ఆదికాండము 9
9
నూతన ఆరంభం
1నోవహును, అతని కుమారులను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అతనితో చెప్పాడు: “అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపు. 2భూమిమీదనున్న ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, నేలమీద ప్రాకు ప్రతి ప్రాణి, సముద్రంలోని ప్రతి చేప నీకు భయపడతాయి. వాటన్నిటిపైన నీవు పాలకునిగా ఉంటావు.” 3“గతంలో నీవు తినేందుకు పచ్చ మొక్కల్ని ఇచ్చాను. ఇప్పుడు ప్రతి జంతువు నీకు ఆహారం అవుతుంది. భూమిపైనున్న సమస్తాన్ని నీకు ఇస్తున్నాను. అదంతా నీదే. 4అయితే నీకు నేను ఒక ఆజ్ఞ యిస్తున్నాను. దానిలో ఇంకా ప్రాణము (రక్తం) ఉన్న మాంసాన్ని మీరు తినకూడదు. 5అనగా ఏ మనిషినైనా ఒక జంతువు చంపితే దాని రక్తాన్ని అడుగుతాను, అలానే ఏ మనిషినైనా మరో మనిషి ప్రాణం తీస్తే, ఆ మనిషి రక్తాన్ని అడుగుతాను.
6“దేవుడు అచ్చం తనలాగే మనుష్యులను చేశాడు.
కనుక యింకొక మనిషిని చంపినవాడు మరో మనిషి చేత చంపబడాలి.
7“నోవహూ! నీవు, నీ కుమారులు అధిక సంతానం కలిగి, నీ జనంతో భూమిని నింపుదురు గాక!”
8తర్వాత నోవహుతో, అతని కుమారులతో దేవుడు ఇలా అన్నాడు: 9“నీతోను నీ తర్వాత నీ ప్రజలతోను ఇప్పుడు నేను నా వాగ్దానం చేస్తున్నాను. 10నీతోబాటు ఓడలో నుండి బయటకు వచ్చిన పక్షులన్నింటితోను, పశువులన్నింటితోను, జంతువులన్నింటితోను నేను వాగ్దానం చేస్తున్నాను. భూమి మీదనున్న ప్రతి ప్రాణితో నేను వాగ్దానం చేస్తున్నాను. 11ఇదే నీకు నా వాగ్దానం. వరదనీటిచేత, భూమిమీద సకల ప్రాణులు నాశనం చేయబడ్డాయి. అయితే ఇక ఎన్నటికీ మరల అలా జరుగదు. భూమిమీద సకల ప్రాణులను ఒక వరద మాత్రం ఇక ఎన్నటికీ తిరిగి నాశనం చేయదు.”
12తర్వాత నోవహు, అతని కుమారులతో యెహోవా యిలా అన్నాడు: “ఈ వాగ్దానం నేను మీకు యిచ్చినట్లు రుజువుగా నేను మీకు ఒకటి ఇస్తాను. మీతోను, భూమిమీద జీవించే ప్రతి ప్రాణితోను ఈ వాగ్దానం నేను చేశానని చెప్పేందుకు ఇది రుజువు. ఈ వాగ్దానం రాబోయే కాలములన్నిటిలో కొనసాగుతుంది. ఇదే ఆ రుజువు. 13మేఘాల్లో నా రంగుల ధనస్సునుంచుచున్నాను. నాకు, భూమికి జరిగిన ఒడంబడికకు రుజువు ఆ రంగుల ధనస్సు. 14భూమికి పైగా మేఘాలను నేను రప్పించినపుడు, మేఘాలలో రంగుల ధనస్సును మీరు చూస్తారు. 15రంగుల ధనస్సును నేను చూపినప్పుడు నీతోను, భూమిమీదనున్న సకల ప్రాణులతోను జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. ఈ భూమిమీద సకల ప్రాణులను ఒక జలప్రళయం మాత్రం ఇంకెన్నడూ నాశనం చేయదు అని ఆ ఒప్పందం చెబుతోంది. 16మేఘాల్లో ఆ రంగుల ధనస్సును నేను చూచినప్పుడు శాశ్వతంగా కొనసాగే ఆ ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నాకును, భూమిమీద సకల ప్రాణులకును మధ్య జరిగిన ఒడంబడికను నేను జ్ఞాపకం చేసుకొంటాను.”
17కనుక, “భూమిమీద సకల ప్రాణులతోను నేను చేసిన ఒడంబడికకు ఆ మేఘ ధనస్సు రుజువు” అని యెహోవా నోవహుతో చెప్పాడు.
మళ్లీ సమస్యలు ప్రారంభం
18నోవహుతో కూడ అతని కుమారులు ఓడలోనుండి బయటకు వచ్చారు. వారి పేర్లు షేము, హాము, యాఫెతు. (హాము కనానుకు తండ్రి). 19ఆ ముగ్గురు మగవాళ్లు నోవహు కుమారులు. మరియు భూమిమీద ప్రజలంతా ఆ ముగ్గురి కుమారులనుండి వచ్చినవాళ్లే.
20నోవహు వ్యయసాయదారుడయ్యాడు. అతడు ఒక ద్రాక్షతోట నాటాడు. 21నోవహు ద్రాక్షారసం చేసి, దాన్ని త్రాగాడు. అతడు మత్తెక్కి తన గుడారంలో పండుకొన్నాడు. నోవహు బట్టలు ఏమీ వేసుకొనలేదు. 22కనాను తండ్రి హాము, దిగంబరంగా ఉన్న తన తండ్రిని చూశాడు. గుడారం వెలుపలున్న తన సోదరులతో హాము ఈ విషయం చెప్పాడు. 23అప్పుడు షేము, యాఫెతు కలసి ఒక అంగీని తెచ్చారు. వాళ్లు ఆ అంగీని తమ భుజాలమీద మోసి గుడారంలోకి తీసుకువెళ్లారు. వారు వెనక్కి గుడారంలోకి నడిచివెళ్లి బట్టలు లేకుండా ఉన్న తమ తండ్రి ఒంటిమీద బట్ట కప్పారు.
24ఆ తర్వాత నోవహు మేల్కొన్నాడు. (ద్రాక్షారసంవల్ల అతడు నిద్రపోతూ ఉన్నాడు). అప్పుడు తన చిన్న కుమారుడు హాము తనకు చేసినదాన్ని అతడు తెలుసుకొన్నాడు. 25కనుక నోవహు అన్నాడు:
“కనాను#9:25 కనాను హాము కుమారుడు. కనానీ ప్రజలు పాలస్తీనా తీర ప్రాంతం, లెబనోను, సిరియా ప్రాంతాలలో నివసించారు. తర్వాత, ఈ దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. శపించబడును గాక!
కనాను తన సోదరులకు బానిస అగును గాక!”
26నోవహు ఇంకా ఇలా అన్నాడు:
“షేము దేవుడగు యెహోవా స్తుతించబడును గాక!
కనాను షేముకు బానిస అవును గాక.
27యాఫెతుకు దేవుడు ఇంకా ఎక్కువ భూమిని ఇచ్చును గాక!
షేము గుడారాలలో దేవుడు నివసించును గాక!
కనాను వారికి బానిస అవును గాక!”
28జలప్రళయం తర్వాత నోవహు 350 సంవత్సరాలు బ్రతికాడు. 29నోవహు మొత్తం 950 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత అతడు మరణించాడు.
Šiuo metu pasirinkta:
ఆదికాండము 9: TERV
Paryškinti
Dalintis
Kopijuoti
Norite, kad paryškinimai būtų įrašyti visuose jūsų įrenginiuose? Prisijunkite arba registruokitės
Telugu Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 1997 Bible League International
Šis skyrius šioje versijoje neprieinamas. Pasirinkite kitą skyrių ar versiją.