ఆదికాండము 6

6
ప్రజలు చెడ్డవాళ్లగుట
1భూమిమీద మనుష్యుల సంఖ్య పెరుగుతూ పోయింది. వీరికి ఆడపిల్లలు పుట్టారు. 2-4ఈ ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నట్లు దేవుని కుమారులు చూశారు. కనుక దేవుని కుమారులు వారికి నచ్చిన ఆడపిల్లల్ని వాళ్లు పెళ్లి చేసుకొన్నారు.
ఆ స్త్రీలు పిల్లల్ని కన్నారు, ఆ కాలంలోను, ఆ తర్వాత కాలంలోను నెఫీలులనువారు#6:2-4 నెఫీలులు అనగా “బలాత్కారులు.” “పడిపోయిన ప్రజలు” అని అర్థమిచ్చు హెబ్రీ పదములాంటిది. ఆ దేశంలో నివసించారు. వారు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రజలు, ప్రాచీన కాలంనుండి వారు మహా వీరులు.
అప్పుడు యెహోవా అన్నాడు, “మనుష్యులు మానవ మాత్రులు, వారి మూలంగా నా ఆత్మను ఎల్లప్పుడు కలవరపడనియ్యను. 120 సంవత్సరాలు వారిని బ్రతకనిస్తాను.”
5భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్లు యెహోవా చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్లు యెహోవా చూశాడు. 6ఈ భూమిమీద మనుష్యులను చేసినందుకు యెహోవా విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది. 7కనుక యెహోవా ఇలా అన్నాడు: “భూమిమీద నేను చేసిన మనుష్యులందరినీ నేను నాశనం చేసేస్తాను. ప్రతి మనుష్యుని, ప్రతి జంతువును, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని నేను నాశనం చేస్తాను. ఆకాశ పక్షుల్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుచేతనంటే, వీటన్నింటినీ నేను చేసినందుకు విచారిస్తున్నాను గనుక.”
8అయితే భూమిమీద యెహోవాను సంతోషపెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు.
నోవహు — జలప్రళయం
9ఇది నోవహు కుటుంబ కథ. నోవహు తన తరం వారిలోనే నీతిమంతుడు. అతడు ఎల్లప్పుడు దేవునిని అనుసరించాడు. 10నోవహుకు షేము, హాము, యాఫెతు అని ముగ్గురు కుమారులు.
11-12దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్లు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు.
13కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మనుష్యులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపేశారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం చేస్తాను. ఈ భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను. 14చితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, ఓడలో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి.
15“నీవు చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి. 300 అ. పొడవు, 50 అ. వెడల్పు, 30 అ. ఎత్తు. 16కప్పుకు సుమారు 18 అంగుళాల క్రింద ఓడకు ఒక కిటికీ చేయి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టు. ఓడలో మూడు అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింది అంతస్తు.
17“నేను నీతో చెబుతోంది గ్రహించు. ఈ భూమి మీదికి ఒక మహాగొప్ప జలప్రళయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల ప్రాణులను నేను నాశనం చేస్తాను. భూమిమీద ఉండే ప్రతీ ప్రాణి చస్తుంది. భూమిమీద ఉన్న అన్నీ చస్తాయి. 18అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు అందరు ఓడలో ఎక్కాలి. 19భూమిమీద జీవిస్తోన్న ప్రాణులన్నింటిలో రెండేసి చొప్పున నీవు సంపాదించాలి. ఆడ, మగ చొప్పున వాటిని ఓడలోనికి తీసుకొని రావాలి. వాటిని నీతో కూడా సజీవంగా ఉండనివ్వు. 20భూమిమీద ఉన్న ప్రతీ జాతి పక్షుల్లోనుంచి రెండేసి తీసుకురా. భూమిమీద ఉన్న అన్ని రకాల జంతువుల్లోనుంచి రెండేసి తీసుకురా. నేలమీద ప్రాకు ప్రతి ప్రాణులలో రెండేసి చొప్పున తీసుకురా, భూమిమీద ఉండే అన్ని రకాల జంతువులు మగది, ఆడది నీతో ఉండాలి. ఓడలో వాటిని సజీవంగా ఉంచు. 21అలాగే భూమి మీద ఉండే ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకొనిరా. అది నీకు, జంతువులకు భోజనం అవుతుంది.”
22వీటన్నింటినీ నోవహు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవహు వాటన్నిటినీ చేశాడు.

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió