసమూలంగా మరింత విశ్వాసం కలిగేలా సువార్తలో దేవుని నీతి వెల్లడి చేయబడింది.
పాపులైన మానవులపై దేవుని ఉగ్రత
18ప్రజలు తమ దుష్టత్వం చేత సత్యాన్ని అణచివేస్తున్నారు, కాబట్టి వారిలో ఉన్న భక్తిహీనత, దుష్టత్వమంతటి మీదకు దేవుని ఉగ్రత పరలోకం నుండి వెల్లడి చేయబడుతుంది. 19దేవుడే వారికి తెలియజేశారు కాబట్టి దేవుని గురించి తెలుసుకోవలసిన సంగతులు వారికి స్పష్టంగా ఉన్నాయి. 20లోకం సృష్టింపబడినప్పటి నుండి, చేయబడిన ప్రతీదాని ద్వారా దేవుని అదృశ్యలక్షణాలైన శాశ్వతమైన శక్తి దైవిక స్వభావం స్పష్టంగా కనిపించాయి. కాబట్టి దేవున్ని తెలుసుకోలేకపోడానికి ప్రజలకు ఏ సాకు లేదు.
21వారు దేవున్ని ఎరిగినప్పటికీ, ఆయనను దేవునిగా మహిమపరచలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించలేదు, కాని వారి ఆలోచనలు వ్యర్థమయ్యాయి వారి మూర్ఖపు హృదయాలు చీకటిమయం అయ్యాయి. 22వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు. 23వారు నిత్యుడైన దేవుని మహిమను నాశనమయ్యే మనుష్యులు, పక్షులు, జంతువులు, ప్రాకే ప్రాణుల రూపాలలో తయారుచేసిన విగ్రహాలకు ఆపాదించారు.
24కాబట్టి వారి హృదయాల్లో ఉన్న పాపపు కోరికలను బట్టి వారు ఒకరితో ఒకరు తమ శరీరాలను అవమానపరచుకోడానికి దేవుడు వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించారు. 25వారు దేవుని సత్యాన్ని అబద్ధంగా మార్చి, సృష్టికర్తకు బదులుగా ఆయన సృష్టించిన వాటిని పూజించి సేవించారు. అయితే ఆయన ఎల్లప్పుడు స్తోత్రార్హుడు. ఆమేన్.
26అందువల్ల, దేవుడు వారిని అవమానకరమైన వ్యామోహాలకు అప్పగించారు. వారి స్త్రీలు కూడా సహజమైన లైంగిక సంబంధాలకు బదులు అసహజమైన లైంగిక సంబంధాలను ఏర్పరచుకున్నారు. 27అలాగే పురుషులు కూడా స్త్రీతో ఉండాల్సిన సహజ సంబంధాన్ని వదిలేసి, కామాగ్నితో రగిలిపోతూ పురుషులతో పురుషులు సంబంధాలు పెట్టుకున్నారు. పురుషులు పురుషులతో కలిసి అవమానకరమైన పనులు చేసే తమ తప్పులకు తగిన శిక్షను పొందారు.
28అంతేగాక, వారు దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం విలువైనదిగా భావించలేదు, కాబట్టి వారు చేయరాని పనులు చేసేటట్లు దేవుడు వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించారు. 29వారు ప్రతి విధమైన దుర్మార్గంతో, చెడుతనంతో, దురాశలతో, దుర్నీతితో నిండి ఉన్నారు. వారు అసూయ కలిగినవారిగా హత్యలు చేసేవారిగా, కొట్లాటలను మోసాన్ని ఓర్వలేనితనాన్ని కలిగి ఉన్నారు. వారు వదరుబోతులు, 30నిందలు వేసేవారు, దైవ ద్వేషులు, గర్విష్ఠులు, దురహంకారులు, గొప్పలు చెప్పుకునేవారు; వారు చెడు చేయడానికి మార్గాలను కనిపెడతారు; వారు తమ తల్లిదండ్రులకు అవిధేయులు; 31వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు. 32ఇలాంటి పనులు చేసినవారు మరణానికి పాత్రులవుతారు అనే దేవుని నీతిశాసనం గురించి తెలిసి కూడా వారు అవే పనులు చేయడమే కాక వాటిని చేస్తున్నవారిని కూడా అంగీకరించారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in