13
పశ్చాత్తాపం లేదా నాశనం
1అక్కడ ఉండిన ప్రజలలో కొందరు యేసుతో, పిలాతు గలిలయుల రక్తాన్ని బలులతో కలిపిన సంగతిని చెప్పారు. 2అందుకు యేసు, “ఈ గలిలయులు అలా శ్రమను అనుభవించారు కాబట్టి మిగిలిన గలిలయుల కంటే వీరు ఘోర పాపులని మీరు అనుకుంటున్నారా? 3నేను మీతో చెప్తున్నా, కాదు అని! మీరు పశ్చాత్తాపపడితేనే తప్ప, లేకపోతే మీరు కూడా అలాగే నశిస్తారు. 4సిలోయము గోపురం కూలి దాని క్రిందపడి పద్దెనిమిది మంది చనిపోయారు, వారు యెరూషలేములో జీవిస్తున్న వారందరికంటే ఎక్కువ పాపం చేశారని అనుకుంటున్నారా? 5నేను మీతో చెప్తున్నా, కాదు! అయితే మీరు పశ్చాత్తాపపడితేనే తప్ప, లేకపోతే మీరందరు కూడా అలాగే నశిస్తారు.”
6తర్వాత ఆయన ఈ ఉపమానం చెప్పారు: “ఒక మనుష్యుడు తన ద్రాక్షతోటలో ఒక అంజూరపు చెట్టును పెంచుతున్నాడు, అతడు వెళ్లి పండ్ల కొరకు ఆ చెట్టును చూసాడు కాని ఏమి దొరకలేదు. 7కనుక అతడు తోటమాలితో, ‘ఇదిగో మూడేళ్ళ నుండి నేను ఈ అంజూరపుచెట్టు పండ్ల కొరకు వచ్చి చూస్తున్నాను గాని ఇంతవరకు ఏమి దొరకలేదు. దీనిని నరికివేయి! దీని వల్ల భూసారం ఎందుకు వృధా అవ్వాలి?’ అని అన్నాడు.
8“అయితే ఆ తోటమాలి, ‘అయ్యా, ఇంకొక సంవత్సరం దానిని ఉండనివ్వండి, నేను దాని చుట్టు త్రవ్వి, ఎరువు వేసి చూస్తాను. 9ఒకవేళ అది పండ్లు ఇస్తే సరి, లేకపోతే నరికించండి’ అన్నాడు.”
సబ్బాతు దినాన నడుము వంగి వున్న స్త్రీని యేసు స్వస్థపరచుట
10ఒక సబ్బాతు దినాన యేసు సమాజమందిరంలో బోధిస్తున్నారు, 11అక్కడ పద్దెనిమిది ఏండ్ల నుండి అపవిత్రాత్మ చేత పట్టబడి నడుము వంగిపోయి నిటారుగా నిలబడలేకపోతున్న ఒక స్త్రీ ఉండింది. 12యేసు ఆమెను చూసి, ముందుకు రమ్మని పిలిచి, “అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొందావు” అని చెప్పారు. 13తర్వాత ఆయన ఆమె మీద చేతులుంచారు, వెంటనే ఆమె నిటారుగా నిలబడి దేవుని స్తుతించింది.
14సబ్బాతు దినాన యేసు స్వస్థపరిచారని, ఆ సమాజమందిరపు అధికారి మండిపడి ప్రజలతో, “పని చేసుకోడానికి ఆరు దినాలు ఉన్నాయి. కనుక ఆ దినాల్లో వచ్చి స్వస్థత పొందండి, అంతేకాని సబ్బాతు దినాన కాదు” అని చెప్పాడు.
15అందుకు ప్రభువు అతనితో, “వేషధారులారా! మీలో ప్రతివాడు సబ్బాతు దినాన తన ఎద్దును గాని గాడిదను గాని పశువులశాల దగ్గరి నుండి వాటిని విప్పి తోలుకొనిపోయి వాటికి నీళ్ళు పెట్టరా? 16అలాంటప్పుడు అబ్రాహాము కుమార్తెయైయుండి, పద్దెనిమిది ఏండ్లు సాతాను చేత బంధించబడివున్న ఈ స్త్రీని సబ్బాతు దినాన ఎందుకు విడిపించకూడదు?” అని ప్రశ్నించారు.
17ఆయన ఈ విధంగా చెప్పినప్పుడు, ఆయనను వ్యతిరేకించిన వారందరు సిగ్గుపడ్డారు, కానీ ప్రజలందరు ఆయన చేస్తున్న మహత్కార్యాలను చూసి సంతోషించారు.
ఆవగింజ మరియు పులిసిన దాన్ని గురించిన ఉపమానాలు
18అప్పుడు యేసు వారిని, “దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దాన్ని దేనితో పోల్చాలి? అని అడిగి, 19అది ఒక ఆవగింజ లాంటిది, ఒకడు దాన్ని తీసుకెళ్ళి తన పొలంలో నాటాడు. అది పెరిగి వృక్షమయ్యింది, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకున్నాయి.”
20మరల ఆయన, “దేవుని రాజ్యాన్ని దేనితో పోల్చగలం? అని అడిగి, 21అది ఒక స్త్రీ మూడు కిలోల#13:21 మూడు కిలోల అనగా ప్రా. ప్ర.లలో మూడు కుంచముల పిండిని కలిపి ఆ పిండంతా పొంగడానికి దానిలో కలిపిన కొంచెం పులిసిన పిండి లాంటిది” అని చెప్పారు.
ఇరుకు ద్వారం
22ఆ తర్వాత యేసు పట్టణాలు, గ్రామాల గుండా బోధిస్తూ, యెరూషలేముకు వెళ్లారు. 23అప్పుడు ఒకడు ఆయనను, “ప్రభువా, కొందరు మాత్రమే రక్షింపబడతారా?” అని అడిగాడు.
ఆయన వారితో, 24“ఇరుకు ద్వారం గుండా ప్రవేశించడానికి ప్రతీ ప్రయత్నం చేయండి, ఎందుకంటే, చాలామంది ప్రవేశించే ప్రయత్నం చేస్తారు, కాని ప్రవేశించలేరు అని మీకు చెప్తున్నాను. 25ఒక్కసారి ఇంటి యజమాని లేచి తలుపును మూసివేస్తే, మీరు తలుపు బయట నిలబడి తలుపు తడుతూ, ‘అయ్యా, మా కొరకు తలుపు తెరవండి’ అని వేడుకొంటారు.
“కాని అతడు మీతో, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు’ అని జవాబిస్తాడు.
26“అప్పుడు మీరు, ‘మేము నీతో కలిసి తిన్నాము త్రాగాము, నీవు మా వీధుల్లో బోధించావు’ అని అంటారు.
27“కాని అతడు, ‘మీరు ఎవరో ఎక్కడ నుండి వచ్చారో నాకు తెలియదు. దుష్ట కార్యాలు చేసేవారలారా, నా దగ్గర నుండి వెళ్లిపొండి!’ అంటాడు.
28“మీరు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు మరియు ప్రవక్తలందరిని దేవుని రాజ్యంలో చూస్తారు, కానీ మీరు మాత్రం వెలుపటికి త్రోసివేయబడతారు, అక్కడ ఏడ్వడం, పండ్లు కొరకడం ఉంటాయి. 29ప్రజలు తూర్పు, పడమర ఉత్తరం, దక్షిణం నుండి వచ్చి, దేవుని రాజ్యంలో జరిగే విందులో తమ తమ స్థానాల్లో కూర్చుంటారు. 30వాస్తవానికి చివరివారు మొదటివారవుతారు, మొదటివారు చివరివారవుతారు.”
యేసుకు యెరూషలేమును గురించిన వేదన
31ఆ సమయంలో కొందరు పరిసయ్యులు యేసు దగ్గరకు వచ్చి, “నీవు ఈ స్థలాన్ని విడచి ఎక్కడికైన వెళ్లిపోవడం మంచిది. హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు” అని ఆయనతో చెప్పారు.
32అందుకు ఆయన, “వెళ్లి ఆ నక్కతో చెప్పండి, ‘ఇవ్వాళ రేపు నేను దయ్యాలను వెళ్లగొడుతూ ప్రజలను స్వస్థపరస్తూ ఇక్కడే ఉంటాను, మూడవ రోజున నా గమ్యాన్ని చేరుకుంటాను.’ 33ఏ పరిస్థితిలోనైనా, నేను ఇవ్వాళ రేపు మరియు ఎల్లుండి వరకు వీటిని చేస్తూ ఉండాల్సిందే, ఎందుకంటే ఏ ప్రవక్త కూడా యెరూషలేము బయట చావలేడు! అని బదులిచ్చారు.
34“యెరూషలేమా, యెరూషలేమా, నీవు ప్రవక్తలను చంపావు మరియు నీ దగ్గరకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టినదానా, ఒక కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను ఎలా చేర్చుకొంటుందో అలాగే నేను నీ పిల్లలను ఎన్నోసార్లు చేర్చుకోవాలని అనుకున్నాను కాని నీవు అంగీకరించలేదు. 35చూడు, నీ ఇల్లు నిర్జనమైనదిగా నీకే విడిచిపెట్టబడుతుంది. ‘ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!’#13:35 కీర్తన 118:26 అని మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్తున్నాను” అన్నారు.