8
1అయితే యేసు ఒలీవల కొండకు వెళ్లారు. 2ఉదయం పెందలకడనే యేసు మళ్ళీ దేవాలయ ఆవరణంలో కనబడినప్పుడు, అక్కడ ప్రజలందరు ఆయన చుట్టు చేరారు, ఆయన వారికి బోధించడానికి కూర్చున్నారు. 3అప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకులు మరియు పరిసయ్యులు వ్యభిచారంలో పట్టుబడిన ఒక స్త్రీని తీసుకొని వచ్చారు. వారు ఆమెను గుంపు ముందు నిలబెట్టి, 4వారు యేసుతో, “బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. 5అలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలని మనకు ధర్మశాస్త్రంలో మోషే ఆదేశించాడు. ఇప్పుడు నీవేమంటావు?” అని అడిగారు. 6యేసు మీద నేరం మోపి ఆయనను చిక్కించుకోడానికి, పరీక్షిస్తూ అలా అడిగారు.
కానీ యేసు క్రిందికి వంగి తన వ్రేలితో నేలపై వ్రాస్తూ వున్నారు. 7వారు అలాగే ఆయనను ప్రశ్నిస్తూనే ఉన్నందుకు, ఆయన తన తల పైకెత్తి చూసి వారితో, “మీలో పాపం లేనివాడు, ఆమెపై మొదటి రాయి వేయండి” అని చెప్పి, 8మళ్ళీ క్రిందకు వంగి నేలపై వ్రాస్తూ వున్నారు.
9వారు ఆ మాట విని, యేసుతో పాటు అక్కడ నిలబడి ఉన్న స్త్రీ తప్ప, ఒకరి తర్వాత ఒకరిగా మొదట పెద్దవారు వెళ్లిపోయారు. 10యేసు తన తలయెత్తి ఆమెను, “అమ్మా, వారెక్కడ? ఎవరు నిన్ను శిక్షించలేదా?” అని అడిగారు.
11ఆమె “అయ్యా ఎవ్వరు లేరు” అన్నది.
అందుకు యేసు, “నేను కూడ నిన్ను శిక్షించను. నీవు వెళ్లి, ఇప్పటి నుండి పాపం చేయకుండ బ్రతుకు” అన్నారు.
యేసు సాక్ష్యము గురించి వివాదము
12యేసు ప్రజలతో మాట్లాడుతూ, “నేనే లోకానికి వెలుగు. నన్ను వెంబడించేవారు చీకటిలో నడవరు, కాని వారిలో జీవం కలిగించే వెలుగును కలిగి ఉంటారు” అని చెప్పారు.
13అందుకు పరిసయ్యులు, “నీ గురించి నీవే సాక్ష్యం చెప్పుకొంటున్నావు; కనుక నీ సాక్ష్యానికి విలువలేదు” అన్నారు.
14యేసు జవాబిస్తూ, “నా గురించి నేను సాక్ష్యం చెప్పుకొన్నా నా సాక్ష్యం విలువైనదే, ఎందుకంటే నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో నాకు తెలుసు. కానీ నేను ఎక్కడి నుండి వచ్చానో, ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలియదు. 15మీరు మానవ ప్రమాణాలను బట్టి తీర్పు తీరుస్తారు; కాని నేను ఎవరిని తీర్పు తీర్చను. 16నేను ఒంటరిగా లేను, నేను నన్ను పంపిన తండ్రితో ఉన్నాను గనుక నేను తీర్పు తీర్చినా, నా నిర్ణయాలు న్యాయమైనవే. 17ఇద్దరు సాక్ష్యుల సాక్ష్యం విలువైనదని మీ ధర్మశాస్త్రంలోనే వ్రాయబడి ఉంది. 18నేను నా గురించి సాక్ష్యమిస్తున్నాను; నా మరొక సాక్షి నన్ను పంపిన తండ్రి” అన్నారు.
19వారు ఆయనను, “నీ తండ్రి ఎక్కడ?” అని అడిగారు.
అప్పుడు యేసు, “మీకు నా గురించి కాని నా తండ్రిని గురించి కాని తెలియదు. మీరు నన్ను తెలుసుకొని ఉంటే, నా తండ్రిని తెలుసుకొని ఉండేవారు” అని చెప్పారు. 20దేవాలయ ఆవరణంలో కానుకలపెట్టె ఉండే స్థలం దగ్గరగా బోధిస్తూ ఈ మాటలను చెప్పారు. అయినా వారెవరు ఆయనను పట్టుకోలేదు, ఎందుకంటే ఆయన గడియ ఇంకా రాలేదు.
యేసు ఎవరు అనే విషయంపై వివాదము
21యేసు మరొకసారి వారితో, “నేను వెళ్లిపోతున్నాను, మీరు నా కొరకు వెదకుతారు, మరియు మీరు మీ పాపంలోనే చస్తారు. నేను వెళ్లే చోటికి మీరు రాలేరు” అన్నారు.
22అందుకు యూదులు, “తనను తానే చంపుకుంటాడా? అందుకేనా, ‘నేను వెళ్లే చోటికి, మీరు రాలేరు’ అని చెప్తున్నాడు” అని అనుకున్నారు.
23అప్పుడు ఆయన, “మీరు క్రిందుండే వారు; నేను పైనుండి వచ్చాను. మీరు ఈ లోకానికి చెందినవారు; నేను ఈ లోకానికి చెందిన వాడను కాను. 24మీరు మీ పాపంలోనే చస్తారు అని నేను చెప్పాను; నేనే ఆయనను అని మీరు నమ్మకపోతే మీరు మీ పాపాలలోనే చస్తారు” అని వారితో చెప్పారు.
25వారు, “నీవు ఎవరవు?” అని అడిగారు.
అందుకు యేసు, “మొదటి నుండి నేను మీతో ఎవరినని చెప్పుతూ వచ్చానో ఆయననే” అని సమాధానం చెప్పారు. 26ఆయన, “మిమ్మల్ని గురించి తీర్పు చెప్పడానికి నాకు చాలా సంగతులు ఉన్నాయి, కానీ నన్ను పంపినవాడు నమ్మదగినవాడు, మరియు ఆయన దగ్గర నుండి నేను విన్నవాటినే ఈ లోకానికి చెప్తున్నాను” అన్నారు.
27ఆయన తన తండ్రి గురించి చెప్తున్నారని వారు గ్రహించలేకపోయారు. 28కనుక యేసు, “మీరు మనుష్యకుమారుని పైకెత్తినప్పుడు, నేనే ఆయనను, నా అంతట నేనేమి చేయను కాని తండ్రి నాకు బోధించిన వాటినే నేను చెప్తున్నానని మీరు తెలుసుకొంటారు. 29నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు; నేనెల్లప్పుడు ఆయనను సంతోషపరచే వాటినే చేస్తున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా వదిలిపెట్టలేదు” అని చెప్పారు. 30ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగా, చాలామంది ఆయనను నమ్మారు.
యేసు వ్యతిరేకులు ఎవరి పిల్లలు అనేదానిపై వివాదం
31తనను నమ్మిన యూదులతో, యేసు, “ఒకవేళ మీరు నా బోధలో స్థిరంగా ఉంటే, మీరు నిజంగా నా శిష్యులు అవుతారు. 32అప్పుడు మీరు సత్యాన్ని తెలుసుకొంటారు, ఆ సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది” అని చెప్పారు.
33వారు ఆయనతో, “మేము అబ్రాహాము సంతతివారం, మేము ఎప్పుడు ఎవరికి దాసులుగా ఉండలేదు. అలాంటప్పుడు మిమ్మల్ని విడుదల చేస్తుంది అని ఎలా చెప్తారు?” అన్నారు.
34యేసు వారితో, “పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడే, అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను. 35కుటుంబంలో దాసునికి స్థిరమైన స్థానం ఉండదు, కానీ కుమారుడు ఎల్లప్పుడు కుటుంబ సభ్యునిగానే ఉంటాడు. 36అందుకే కుమారుడు మిమ్మల్ని విడుదల చేస్తే, మీరు నిజంగా విడుదల పొందినవారిగా ఉంటారు. 37మీరు అబ్రాహాము సంతతివారని నాకు తెలుసు. అయినా మీలో నా మాటకు చోటు లేదు, కనుక మీరు నన్ను చంపడానికి మార్గం కొరకు చూస్తున్నారు. 38నేను నా తండ్రి సన్నిధిలో చూసినవాటిని మీకు చెప్తున్నాను, మీరు మీ తండ్రి దగ్గరి నుండి విన్నవాటిని చేస్తున్నారు” అన్నారు.
39దానికి వారు, “అబ్రాహాము మా తండ్రి” అని జవాబిచ్చారు.
అందుకు యేసు, “మీరు అబ్రాహాము పిల్లలైతే, మీరు అబ్రాహాము చేసిన వాటిని చేస్తారు. 40కాని నేను దేవుని నుండి విన్న సత్యాన్ని మీకు చెప్పినందుకు మీరు నన్ను చంపే మార్గం కొరకు చూస్తున్నారు, అబ్రాహాము అలాంటివి చేయలేదు. 41మీ సొంత తండ్రి చేసిన పనులనే మీరు చేస్తున్నారు” అని వారితో అన్నారు.
అందుకు వారు “మేము అక్రమ సంతానం కాదు, మాకు ఉన్న ఏకైక తండ్రి దేవుడే” అని ఎదురు చెప్పారు.
42యేసు వారితో, “దేవుడు మీ తండ్రియైతే, మీరు నన్ను ప్రేమించేవారు. ఎందుకంటే నేను దేవుని యొద్ద నుండే ఇక్కడికి వచ్చాను. నా అంతట నేను రాలేదు; దేవుడే నన్ను పంపించారు. 43నా భాష మీకెందుకు స్పష్టంగా లేదు? ఎందుకంటే నేను చెప్తుంది మీరు వినలేకపోతున్నారు. 44మీరు మీ తండ్రియైన అపవాదికి చెందినవారు, కనుక మీరు మీ తండ్రి కోరికలను నెరవేర్చాలని కోరుతున్నారు. మొదటి నుండి వాడు హంతకుడే, వానిలో సత్యం లేదు, కనుక వాడు సత్యాన్ని పట్టుకుని ఉండడు. వాడు అబద్ధం చెప్పినప్పుడు, వాడు తన స్వభాషలో మాట్లాడతాడు, ఎందుకంటే వాడు అబద్ధికుడు మరియు అబద్ధాలకు తండ్రి. 45అయినాసరే నేను మీకు నిజం చెప్తున్నా, మీరు నన్ను నమ్మరు! 46నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను సత్యాన్ని చెప్తున్నప్పుడు, మీరెందుకు నన్ను నమ్మరు? 47దేవునికి చెందినవారు దేవుడు చెప్పే మాటలను వింటారు. మీరు దేవునికి చెందినవారు కారు కనుక మీరు ఆయన మాటలను వినరు” అని అన్నారు.
యేసు తన గురించి తెలియచెప్పుట
48అందుకు యూదులు ఆయనతో, “నీవు సమరయుడవు, దయ్యం పట్టిన వాడవని మేము చెప్పింది నిజం కాదా?” అన్నారు.
49యేసు, “నేను దయ్యం పట్టినవాడను కాను, నేను నా తండ్రిని ఘనపరుస్తున్నాను, మీరు నన్ను అవమానపరుస్తున్నారు. 50నేను నా ఘనత కొరకు వెదకడం లేదు; కానీ ఘనత కొరకు వెదికేవాడు ఉన్నాడు, ఆయనే న్యాయమూర్తి. 51నా మాటలకు లోబడేవాడు ఎన్నడు చావడని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అని వారికి చెప్పారు.
52ఈ విధంగా చెప్పగానే యూదులు, “నీవు దయ్యం పట్టిన వాడవని ఇప్పుడు మాకు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు అదే విధంగా ప్రవక్తలు కూడ చనిపోయారు, అయినా, ‘నా మాటలకు లోబడేవాడు ఎన్నడు చావడు’ అని నీవంటున్నావు. 53మా తండ్రియైన అబ్రాహాము కన్నా నీవు గొప్పవాడవా? అతడు చనిపోయాడు, ప్రవక్తలు కూడా చనిపోయారు. నిన్ను నీవు ఎవరని అనుకుంటున్నావు?” అని అడిగారు.
54అందుకు యేసు, “నన్ను నేను ఘనపరచుకొంటే, ఆ ఘనత వట్టిదే. మీ దేవుణ్ని మీరు చెప్తున్న, నా తండ్రియే, నన్ను ఘనపరచే వారు. 55మీకు ఆయన ఎవరో తెలియదు, కాని ఆయన నాకు తెలుసు. ఆయన ఎవరో నాకు తెలియదని నేను చెప్తే, నేను కూడ మీలాగే అబద్ధికునిగా ఉండేవాన్ని, కానీ ఆయన నాకు తెలుసు మరియు నేను ఆయన మాటకు లోబడతాను. 56మీ తండ్రియైన అబ్రాహాము నేనున్న రోజును చూడాలన్న ఆలోచనకే ఆనందించాడు; అతడు దానిని చూసి, సంతోషించాడు” అని చెప్పారు.
57అందుకు యూదులు, “నీకు యాభై సంవత్సరాలు కూడ లేవు, నీవు అబ్రాహామును చూశావా!” అని ఆయనను అడిగారు.
58అందుకు యేసు, “అబ్రాహాము పుట్టక ముందే నేనున్నాను! అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు. 59అప్పుడు వారు ఆయన మీద విసరడానికి రాళ్ళు తీసారు, కానీ యేసు వారికి కనబడకుండా దేవాలయం నుండి బయటకు వెళ్లిపోయారు.