Logo de YouVersion
Ícono Búsqueda

ఆదికాండము 9

9
1మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి–మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. 2మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి. 3ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను. 4అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు; రక్తమే దాని ప్రాణము. 5మరియు మీకు ప్రాణమైన మీ రక్తమునుగూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమునుగూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. 6నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. 7మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను.
8-10మరియు దేవుడు నోవహు అతని కుమారులతో –ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతాన ముతోను మీతోకూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి మీతోకూడ సమస్తమైన భూజంతువులేమి ఓడలోనుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోను నా నిబంధన స్థిరపరచుచున్నాను. 11నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును; సమస్త శరీరులు ప్రవాహ జలములవలన ఇకను లయపరచబడరు; భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రవాహము కలుగదని పలికెను. 12మరియు దేవుడు–నాకును మీకును మీతోకూడనున్న సమస్త జీవరాసులకును మధ్య నేను తరతరములకు ఏర్ప రచుచున్న నిబంధనకు గురుతు ఇదే. 13మేఘములో నా ధనుస్సును ఉంచితిని; అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గురుతుగా నుండును. 14భూమిపైకి నేను మేఘమును రప్పించునప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. 15అప్పుడు నాకును మీకును సమస్త జీవరాసులకును మధ్య నున్న నా నిబంధనను జ్ఞాపకము చేసికొందును గనుక సమస్త శరీరులను నాశనము చేయుటకు ఆలాగు ప్రవాహముగా నీళ్లు రావు. 16ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాని చూచి దేవునికిని భూమిమీదనున్న సమస్త శరీరులలో ప్రాణముగల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసికొందుననెను. 17మరియు దేవుడు –నాకును భూమిమీదనున్న సమస్తశరీరులకును మధ్య నేను స్థిరపరచిన నిబంధనకు గురుతు ఇదే అని నోవహుతో చెప్పెను.
18ఓడలోనుండి వచ్చిన నోవహు కుమారులు షేము హాము యాపెతనువారు; హాము కనానుకు తండ్రి. 19ఈ ముగ్గురు నోవహు కుమారులు; వీరి సంతానము భూమియందంతట వ్యాపించెను.
20నోవహు వ్యవసాయము చేయనారంభించి, ద్రాక్ష తోట వేసెను. 21పిమ్మట ద్రాక్షారసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా నుండెను. 22అప్పుడు కనానుకు తండ్రియైన హాము తన తండ్రి వస్త్రహీనుడైయుండుట చూచి బయటనున్న తన యిద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. 23అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుటవలన తమ తండ్రి దిసమొలను చూడలేదు. 24అప్పుడు నోవహు మత్తునుండి మేలుకొని తన చిన్నకుమారుడు చేసినదానిని తెలిసికొని–
25కనాను శపింపబడినవాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనెను.
26మరియు అతడు– షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక కనాను అతనికి దాసుడగును.
27దేవుడు యాపెతును విశాలపరచును అతడు షేము గుడారములలో నివసించును అతనికి కనాను దాసుడగును అనెను.
28ఆ జలప్రవాహము గతించిన తరువాత నోవహు మూడువందల ఏబది యేండ్లు బ్రదికెను. 29నోవహు బ్రదికిన దినములన్నియు తొమ్మిదివందల ఏబది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.

Destacar

Compartir

Copiar

None

¿Quieres guardar tus resaltados en todos tus dispositivos? Regístrate o Inicia sesión