2
యాజకులకు అధనపు హెచ్చరిక
1“యాజకులారా, ఈ ఆజ్ఞ మీ కోసమే! 2మీరు నా మాట వినకుండా నా పేరును మనసారా గౌరవించడానికి నిశ్చయించుకోకపోతే, నేను మీ మీదికి శాపం రప్పిస్తాను. మీరు పొందుకున్న దీవెనలను కూడా నేను శాపాలుగా మారుస్తాను. నిజానికి, మీరు నా హెచ్చరికను గుర్తు ఉంచుకోలేదు కాబట్టి నేను ఇప్పటికే వాటిని శాపాలుగా మార్చాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
3“నేను మీ కారణంగా మీ సంతానాన్ని#2:3 లేదా మీ ధాన్యాన్ని తుడిచివేస్తాను గద్దిస్తాను; మీ పండుగల్లో మీరు అర్పించే పశువుల పేడ మీ ముఖాల మీద వేస్తాను. దానితో పాటు మీరు కూడా ఊడ్చివేయబడతారు. 4నేను లేవీయులకు చేసిన ఒడంబడిక ఉండిపోయేలా నేనే మీకు ఈ ఆజ్ఞ ఇచ్చానని మీరు తెలుసుకుంటారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. 5నేను లేవీయులతో చేసిన నిబంధన జీవానికి సమాధానానికి సంబంధించింది. వారు నా పట్ల భయభక్తులు చూపాలని అవి వారికి ఇచ్చాను. అప్పుడు వారు నన్ను గౌరవించి నా పేరు పట్ల భయభక్తులు కలిగివుంటారు. 6సత్యమైన ఉపదేశం వారి నోటి నుండి వెలువడిందే తప్ప దుర్బోధ ఏమాత్రం కాదు. వారు సమాధానంతో నిజాయితీ కలిగి నా సహవాసంలో నడిచారు. వారు అనేకులను పాపం విడిచిపెట్టేలా చేశారు.
7“యాజకులు సైన్యాలకు అధిపతియైన యెహోవా దూతలు. ఎందుకంటే మనుష్యులు వారి నోట ధర్మశాస్త్రం విని నేర్చుకుంటారు. కాబట్టి వారు జ్ఞానాన్ని కలిగి బోధించాలి. 8మీరైతే దారి తప్పారు, మీ ఉపదేశం వల్ల అనేకులు తడబడ్డారు, నేను లేవీయులతో చేసిన ఒడంబడికను వమ్ము చేశారు” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు. 9“నా మార్గాలను అనుసరించక, ధర్మశాస్త్ర విషయాల్లో పక్షపాతం చూపుతూ వచ్చారు, కాబట్టి ప్రజలందరి కళ్లెదుటే మిమ్మల్ని అణచివేసి తృణీకారానికి గురిచేస్తాను” అని సైన్యాల యెహోవా ప్రకటిస్తున్నారు.
విడాకుల ద్వారా ఒడంబడికను ఉల్లంఘించుట
10మనకందరికి తండ్రి ఒక్కడు కాదా? ఒక్క దేవుడే మనల్ని సృజించలేదా? అలాంటప్పుడు ఒకరిపట్ల ఒకరం నమ్మకద్రోహం చేస్తూ దేవుడు మన పూర్వికులతో చేసిన నిబంధనను ఎందుకు అపవిత్రం చేస్తున్నాము?
11యూదా వారు నమ్మకద్రోహులయ్యారు, ఇశ్రాయేలీయుల మధ్య యెరూషలేములో అసహ్యమైన పనులు జరుగుతున్నాయి. యూదా వారు యెహోవా ప్రేమించే పరిశుద్ధాలయాన్ని అపవిత్రపరచి ఇతర దేవతలను పూజించేవారి స్త్రీలను పెండ్లి చేసుకున్నారు. 12ఇలా చేసినవారు ఎవరైనా సరే యాకోబు వంశీయుల డేరాలలో లేకుండా సైన్యాలకు అధిపతియైన యెహోవాకు నైవేద్యాలు అర్పించేవారి సహవాసంలో లేకుండా యెహోవా నిర్మూలించు గాక!
13మీరు మరొకసారి అలాగే చేస్తున్నారు: మీ కన్నీళ్లతో యెహోవా బలిపీఠాన్ని తడుపుతున్నారు. ఆయన మీ నైవేద్యాలను ఇష్టపడరు వాటిని మీ నుండి సంతోషంతో స్వీకరించరు కాబట్టి మీరు ఏడుస్తూ రోదిస్తారు. 14“ఎందుకు?” అని మీరడుగుతారు. ఎందుకంటే నీకు నీ యవ్వనకాలంలో నీవు పెండ్లాడిన భార్యకు మధ్య యెహోవా సాక్షిగా ఉన్నారు. ఆమె నీ భాగస్వామి, నీ చేసిన వివాహ నిబంధన వలన నీ భార్య అయినప్పటికీ నీవు ఆమెకు ద్రోహం చేశావు.
15ఆయన మీ ఇద్దరిని ఒకటి చేయలేదా? శరీరం, ఆత్మ రెండూ ఆయనకే చెందుతాయి గదా! అలా ఒకటిగా చేయడం ఎందుకు? దేవుని మూలంగా వారికి సంతానం కలగాలని కదా! అందుచేత మీ హృదయాన్ని మీరు కాపాడుకోండి, యవ్వనంలో పెండ్లాడిన మీ భార్యకు ద్రోహం చేయకండి.
16“పెళ్ళి బంధాన్ని తెంచడం నాకు అసహ్యం అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అంటున్నారు. మనిషి వస్త్రంలా దౌర్జన్యాన్ని కప్పుకోవడం కూడా నాకు అసహ్యం” అని సైన్యాలకు అధిపతియైన యెహోవా అంటున్నారు.
కాబట్టి మీ హృదయాలను కాపాడుకోండి, ద్రోహం తలపెట్టకండి.
అన్యాయం చేసి ఒడంబడికను ఉల్లంఘించుట
17మీరు మీ మాటచేత యెహోవాకు విసుగు పుట్టిస్తున్నారు.
“ఆయనకు విసుగు ఎలా కలిగించాం?” అని మీరు అడుగుతున్నారు.
“చెడు చేసేవారంతా యెహోవా దృష్టికి మంచి వారు, అలాంటి వారంటే ఆయనకు ఇష్టమే, లేకపోతే న్యాయం జరిగించే దేవుడు ఏమయ్యాడు?” అని అడుగుతూ ఆయనకు విసుగు పుట్టిస్తున్నారు.