మత్తయి 28

28
యేసు పునరుత్థానము
1సబ్బాతు దినం గడిచిన తర్వాత, వారం మొదటి రోజున, తెల్లవారేటప్పుడు మగ్దలేనే మరియ, వేరొక మరియ సమాధిని చూడడానికి వచ్చారు.
2అకస్మాత్తుగా భయంకరమైన భూకంపం వచ్చింది, ఎందుకంటే పరలోకం నుండి ప్రభువు దూత దిగి వచ్చి, సమాధి దగ్గరకు వెళ్లి, ఆ రాయిని వెనక్కి దొర్లించి దాని మీద కూర్చున్నాడు. 3ఆ దూత రూపం మెరుపులా, అతని బట్టలు మంచులా తెల్లగా ఉన్నాయి. 4ఆ కాపలావారు దూతను చూసి భయంతో వణికి చచ్చినవారిలా పడిపోయారు.
5దూత ఆ స్త్రీలతో, “భయపడకండి, మీరు సిలువ వేయబడిన, యేసును వెదకుతున్నారు అని నాకు తెలుసు. 6ఆయన ఇక్కడ లేరు; తాను చెప్పినట్లే, ఆయన లేచారు. రండి ఆయనను పడుకోబెట్టిన స్థలాన్ని చూడండి. 7త్వరగా వెళ్లి ఆయన శిష్యులతో, ‘యేసు మృతులలో నుండి లేచారు, ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్తున్నారు. అక్కడ మీరు ఆయనను చూస్తారు’ అని చెప్పండి. నేను మీతో చెప్పింది జ్ఞాపకముంచుకోండి” అన్నాడు.
8ఆ స్త్రీలు భయపడినప్పటికీ గొప్ప ఆనందంతో, యేసు శిష్యులకు ఆ సమాచారం చెప్పడానికి సమాధి దగ్గర నుండి త్వరగా పరుగెత్తి వెళ్లారు. 9అకస్మాత్తుగా యేసు వారిని కలిసారు. ఆయన వారికి “శుభములు” అని చెప్పారు. వారు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన పాదాలను పట్టుకొని ఆయనను ఆరాధించారు. 10యేసు వారితో, “భయపడకండి, మీరు వెళ్లి నా సహోదరులను గలిలయకు వెళ్లుమని చెప్పండి; అక్కడ వారు నన్ను చూస్తారు” అని వారికి చెప్పారు.
కాపలావారి నివేదిక
11ఆ స్త్రీలు మార్గంలో ఉండగానే, సమాధి దగ్గర ఉన్న కాపలావారిలో కొంతమంది పట్టణంలోనికి వెళ్లి, జరిగిన విషయాలన్నింటిని ముఖ్య యాజకులతో చెప్పారు. 12అందుకు వారు యూదా నాయకులతో కలసి ఆలోచించి, ఆ సైనికులకు చాలా డబ్బు లంచంగా ఇచ్చి, 13“మేము నిద్రపోతున్నప్పుడు, ‘రాత్రి సమయంలో యేసు శిష్యులు వచ్చి ఆయనను ఎత్తుకుపోయారు’ అని చెప్పండి. 14ఒకవేళ ఇది అధిపతికి తెలిసినా, మేము అతనికి చెప్పి మీకు ఏ ప్రమాదం కలుగకుండా చూస్తాము” అని వారికి మాట ఇచ్చారు. 15కనుక సైనికులు ఆ డబ్బు తీసుకొని వారితో చెప్పిన ప్రకారం చేశారు. ఈ కథ ఇప్పటికీ యూదులలో చాలా వ్యాపించి ఉంది.
గొప్ప ఆదేశం
16ఆ పదకొండు మంది శిష్యులు యేసు తమకు చెప్పినట్లే, గలిలయలోని కొండకు వెళ్లారు. 17వారు ఆయనను చూసినప్పుడు, ఆయనను ఆరాధించారు గాని కొందరు సందేహించారు. 18యేసు వారి దగ్గరకు వచ్చి, “పరలోకంలోను భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది. 19కనుక మీరు వెళ్లి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేరున బాప్తిస్మమిస్తూ, అన్ని దేశాలను#28:19 లేక సర్వ జనాంగాలు శిష్యులుగా చేసి, 20నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులన్నిటిని, వారు పాటించాలని మీరు వారికి బోధించండి. గుర్తుంచుకోండి, నేను యుగాంతం వరకు, ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను” అని వారితో చెప్పారు.

Markering

Deel

Kopiëren

None

Wil je jouw markerkingen op al je apparaten opslaan? Meld je aan of log in