YouVersion Logo
Search Icon

రోమా పత్రిక 4

4
అబ్రాహాము విశ్వాసం ద్వారా నీతిమంతునిగా తీర్చబడ్డాడు
1అయితే శరీరరీతిగా మన పూర్వికుడైన అబ్రాహాము ఈ విషయంలో ఏమి తెలుసుకున్నాడని మనం అనవచ్చు? 2ఒకవేళ, నిజంగానే, అబ్రాహాము క్రియలమూలంగా నీతిమంతునిగా ఎంచబడి ఉంటే అతడు అతిశయించడానికి కారణం ఉండేది కాని దేవుని ఎదుట కాదు. 3లేఖనాలు ఏమి చెప్తున్నాయి? “అబ్రాహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది”#4:3 ఆది 15:6 22 వచనములో అనే కదా!
4పని చేసేవారికి ఇచ్చే జీతం ఒక బాధ్యతే కాని ఉచితంగా ఇచ్చే బహుమానం కాదు. 5అయితే, ఒకరు పని చేయకుండా, భక్తిహీనున్ని కూడా నీతిమంతునిగా తీర్చగల దేవునిపై నమ్మకముంచితే వారి విశ్వాసం నీతిగా ఎంచబడుతుంది. 6క్రియలు లేకుండానే ఎవరిని దేవుడు నీతిమంతులుగా ఎంచుతారో వారు దీవించబడినవారని దావీదు కూడా చెప్తున్నాడు.
7“తమ అతిక్రమాలు క్షమించబడినవారు,
తమ పాపాలు పరిహరించబడినవారు ధన్యులు.
8ప్రభువుచేత పాపం లేనివారిగా
పరిగణించబడినవారు ధన్యులు.”#4:8 కీర్తన 32:1,2
9ఈ ఆశీర్వాదం కేవలం సున్నతి పొందినవారికి మాత్రమేనా లేదా సున్నతి పొందని వారికి కూడా వర్తిస్తుందా? అబ్రాహాము విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడిందని మనం చెప్తున్నాం కదా. 10ఏ పరిస్థితుల్లో అది అతనికి నీతిగా యెంచబడింది? అతడు సున్నతి పొందిన తర్వాత లేదా సున్నతి పొందక ముందా? సున్నతి పొందక ముందే కదా! 11అతడు ఇంకా సున్నతి పొందక ముందే, తనకు ఉన్న విశ్వాసం ద్వారా నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. కాబట్టి సున్నతి పొందకపోయిన విశ్వసించిన వారందరికి అది నీతిగా ఎంచబడేలా అబ్రాహాము వారందరికి తండ్రి అయ్యాడు. 12అంతేకాక సున్నతి పొందినవారిలో ఎవరైతే మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందక ముందు నడిచిన విశ్వాసపు అడుగుజాడలను అనుసరించి జీవిస్తున్నారో వారికి కూడా అబ్రాహాము తండ్రి అయ్యాడు.
13అతడు ఈ లోకానికి వారసుడు అవుతాడనే వాగ్దానాన్ని అబ్రాహాము అతని సంతానం ధర్మశాస్త్రం మూలంగా పొందలేదు కాని, విశ్వాసమూలంగా వచ్చిన నీతి ద్వారా మాత్రమే పొందుకున్నారు. 14ఒకవేళ ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారసులైతే, విశ్వాసానికి అర్థం ఉండదు, వాగ్దానానికి ఎటువంటి విలువ ఉండదు. 15ఎందుకంటే ధర్మశాస్త్రం ఉగ్రతను తెస్తుంది. ఎక్కడైతే ధర్మశాస్త్రం లేనిచోట దానిని అతిక్రమించడం కూడా ఉండదు.
16కాబట్టి, వాగ్దానం విశ్వాసమూలంగానే వస్తుంది. ఆ వాగ్దానం అబ్రాహాము సంతానమంతటికి అనగా, కేవలం ధర్మశాస్త్రాన్ని కలిగి ఉన్నవారికి మాత్రమే కాకుండా అబ్రాహాము ఏ విశ్వాసాన్నైతే కలిగి ఉన్నాడో అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నవారందరికి కృప ద్వారా వర్తిస్తుంది. అతడు మనందరికి తండ్రి. 17“నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేశాను”#4:17 ఆది 17:5 అని వ్రాయబడి ఉన్నది. అబ్రాహాము విశ్వాసముంచిన దేవుడు చనిపోయినవారికి జీవమిచ్చేవారు, లేనివాటిని ఉన్నవాటిగా పిలిచేవారు. అలాంటి దేవుని దృష్టిలో అతడు మనకు తండ్రి.
18“నీ సంతానం అలా ఉంటుంది”#4:18 ఆది 15:5 అని అతనితో చెప్పినప్పుడు అబ్రాహాము నిరీక్షణలేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి నమ్మాడు, అందుకే అతడు అనేక జనాలకు తండ్రి అయ్యాడు. 19తనకు వంద సంవత్సరాల వయస్సు కాబట్టి తన శరీరం మృతతుల్యంగా ఉందని శారా గర్భం కూడా మృతతుల్యంగా ఉందనే వాస్తవం తెలిసినప్పటికీ అతడు తన విశ్వాసంలో బలహీనపడనే లేదు. 20అతడు దేవుడు చేసిన వాగ్దానంపట్ల అపనమ్మకంతో ఎన్నడు సందేహించలేదు కాని, అతడు తన విశ్వాసంలో బలపడి దేవునికి మహిమ చెల్లించాడు. 21దేవుడు తాను వాగ్దానం చేసిన దానిని నెరవేర్చగల శక్తిగలవాడని అతడు గట్టిగా నమ్మాడు. 22అందుకే “అది అతనికి నీతిగా ఎంచబడింది.” 23“అది అతనికి నీతిగా ఎంచబడింది” అని వ్రాయబడిన మాటలు కేవలం అతని ఒక్కడి కోసం మాత్రమే కాదు, 24మరణం నుండి సజీవంగా తిరిగి లేచిన మన ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచి దేవునిచే నీతిమంతులుగా తీర్చబడిన మన కోసం కూడా ఆ వాక్యం వ్రాయబడింది. 25యేసు క్రీస్తు మన పాపాల కోసం మరణానికి అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడడానికి మరణం నుండి సజీవంగా తిరిగి లేచారు.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in