యోహాను సువార్త 19

19
యేసుకు మరణశిక్ష విధించుట
1ఆ తర్వాత పిలాతు యేసుని కొరడాలతో కొట్టించాడు. 2సైనికులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తలమీద పెట్టారు. ఆయనకు ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించి, 3ఆయన దగ్గరకు మాటిమాటికి వెళ్లి ఆయనతో, “యూదుల రాజా నీకు శుభం!” అని ఎగతాళి చేస్తూ, ఆయన ముఖం మీద అరచేతులతో కొట్టారు.
4పిలాతు మరొకసారి బయటకు వచ్చి యూదులతో, “చూడండి, ఇతనిలో నాకు ఏ నేరం కనిపించలేదని చెప్పడానికి ఈయనను బయటకు మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాను” అని చెప్పాడు. 5యేసు బయటకు వచ్చినప్పుడు ఆ ముళ్ళ కిరీటాన్ని ఊదా రంగు వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారు. పిలాతు వారితో, “ఇదిగో, ఈ మనుష్యుడు!” అని చెప్పాడు.
6ముఖ్య యాజకులు వారి అధికారులు ఆయనను చూడగానే, “సిలువ వేయండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
అయితే పిలాతు, “మీరే ఆయనను తీసుకెళ్లి సిలువ వేయండి. నాకైతే ఆయనలో ఏ నేరం కనిపించలేదు” అన్నాడు.
7అందుకు యూదా నాయకులు, “మా ధర్మశాస్త్రం ప్రకారం ఎవరైనా తాను దేవుని కుమారుడనని చెప్పుకుంటే చట్టాన్ని బట్టి అతడు చావవలసిందే” అన్నారు.
8పిలాతు ఆ మాట విని మరింత భయపడి, 9తిరిగి తన భవనం లోనికి వెళ్లి, “నీవు ఎక్కడి నుండి వచ్చావు?” అని యేసును అడిగాడు. కాని యేసు అతనికి ఏ జవాబివ్వలేదు. 10అప్పుడు పిలాతు, “నీవు నాతో మాట్లాడవా? నిన్ను విడుదల చేయడానికైనా, సిలువ వేయడానికైన నాకు అధికారం ఉందని నీకు తెలియదా?” అన్నాడు.
11అందుకు యేసు, “నీకు ఆ అధికారం పైనుండి ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు అధికారం లేదు. కాబట్టి నన్ను నీకు అప్పగించినవాడు నీ కంటే మరి ఎక్కువ పాపం చేశాడు” అన్నారు.
12అప్పటినుండి పిలాతు యేసును విడుదల చేయడానికి ప్రయత్నించాడు కాని యూదా నాయకులు, “నీవు ఇతన్ని విడుదల చేస్తే నీవు కైసరుకు స్నేహితుడవు కావు. నేను రాజును అని చెప్పుకునే ప్రతివాడు కైసరుకు విరోధి” అని కేకలు వేశారు.
13పిలాతు ఈ మాటలను విని, యేసును బయటకు తీసుకువచ్చి, రాతి బాటగా ప్రసిద్ధి చెందిన స్థలంలో అతడు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి గబ్బతా అని పేరు. 14అది పస్కాను సిద్ధపరచే రోజు, అప్పుడు ఇంచుమించు ఉదయం ఆరు గంటల సమయం అవుతుంది.
పిలాతు, “ఇదిగో మీ రాజు” అని యూదులతో చెప్పాడు.
15కాని వారు, “అతన్ని తీసుకెళ్లండి! అతన్ని తీసుకెళ్లండి! సిలువ వేయండి!” అని కేకలు వేశారు.
“మీ రాజును నేను సిలువ వేయనా?” అని పిలాతు అడిగాడు.
అప్పుడు ముఖ్య యాజకులు, “మాకు కైసరు తప్ప వేరే రాజు లేడు” అన్నారు.
16చివరికి పిలాతు సిలువ వేయడానికి యేసును వారికి అప్పగించాడు.
యేసు సిలువ వేయబడుట
కాబట్టి సైనికులు యేసును తీసుకెళ్లారు. 17యేసు తన సిలువను తానే మోసుకొని కపాల స్థలం అనే చోటికి తీసుకెళ్లారు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి “గొల్గొతా” అని పేరు. 18అక్కడ ఆయనతో పాటు మరో ఇద్దరిని, ఆయనకు ఇరువైపుల ఉంచి వారి మధ్యలో యేసును సిలువ వేశారు.
19పిలాతు సిలువకు వ్రాతపూర్వక ఉత్తర్వును తగిలించాడు. అది ఇలా ఉంది:
నజరేతువాడైన యేసు, యూదుల రాజు.
20యేసును సిలువ వేసిన స్థలం పట్టణానికి దగ్గరగా ఉంది. ఆ ప్రకటనను హెబ్రీ, లాటిను గ్రీకు భాషల్లో వ్రాయించారు కాబట్టి యూదుల్లో చాలామంది దానిని చదివారు. 21ముఖ్య యాజకులైన యూదులు దానిని వ్యతిరేకించి పిలాతును, “యూదుల రాజు అని వ్రాయవద్దు కాని యూదులకు రాజునని చెప్పుకునేవాడు” అని వ్రాయమని అడిగారు.
22అందుకు పిలాతు, “నేను వ్రాసిందేదో వ్రాసేసాను” అని జవాబిచ్చాడు.
23సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత, వారు ఆయన వస్త్రాలను తీసుకుని, ఒక్కొక్కరికి ఒక భాగం వచ్చేలా నాలుగు భాగాలుగా చేశారు కాని ఆయనపై అంగీ ఏ కుట్టు లేకుండా పైనుండి క్రింది వరకు ఒకే వస్త్రంగా నేయబడింది.
24కాబట్టి వారు, “దీనిని చింపవద్దు, చీట్లు వేసి ఎవరి పేరట చీటి వస్తుందో వారు తీసుకుందాం” అని చెప్పుకొన్నారు.
లేఖనంలో వ్రాయబడినట్లు,
“వారు నా వస్త్రాలు పంచుకుని
నా అంగీ కోసం చీట్లు వేస్తారు”#19:24 కీర్తన 22:18
అనేది నెరవేరేలా ఇది జరిగింది. అందుకే సైనికులు అలా చేశారు.
25యేసు తల్లి, ఆయన తల్లి సహోదరి, క్లోపా భార్య మరియ, మగ్దలేనే మరియ సిలువ దగ్గర నిలబడి ఉన్నారు. 26యేసు అతని తల్లి తాను ప్రేమించిన శిష్యుడు అక్కడ నిలబడి ఉండడం చూసి, ఆయన తన తల్లితో, “అమ్మా, ఇదిగో నీ కుమారుడు” అని, 27తర్వాత తన ఆ శిష్యునితో, “ఇదిగో నీ తల్లి” అని చెప్పారు. అప్పటినుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు.
యేసు మరణించుట
28ఆ తర్వాత, యేసు అంతా ముగిసినదని గ్రహించి లేఖనాలు నెరవేరేలా, “దాహంగా ఉంది” అన్నారు. 29అక్కడే ఉన్న ఒక పులిసిన ద్రాక్షరసం పాత్రలో వారు ఒక స్పంజీని చిరకలో ముంచి, హిస్సోపు చెట్టు కొమ్మకు చుట్టి, యేసు పెదవులకు దానిని అందించారు. 30ఆయన పులిసిన ద్రాక్షరసం పుచ్చుకుని, “సమాప్తమైనది” అని చెప్పి యేసు తన తలను వంచి తన ప్రాణం విడిచారు.
31అది సిద్ధపాటు రోజు, మరుసటి దినం ప్రత్యేకమైన సబ్బాతు దినము. సబ్బాతు దినాన సిలువపై వారి దేహాలు ఉండకూడదని యూదా నాయకులు భావించి సిలువవేయబడిన వారి కాళ్లను విరగ్గొట్టి, వారి దేహాలను క్రిందికి దింపివేయాలని వారు పిలాతును అడిగారు. 32కాబట్టి సైనికులు వచ్చి యేసుతో పాటు సిలువ వేసిన మొదటివాడి కాళ్లను తర్వాత రెండవవాడి కాళ్లను విరుగగొట్టారు. 33కాని వారు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే చనిపోయారని గ్రహించి ఆయన కాళ్లను విరుగగొట్టలేదు. 34కాని సైనికుల్లో ఒకడు బల్లెంతో యేసుని ప్రక్కలో పొడిచాడు. వెంటనే రక్తం నీరు కారాయి. 35అది చూసినవాడు సాక్ష్యం ఇచ్చాడు, అతని సాక్ష్యం నిజము. అతడు నిజం చెప్తున్నాడని అతనికి తెలుసు. మీరు కూడా నమ్మడానికి అతడు సాక్ష్యమిస్తున్నాడు. 36లేఖనాల్లో వ్రాయబడినట్లు, “ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరువబడలేదు”#19:36 నిర్గమ 12:46; సంఖ్యా 9:12; కీర్తన 34:20 అని నెరవేరేలా ఇది జరిగింది. 37ఇతర లేఖనాల్లో, “వారు తాము పొడిచిన వానివైపు చూస్తారు”#19:37 జెకర్యా 12:10 అని వ్రాయబడి ఉంది.
యేసును సమాధి చేయుట
38ఆ తర్వాత యూదా నాయకులు భయపడి రహస్యంగా యేసుకు శిష్యుడిగా ఉన్న అరిమతయికు చెందిన యోసేపు యేసు దేహాన్ని తాను తీసుకెళ్తానని పిలాతును వేడుకున్నాడు. పిలాతు అనుమతితో అతడు వచ్చి యేసు దేహాన్ని తీసుకెళ్లాడు. 39అతనితో పాటు, గతంలో ఒక రాత్రివేళ యేసుతో మాట్లాడిన నీకొదేము కూడా ఉన్నాడు. నీకొదేము ఇంచుమించు ముప్పైనాలుగు కిలోగ్రాముల#19:39 ముప్పైనాలుగు కిలోగ్రాముల పాత ప్రతులలో సుమారు నూట యాభై సేర్లు బోళం అగరుల మిశ్రమాన్ని, శవం కుళ్ళిపోకుండా ఉంచే సుగంధ ద్రవ్యాలను తనతో తీసుకువచ్చాడు. 40వారిద్దరు యేసు దేహాన్ని తీసుకెళ్లి, యూదుల ఆచారం ప్రకారం దానికి సుగంధ ద్రవ్యాలను పూసి, నారబట్టతో చుట్టారు. 41యేసును సిలువ వేసినచోట ఒక తోట ఉన్నది. ఆ తోటలో ఎవరిని పెట్టని ఒక క్రొత్త సమాధి ఉంది. 42యూదుల ఆచారం ప్రకారం సిద్ధపాటు దినం మొదలుకాక ముందే సమాధి చేయాలని, దగ్గరలో ఉన్న ఆ క్రొత్త సమాధిలో యేసు దేహాన్ని పెట్టారు.

Subratllat

Comparteix

Copia

None

Vols que els teus subratllats es desin a tots els teus dispositius? Registra't o inicia sessió