14
బాప్తిస్మమిచ్చు యోహాను తల వధించబడుట
1ఆ సమయంలో చతుర్ధాధిపతిగా ఉన్న హేరోదు యేసును గురించి విని, 2తన సేవకులతో, “ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను, చనిపోయినవారిలో నుండి సజీవంగా లేచాడు అందుకే ఇతనిలో అద్బుతాలు చేసే శక్తి పని చేస్తుంది” అని అన్నాడు.
3అంతకు ముందు హేరోదు తన సొంత సోదరుడు ఫిలిప్పు భార్యయైన హేరోదియను ఉంచుకోడం న్యాయం కాదని యోహాను అతనితో చెప్పడంతో, 4హేరోదు రాజు ఆమె కొరకు అతన్ని బంధించి చెరసాలలో వేయించాడు. 5హేరోదు యోహానును చంపాలని చూశాడు కాని, ప్రజలు అతన్ని ప్రవక్తగా భావిస్తున్నారని ప్రజలకు భయపడి చంపలేక పోయాడు.
6అయితే హేరోదు పుట్టిన రోజున, హేరోదియ కుమార్తె అతిథుల మధ్య నాట్యంచేసి హేరోదును సంతోషపరిచింది. 7కనుక ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టుపెట్టుకొని ప్రమాణం చేశాడు. 8ఆమె తన తల్లి ప్రేరేపణతో, “బాప్తిస్మమిచ్చు యోహాను తలను పళ్లెంలో పెట్టి నాకు ఇప్పించు” అని అడిగింది. 9రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులు మరియు తాను చేసిన ప్రమాణం కొరకు, ఆమె కోరిక ప్రకారం చేయమని ఆదేశించాడు. 10అలా తన దాసుని పంపి చెరసాలలో యోహాను తలను నరికించాడు. 11వారు బాప్తిస్మమిచ్చు యోహాను తలను పళ్లెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చారు, ఆమె దానిని తన తల్లి దగ్గరకు తీసికొని వెళ్లింది. 12యోహాను శిష్యులు వచ్చి అతని శవాన్ని తీసుకువెళ్లి సమాధి చేసి, యేసు దగ్గరకు వచ్చి ఈ సంగతిని తెలియజేసారు.
యేసు ఐదు వేలమందికి ఆహారం పెట్టుట
13యేసు జరిగిన సంగతిని విని పడవ ఎక్కి, అక్కడి నుండి ఏకాంత స్థలానికి వెళ్లారు. దీని గురించి విని, పట్టణాల నుండి కాలినడకన జనసమూహాలు ఆయనను వెంబడించారు. 14యేసు పడవ దిగి వచ్చిన ఆ గొప్ప జనసమూహాన్ని చూసినప్పుడు, వారి మీద కనికరపడి వారిలో ఉన్న రోగులను స్వస్థపరిచారు.
15సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, “ఇది మారుమూల ప్రాంతం, పైగా ఆలస్యం కూడా అవుతుంది. కనుక జనసమూహాలను పంపివేయండి, వారే చుట్టు ప్రక్కన ఉన్న గ్రామాలకు వెళ్లి, భోజనాన్ని కొనుక్కుంటారు” అన్నారు.
16యేసు వారితో, “వారు ఎక్కడికి వెళ్లే అవసరం లేదు, మీరే వారికి భోజనం పెట్టండి” అని అన్నారు.
17వారు యేసుతో, “ఇక్కడ మా దగ్గర ఐదు రొట్టెలు, రెండు చేపలు తప్ప ఇంకేమి లేవు” అని జవాబిచ్చారు.
18ఆయన, “వాటిని నా దగ్గరకు తీసుకురండి” అని చెప్పారు. 19తర్వాత వారిని గడ్డి మీద కూర్చోమని చెప్పి, ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను చేతిలో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞతలు చెల్లించి ఆ రొట్టెలను విరిచి తన శిష్యులకు ఇచ్చారు, శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టారు. 20వారందరు తిని తృప్తి పొందారు, తర్వాత శిష్యులు మిగిలిన ముక్కలను పన్నెండు గంపల నిండా నింపారు. 21తిన్న వారి సంఖ్య ఆడవారు పిల్లలు కాక, ఇంచుమించు ఐదు వేలమంది పురుషులు.
యేసు నీటి మీద నడచుట
22వెంటనే యేసు జనసమూహాన్ని పంపివేస్తూ శిష్యులు తనకంటే ముందుగా అవతలి తీరానికి వెళ్లేలా వారిని పడవ ఎక్కించారు. 23ఆయన వారిని పంపివేసిన తర్వాత ప్రార్థన చేసుకోవడానికి కొండపైకి వెళ్లారు. ఆ రాత్రి సమయాన ఆయన ఒంటరిగా ఉన్నాడు. 24అప్పటికే ఆ పడవ ఒడ్డు నుండి దూరంగా ఉంది, ఎదురుగాలి వీస్తూ అలలు వచ్చి ఆ పడవను కొడుతున్నాయి.
25సూర్యోదయానికి కొంచెం ముందు యేసు సరస్సు మీద నడుస్తూ వారి దగ్గరకు వచ్చారు. 26ఆయన నీళ్ళ మీద నడవటం చూసిన శిష్యులు భయపడి, “భూతం” అని చెప్పుకొంటూ భయంతో కేకలు వేశారు.
27వెంటనే యేసు వారిని చూసి, “ధైర్యం తెచ్చుకోండి! నేనే, భయపడకండి” అని తన శిష్యులతో చెప్పారు.
28పేతురు అది చూసి, “ప్రభువా, నీవే అయితే నేను నీళ్ళ మీద నడిచి నీ దగ్గరకు రావడానికి నన్ను పిలువు” అని ఆయనతో అన్నాడు.
29అందుకు యేసు, “రా!” అన్నారు.
పేతురు పడవ దిగి, నీళ్ళ మీద యేసువైపు నడిచాడు. 30కాని అతడు గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించి, “ప్రభువా, నన్ను కాపాడు!” అని కేకలు వేసాడు.
31వెంటనే యేసు తన చెయ్యి చాపి పేతురును పట్టుకొని, “అల్ప విశ్వాసి, నీవు ఎందుకు అనుమానించావు?” అన్నారు.
32వారు పడవలోనికి ఎక్కిన తర్వాత గాలి అణిగిపోయింది. 33అప్పుడు పడవలో ఉన్నవారు వచ్చి, “నీవు నిజంగా దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.
34వారు అవతలకు వెళ్లి గెన్నేసరెతు అనే ప్రాంతంలో దిగారు. 35అక్కడి ప్రజలందరు యేసును గుర్తుపట్టి, చుట్టుప్రక్కల ఉన్న ప్రాంతమంతా సమాచారం పంపించారు, కనుక ప్రజలు రోగులను ఆయన దగ్గరకు తీసుకువచ్చారు. 36నీ వస్త్రపు అంచునైనా వారిని ముట్టనివ్వండని వారు యేసును బ్రతిమిలాడారు. ముట్టిన వారందరు స్వస్థత పొందుకొన్నారు.